వ్యాపారిని దోచుకున్న ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2020-07-09T10:25:09+05:30 IST

ప్రణాళిక రచించి, వ్యాపారిని టార్గెట్‌ చేసి డబ్బు దోచుకున్న దొంగల ముఠాలోని ఐదురుగు సభ్యులను..

వ్యాపారిని దోచుకున్న ముఠా అరెస్టు

రూ. 2.60 లక్షలు, కత్తులు, వాహనాలు, ఫోన్లు స్వాధీనం


హైదరాబాద్‌ సిటీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ప్రణాళిక రచించి, వ్యాపారిని టార్గెట్‌ చేసి డబ్బు దోచుకున్న దొంగల ముఠాలోని ఐదురుగు సభ్యులను ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో సీపీ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు. తలాబ్‌కట్ట అమన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ఫరూక్‌పాషా(26) కోఠిలో ఫార్మసీ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో ఫార్మసీ దుకాణం నిర్వాహకుడు రాత్రి ఇంటికి వెళ్తున్నప్పుడు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్తున్న విషయాన్ని ఫరూక్‌ పాషా గమనించాడు.


అతడి సంపాదన కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో వ్యాపారిని దోచుకునేందుకు పథకం రచించాడు. పురానీహవేలి ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ఫయాజ్‌ ఇమ్రాన్‌(25) అనే పాతనేరస్థుడిని సంప్రదించాడు. అతడు శాలిబండ ప్రాంతానికి చెందిన అమీర్‌ఖాన్‌(24), కాలాపత్తర్‌కు చెందిన మహ్మద్‌ వసీం(25), మొఘల్‌పురా నివాసి సయ్యద్‌ అబ్దుల్‌ఖదీర్‌ హుస్సేన్‌ అలియాస్‌ ఫైజల్‌, నాంపల్లికి చెందిన సమీర్‌ను కలుపుకొని ముఠాను సిద్ధం చేశాడు. 


10 రోజుల రెక్కీ..

పథకంలో భాగంగా ముఠా సభ్యులు పదిరోజులపాటు వ్యాపారి కదలికలపై నిఘా పెట్టారు. ఈనెల 4వ తేదీ రాత్రి 7 గంటలకు అందరూ పుత్లీబౌలి అమృత్‌ బార్‌ వద్దకు కత్తులు, స్ర్కూడైవర్‌ తీసుకొని రెండు ద్విచక్రవాహనాలపై చేరుకున్నారు. ఫైజల్‌ ఫార్మసీ దుకాణం వద్ద కాపు కాసి వ్యాపారి కదలికలను ఎప్పటికప్పుడు ముఠా సభ్యులకు చేరవేస్తున్నాడు. రాత్రి 9 గంటల సమయంలో వ్యాపారి నగదు తీసుకొని ఇంటికి బయలుదేరాడు.


ఫైజల్‌ సమాచారం ఇవ్వడంతో ముఠా సభ్యులు దుకాణం యజమాని యూటర్న్‌ తీసుకుంటున్నప్పుడు అడ్డగించారు. స్ర్కూడ్రైవర్‌తో దాడిచేసి రూ. 3.30 లక్షలు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అఫ్జల్‌గంజ్‌ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో కలిసి ప్రధాన నిందితుడు పాషా, సహకరించిన ఇమ్రాన్‌, అమీర్‌, వసీం, ఫైజల్‌ను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 2.60 లక్షలు, 2 కత్తులు, స్ర్కూడ్రైవర్‌, రెండు ద్విచక్రవాహనాలు, ఆరు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సమీర్‌ పరారీలో ఉన్నాడని సీపీ తెలిపారు. 

Updated Date - 2020-07-09T10:25:09+05:30 IST