ధాన్యం రైతుల దగా

ABN , First Publish Date - 2020-06-04T09:37:51+05:30 IST

ఆరుగాళం శ్రమించి పంట పండించిన రైతులు ధాన్యం విక్రయాలకు వచ్చేసరికి దగాకు గురవు తున్నారు.

ధాన్యం రైతుల దగా

సిండికేట్‌గా మారిన రైస్‌మిల్లర్లు 

తాలు పేరుతో ధాన్యం తూకంలో కోత

క్వింటాలుకు 6 నుంచి 8 కిలోలు స్వాహా

నాణ్యత లేకేనంటున్న అధికారులు

అలాంటిదేమీ లేదంటున్న రైతులు

జిల్లాలో ఇప్పటికే 17వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు


(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ఆరుగాళం శ్రమించి పంట పండించిన రైతులు ధాన్యం విక్రయాలకు వచ్చేసరికి దగాకు గురవు తున్నారు. ప్రైవేటు దళారులకు అమ్మితే నష్టపోతు న్నారన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వమే సివిల్‌ సప్లయి విభాగం ద్వారా ధాన్యం కొనుగోల్లు చేపట్టింది. జిల్లాలో ఈయేడు రబీలో 20వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేయగా ఇందులో ఇప్పటికే 17 వేల మెట్రిక్‌ టన్నులను 25 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. ఇవి పోగా ఇంకా రైతుల వద్ద మూడు  వేల నుంచి నాలుగు వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ధాన్యం అంతా   ప్రస్తుతం కల్లాలు, పంట పొలాల్లో కోతకు సిద్ధంగా ఉంది. అయితే కొంతకాలంగా కొనుగోళ్ల ప్రక్రియలో రైస్‌ మిల్లర్లు కుమ్మక్కై రైతుల ధాన్యాన్ని దొడ్డిదారిన స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధాన్యంలో తాలు, పచ్చగింజల పేరుతో క్వింటాల్‌కు 6 నుంచి 8 కిలోల మేర కోత పెట్టి కేవలం 92 నుంచి 94 కిలోలకు మాత్రమే ఖరీదు కడుతున్న పరిస్థితి కొనసా గుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


వాస్తవానికి జిల్లాలో ఈ రబీ సీజన్‌లో 25 నుంచి 35 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండినట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో మూడు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, 22ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు కొనుగోళ్ల ప్రక్రియను చేపట్టాయి. ఇవి కాకుండా రైతులు నేరుగా రైస్‌మిల్లర్లకే విక్రయిస్తున్న పరిస్థితి జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలో ఉన్న నాలుగు పారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్ల యజమానులు సిండికేట్‌గా మారి ధాన్యం తూకాల్లో కోత విధించడాన్ని నిర్దేశిస్తున్నట్లు చెబుతు న్నారు. దాంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అటు రైతులకు సమాధానం చెప్పలేక ఇటు రైస్‌మిల్లర్ల దగాను నివారించలేక గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫైన్‌ క్వాలిటీ దొడ్డు రకం వరి ధాన్యానికి రూ.1,835 మద్దతు ధర చెల్లిస్తుండగా డి-గ్రేడ్‌ రకానికి రూ.1,815 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది.


అయితే రబీ సీజన్‌లో వచ్చేదంతా ఏ-గ్రేడ్‌ ధాన్యంగానే పరిగణిస్తున్నారు. ఇక ప్రైవేటు కొనుగోలుదారుల విష యానికి వస్తే వ్యాపారులు రైతులను బట్టి రూ.1,200 నుంచి రూ.1,650 వరకు ధర చెల్లిస్తున్నట్లు చెబు తున్నారు. దాంతో చాలా మంది రైతులు ఎక్కువ ధర వస్తుందని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే ఇక్కడ కోతల పేరిట తమకు దక్కుతుందనుకున్న అదనపు మొత్తం కాజేస్తున్నారని వాపోతున్నారు. రైస్‌ మిల్లర్ల నిర్వాకం ఫలితంగా సదరు రైతులు ఒక్కో క్వింటాలుపై రూ.180 నుంచి రూ.200 నష్టపోతున్నట్లు తెలుస్తోంది. దీన్ని ప్రాతిపదికగా తీసుకుంటే బహిరంగ మార్కెట్‌కు, ప్రభుత్వం చెల్లిస్తున్న మద్దతు ధరకు పెద్ద లాభం చేకూరే పరిస్థితి లేనట్లేనని చెబుతున్నారు. 


దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు 

రైస్‌మిల్లర్లు తూకాల్లో కోతలు పెడుతూ రైతులను దగా చేస్తున్నా అధికార యంత్రాంగం ఎందుకు పట్టిం చుకోవడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దాంతో మొత్తంగా అధికారులు, రైస్‌మిల్లర్లు కుమ్మక్క య్యారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే రబీ సీజన్‌లో పంట నూర్పిడి ప్రక్రియలో రైతులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్ల చెత్త, తాలు, రంగు మారిన గింజల కారణంగానే రైస్‌మిల్లర్లు ఇలాంటి కోతలు విధిస్తున్నారని అధికారులు వెనుకేసుకచ్చే ప్రయత్నాలు చేయడం అనేక సందేహాలకు ఆస్కారం కల్పిస్తోంది. ధాన్యం నిబంధనల ప్రకారం లేని పక్షంలో అసలు కొనుగోలు చేయకుండా తిరస్కరించాలి కానీ కోతలు విధించి రైతులకు చెల్లింపులు జరపడమేంటని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 


నిబంధనలు ఏం చెబుతున్నాయి?

కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినప్పుడు ధాన్యం లో తేమ 17శాతం లోపు ఉండాలి. అలాగే ధాన్యంలో చెత్త చెదారం వంటి ఇతర మలిన పదార్థాలకు సంబంధించి ఒక్క శాతం మించరాదు. అలాగే రంగు మారి, నాణ్యత దెబ్బతిన్న, ఇతర రకాలు కలిసిన ధాన్యం 6శాతానికి మించి ఉండరాదని నిబంధనలు సూచిస్తున్నాయి. అంతేకాదు ప్రమా ణాలకు అనుగు ణంగా లేని ధాన్యాన్ని రైతులు తిరిగి శుభ్రం చేసి తెచ్చే ఏర్పాట్లు చేయాలి. అప్పుడు మాత్రమే కొనుగోళ్లకు అంగీకరించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఈ ప్రమాణా లేవి అనుసరిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 


విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం -రాంబాబు, అదనపు కలెక్టర్‌

వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏమైనా అక్రమాలు జరుగుతున్నట్లు మా దృష్టికి వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. అయితే అక్కడక్కడ నాణ్యతాపరమైన లోపాలతో ఉన్న ధాన్యం కూడా వస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా భూమి స్వభావం కారణంగా రెబ్బెన, తిర్యాణి మండలాల్లో పండే వరి ధాన్యంలో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట నిజమేనని తేలింది. అయినా సాధ్యమైనంత వరకు రైతులకు సాయం చేయడమే లక్ష్యం. చెత్తతో ఉన్న ధాన్యాన్ని శుభ్రంగా తూర్పారబట్టి నాణ్యత ప్రమా ణాలకు అనుగుణంగా ఆరబెట్టిన తరువాతే విక్ర యాలకు తేవాలి. 

Updated Date - 2020-06-04T09:37:51+05:30 IST