వ్యక్తిగత కారణాలతోనే టీడీపీకి రాజీనామా

ABN , First Publish Date - 2020-06-05T10:52:29+05:30 IST

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్..

వ్యక్తిగత కారణాలతోనే టీడీపీకి రాజీనామా

మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్‌


చిత్తూరు(ఆంధ్రజ్యోతి): చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్‌ గురువారం టీడీపీ సభ్యత్వానికి, చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలకు రాజీనామా చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘వ్యక్తిగత కారణాలతో నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పార్టీకి న్యాయం చేయలేకపోతున్నా. గత ఎన్నికల్లో నా కోసం పనిచేసిన టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు.


ఇంత వరకు నన్ను ఆదరించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్‌, జిల్లా నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. నా  రాజీనామా వెనుక ఎవరి ప్రమేయం లేదు. ఏ పార్టీలో చేరతాననేది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పట్లో ఏ పార్టీలో చేరే ఆలోచన లేదు. ప్రస్తుతం నేను మాత్రమే పార్టీకి రాజీనామా చేస్తున్నా. నా అనుచరులు, మద్దతుదారులెవ్వర్నీ పార్టీ నుంచి దూరం చేసే ఆలోచన లేదు. టీడీపీ మీద నాకు ఎలాంటి అసంతృప్తి లేదు’ అని వివరించారు.


ఆర్థికమూలాలను దెబ్బతీసేలా వైసీపీ ఎత్తుగడలు

వ్యక్తిగత కారణాలతోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని మనోహర్‌ ప్రకటించినా, తెరవెనుక ఏం జరిగిందనే చర్చ జోరుగా నడుస్తోంది. యాదమరి మండలం కొటాలలో, తవణంపల్లె మండలం మైనగుండ్లపల్లెలో మనోహర్‌కు క్వారీలున్నాయి. మైనగుండ్లపల్లెలోని క్వారీ ప్రారంభం కావాల్సి ఉంది. కొటాలలోని క్వారీకి అధికార పార్టీ వత్తిడితో రూ.కోట్లలో జరిమానా విధించేందుకు అధికారులు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న మనోహర్‌ టీడీపీ సీనియర్‌ లీడర్లను సంప్రదించగా.. న్యాయపోరాటం చేద్దామని సలహా ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తాను కోర్టుకు వెళ్లినా వైసీపీ నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండబోతున్న నేపథ్యంలో ఇలాంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అంచనాకు వచ్చినట్లు సమాచారం.


మూడు నాలుగు నెలలుగా జరుగుతున్న ఈ వ్యవహారంలో ఇప్పటికే రెండుసార్లు జిల్లాకు చెందిన అధికార పార్టీ పెద్ద నేతను మనోహర్‌ కలిశారు. వైసీపీలోకి వస్తే క్వారీల విషయంలో సహాయం చేస్తానని ఆయన ఇచ్చిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమైందని, లేకుంటే మూడు నెలల కిందటే టీడీపీకి ఆయన రాజీనామా చేసేవాడని సమాచారం. ‘నా వల్ల నా బిడ్డల భవిష్యత్తుకు ఇబ్బంది కలగకూడదని ఈ నిర్ణయం తీసుకుంటు’న్నట్లు మనోహర్‌ తన సన్నిహితులతో అన్నట్లు చెప్పుకుంటున్నారు.

Updated Date - 2020-06-05T10:52:29+05:30 IST