చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-08-05T05:10:41+05:30 IST

ఈ ఏడు ఉచితంగా చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్టకేలకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనలో నిమగ్నమయ్యారు.

చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు

ఎట్టకేలకు పూర్తయిన టెండర్ల ప్రక్రియ

ఈ నెల 25 నుంచి పంపిణీకి కసరత్తు

నిండుకుండలా కనిపిస్తున్న జలాశయాలు

జిల్లా వ్యాప్తంగా కోటి 32 లక్షల చేప పిల్లలను వదిలేందుకు లక్ష్యం

ఆదిలాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడు ఉచితంగా చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్టకేలకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనలో నిమగ్నమయ్యారు. మొదట జిల్లాకు చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ఎవరూ ముందుకురాక పోవడంతో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో టెండర్ల గడువును పలుమార్లు పొడిగిస్తూ రావడంతో చివరకు ముగ్గురు కాంట్రాక్టర్లు చేప పిల్లలను సరఫరా చేసేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఈ ఏడు చేప పిల్లల పంపిణీకి మార్గం సుగమమం అయింది. ఈ నెల 25 నుంచి జిల్లా వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 270 చెరువులు, కుంటలు ఉండగా 265 చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 60 సొసైటీల పరిధిలో 4,230 మంది మత్స్యకార్మికులున్నారు. ఈ సారి జిల్లా వ్యాప్తంగా కోటి 32లక్షల చేప పిల్లలను వదిలేందుకు లక్ష్యం పెట్టుకున్నారు. అయితే చేప పిల్లల సరఫరా ఆలస్యం కావడంతో ఎదుగుదల పై ప్రభావం పడే అవకాశం ఉందని మత్స్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జూలైలోనే చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పూర్తయ్యేది. 

జీపీఎస్‌ ఆధారంగా..

ఇప్పటికే జిల్లాలో జీపీఎస్‌ శాటిలైట్‌ ద్వారా ప్రత్యేక సర్వేను పూర్తి చేశారు.దీని ద్వారా నీటి జాడలను గుర్తించారు. 270 చెరువులు, కుంటలు ఉన్నట్లు అం చనా వేయగా చేప పిల్లల పంపిణీకి 265 చెరువులు అనుకూలమని నిర్ణయించారు. మరో 22 చెక్‌డ్యాంలు అందుబాటులోకి రావడంతో వాటిలోను చేప పిల్లలను వదిలేందుకు సిద్ధమవుతున్నారు. గతేడు కోటి 23లక్షల చేప పిల్లలను వదిలిన అధికారులు ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో 9లక్షల చేప పిల్లలు అదనంగా కోటి 32 లక్షల చేప పిల్లలు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే స్థానికంగా మంచి డిమాండ్‌ ఉన్న కట్ల, రోకు, బొచ్చ, బంగారు తీగ లాంటి చేప పిల్లలను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చెరువులు, కుంటల్లో 35-40 ఎంఎం సైజు రిజర్వాయర్‌ ప్రాజెక్టుల్లో 80-100 ఎంఎం సైజు చేప పిల్లలను వదలనున్నారు. జిల్లాలో చిన్నపాటి చెరువులు, కుంటలే ఎక్కువగా ఉండడంతో వేసవికి ముందే నీటి నిల్వలు అడుగంటుక పోయే అవకాశం ఉంది. మరింత ఆలస్యం చేస్తే నష్టపోతామనే ఆందోళన మత్స్యకారుల్లో కనిపిస్తోంది. అయితే జిల్లాలో సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులో చేపపిల్లల పెంపకంతో పాటు రొయ్యల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో ఏడాదంతా సరిపడా నీటి నిల్వలు ఉండే అవకాశం ఉండడంతో రొయ్యల పెంపకానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

పుష్కలంగా నీటి నిల్వలు..

ఈ ఏడు జూన్‌, జూలై మూడో వారం వరకు అంతంత మాత్రంగానే వర్షపాతం నమోదు కావడంతో చేప పిల్లల పంపిణీ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. జూలై చివరిలో మాత్రం భారీ వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండు కుండల కనిపిస్తున్నాయి. అత్యధిక వర్షాలతో చెరువు లు మత్తడి పొర్లి పారడంతో మత్స్య సంపదను నష్ట పోవాల్సి వచ్చింది.  సాత్నాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 286.50 మీటర్లు కాగా ప్రస్తుతం 285.45 మీటర్లకు చేరింది. అలాగే మత్తడివాగు ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 277.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 276.95 మీటర్లకు చేరుకుని జలకళను సంతరించుకున్నాయి. మారుమూల గ్రామాల్లోనూ చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీటి నిల్వలు కనిపిస్తున్నాయి. ఈ ఏడు జిల్లా వ్యాప్తంగా 588.6 మి.మీల సాధారణ వర్షపాతం కురియాల్సి ఉండగా, ఇప్పటి 864.1మి.మీల అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఈ సారి చేప పిల్లల పెంపకానికి డోకా లేదన్న భావన మత్స్యకార్మికుల్లో కనిపిస్తోంది.


చేపల చెరువులను పరిశీలిస్తున్నాం..

: విజయ్‌కుమార్‌ (జిల్లా మత్స్యశాఖ అధికారి)

ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి వాటి ఆధారంగా క్షేత్ర స్థాయిలో చేపల చెరువులను పరిశీలిస్తున్నాం. ఈ సారి కొంత ఆలస్యమైనా ఆగస్టు 25 నుంచి ఎట్టి పరిస్థితుల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. జూన్‌ నుంచి పలుమార్లు టెండర్లను పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో జాప్యం జరిగింది. చివరకు ముగ్గురు కాంట్రాక్టర్లు చేపపిల్లల సరఫరాకు ముందుకొచ్చారు. ఈ ఏడు జిల్లా వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురియడంతో పుష్కలంగా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అంచనాలకు మించి చేప పిల్లల పంపిణీకి అవకాశాలున్నాయి.

Updated Date - 2021-08-05T05:10:41+05:30 IST