కలెక్టరేట్: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటకు సంబంధించి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయ సమావేశ మందిరంలో పలు ప్రభుత్వ శాఖల అధికార్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 27న ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు వెల్లడించారు. అమ్మఒడి పథకం మూడో విడతను జిల్లా నుంచే ప్రారంభిస్తారని చెప్పారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం సమీపంలోని హెలీఫ్యాడ్ వద్ద ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ ఎస్‌ఈ కాంతిమతిని ఆదేశించారు. పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చూడాలని ఎస్పీ రాధికకు సూచించారు. వర్షం పడితే కోడి రామమూర్తి స్టేడియంలో నీరు నిల్వ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసును ఆదేశించారు. ప్రోటోకాల్ ఏర్పాట్లు చూసుకోవాలని ఆర్డీవో బి.శాంతికి సూచించారు. సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జేసీ ఎం.విజయ సునీత, డీఆర్వో ఎం.రాజేశ్వరి, డీఈవో పగడాలమ్మ, డీఎంహెచ్‌వో బి.మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.