మహా దళాధిపతిగా..

ABN , First Publish Date - 2021-12-09T07:36:23+05:30 IST

త్రివిధ దళాల మధ్య మెరుగైన సమన్వయం సాధించే లక్ష్యంతో మహా దళాధిపతిగా 2019 చివర్లో బాధ్యతలు చేపట్టిన జనరల్‌ బిపిన్‌ రావత్‌ గత రెండేళ్లలో ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నారు.

మహా దళాధిపతిగా..

  • జాయింట్‌ థియేటర్‌ కమాండ్స్‌కు రావత్‌ కసరత్తు
  • చైనా, పాక్‌ లక్ష్యంగా రెండు భౌగోళిక కమాండ్స్‌
  • ఆయుధ కొనుగోళ్ల తీరులోనూ మార్పులు


త్రివిధ దళాల మధ్య మెరుగైన సమన్వయం సాధించే లక్ష్యంతో మహా దళాధిపతిగా 2019 చివర్లో బాధ్యతలు చేపట్టిన జనరల్‌ బిపిన్‌ రావత్‌ గత రెండేళ్లలో ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నారు. ఆర్మీ, వైమానిక దళం, నౌకా దళం దేనికదే కాకుండా యుద్ధ సమయంలో పూర్తి సమన్వయంతో వ్యవహరించేలా ‘జాయింట్‌ థియేటర్‌ కమాండ్స్‌’ ఏర్పాటు కసరత్తును ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం ప్రాంతాలవారీగా ఆర్మీలో 7, వాయుసేనలో 7, నౌకాదళంలో 3 కమాండ్స్‌ ఉన్నాయి. అయితే త్రివిధ దళాలు వేటికవి ప్రాంతాలవారీ విభాగాలు ఏర్పాటు చేసుకోవడం కాకుండా త్రివిధ దళాలతో కూడిన సంయుక్త కమాండ్స్‌ను ఏర్పాటు చేయాలన్నది రావత్‌ ప్రతిపాదన. దాని ప్రకారం... పాకిస్థాన్‌, చైనాలను దృష్టిలో ఉంచుకుని రెండు భౌగోళిక థియేటర్‌ కమాండ్స్‌ ఏర్పాటవుతాయి. పాకిస్థాన్‌ నుంచి రక్షణ కోసం జైపూర్‌ కేంద్రంగా పశ్చిమ థియేటర్‌ కమాండ్‌, చైనాను నిలువరించడం కోసం కోల్‌కతా లేదా లక్నో కేంద్రంగా తూర్పు థియేటర్‌ కమాండ్‌ పనిచేస్తాయి. 


ఈ రెండు కమాండ్స్‌ పరిధిలో ఆర్మీ, వాయుసేన, నౌకాదళాలు పూర్తి సమన్వయంతో వ్యవహరించేలా ఈ కమాండ్స్‌ రూపురేఖల్ని నిర్ణయించే బాధ్యతను ఇద్దరు సీనియర్‌ ఆర్మీ అధికారులకు అప్పగించారు. అలాగే త్రివిధ దళాల త్రివిధ దళాల వద్ద ఉన్న మొత్తం విమానాలు, హెలికాప్టర్లతో కూడిన ఎయిర్‌ డిఫెన్స్‌ కమాండ్‌ ఒక దానిని, త్రివిధ దళాల వద్ద ఉన్న నౌకా వనరులన్నింటితో కూడిన మారిటైమ్‌ డిఫెన్స్‌ కమాండ్‌ ఒకదానిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వాయుసేన, నౌకాదళం నుంచి ఒక్కో సీనియర్‌ అధికారికి ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ థియేటర్‌ కమాండ్స్‌ ఏర్పాటు ప్రతిపాదనను వాయుసేన మాజీ చీఫ్‌ కృష్ణస్వామి సహా కొందరు రక్షణ నిపుణులు వ్యతిరేకించారు. రక్షణ రంగంలో స్వావలంబన కలిగిన అగ్ర దేశాల నమూనాను భారత్‌ గుడ్డిగా అనుకరించడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. తమ వద్ద ఉన్న వనరులే అతి స్వల్పమని, వాటిని ఇలా థియేటర్లవారీగా పంచేయడం సరికాదని వాయుసేన సైతం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే దీనిపై ముందుకు వెళ్లేందుకే మోదీ సర్కారు కృతనిశ్చయంతో ఉంది. వాయుసేన అభ్యంతరాల గురించి రావత్‌ను ఒక సదస్సులో ప్రశ్నించగా ‘‘వాయుసేన వనరులు ఇప్పటికే వివిధ కమాండ్ల కింద విభజితమై ఉన్నాయి కదా! వాటన్నింటినీ ఎత్తేయాలని వాయుసేన భావిస్తోందా ఏమిటి?’’ అని ఘాటుగా బదులిచ్చారు.


రక్షణ కొనుగోళ్లకు సంబంధించి కూడా రావత్‌ అనేక మార్పులు తీసుకువచ్చారు. ఆయుధాలను ఒకేసారి పెద్దసంఖ్యలో కొనేబదులు విడతలవారీగా కొనడం మంచిదని, దానివల్ల అన్ని ఆయుధాలూ ఒకేసారి పాతబడిపోవడం జరగదని ఆయన ప్రతిపాదించారు. (అయితే ఇలా తక్కువ సంఖ్యలో కొంటే విదేశాల నుంచి మనకు సాంకేతిక పరిజ్ఞాన బదిలీ జరగదని, ఆయుధాల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఇప్పటికే ఉన్న ఆయుధాలనే మళ్లీ మళ్లీ కొనాల్సి వస్తుందని, కొత్త ఆయుధాలను ఎంపిక చేసుకునే అవకాశం కోల్పోతామని కొందరు రక్షణ నిపుణులు వ్యాఖ్యానించారు) కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి ఖరీదైన ఆయుధ కొనుగోళ్లను మానుకోవాలని, నాణ్యతా ప్రమాణాల్లో 70 శాతమే ఉన్నా సరే స్వదేశీ ఆయుధాలనే కొనుగోలు చేయాలని సాయుధ దళాలకు రావత్‌ సూచించారు. రావత్‌ హయాంలో జరిగిన రక్షణ కొనుగోళ్లు దాదాపుగా ఇదే సూత్రాన్ని అనుసరించి ఉండడం విశేషం.

-డిఫెన్స్‌ ప్రత్యేక ప్రతినిధి, ఆంధ్రజ్యోతి

Updated Date - 2021-12-09T07:36:23+05:30 IST