ఆ ‘సేతు ’ సారథులు వీళ్లే..

ABN , First Publish Date - 2020-05-24T18:10:02+05:30 IST

కళ్లు కనుక్కోలేకపోవచ్చు, కెమెరాలు పట్టుకోలేకపోవచ్చు. ఒక్క యాప్‌ మీరెక్కడున్నా కనిపెట్టేస్తుంది. కరోనా వేళ కాపలాకాస్తున్న ఆ యాప్‌ ‘ఆరోగ్యసేతు’. ఎవరి ఫోన్‌లో చూసినా ఇదే కనిపిస్తుంది.

ఆ ‘సేతు ’ సారథులు వీళ్లే..

కళ్లు కనుక్కోలేకపోవచ్చు, కెమెరాలు పట్టుకోలేకపోవచ్చు. ఒక్క యాప్‌ మీరెక్కడున్నా కనిపెట్టేస్తుంది. కరోనా వేళ కాపలాకాస్తున్న ఆ యాప్‌ ‘ఆరోగ్యసేతు’. ఎవరి ఫోన్‌లో చూసినా ఇదే కనిపిస్తుంది. ఇంతకూ సేతు సారథులు ఎవరో తెలుసా? అందులో ఒక తెలుగువాడు ఉన్నాడన్న సంగతి ఎరుకేనా? 


ఢిల్లీలోని సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి కార్యాలయం..

అవతలి వ్యక్తికి ఒక అర్జంట్‌ ఫోన్‌కాల్‌ వెళ్లింది..

‘హలో, నేను అజయ్‌ సాహ్ని మాట్లాడుతున్నా.. కాట్రగడ్డ లలితేష్‌ గారేనా?’

‘అవును, చెప్పండి. ఏమిటి విషయం..’

‘కేంద్రం మాకో బాధ్యతను అప్పగించింది. అర్జంట్‌గా కరోనాను కట్టడిచేసే మొబైల్‌ యాప్‌ను రూపొందించాలి. ఇందుకోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందులో మీ భాగస్వామ్యం అవసరం..’

‘తప్పకుండా.. మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధం’


... ఫోన్‌కాల్‌ అందుకున్నాడు లలితేష్‌. ఆయన తెలుగువాడు. ఆయనొక్కడే కాదు. దేశవ్యాప్తంగా చేయితిరిగిన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులకు ఫోన్లు వెళ్లాయి. ఆగమేఘాల మీద ఒక బృందం ఏర్పాటైంది. వాళ్లంతా సైనికుల్లా రాత్రింబవళ్లు కష్టపడితే.. అప్పుడు తయారైంది ఆరోగ్యసేతు యాప్‌. విచిత్ర మేంటంటే... బృంద సభ్యులందరూ ఒక్కొక్కరు ఒక్కో రాష్ట్రంలో ఉన్నారు. అందరూ కలిసింది లేదు, కనీసం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుందీ లేదు. కానీ, పనులు మాత్రం చకచకా జరిగిపోయాయి.


ఇళ్లే ఆఫీసులు..

కరోనా కమ్ముకొస్తోంది. ఎవరు వ్యాధిగ్రస్తుడో, ఎవరు ఆరోగ్యవంతుడో తెలీదు. ఎవరినీ నమ్మలేం. అందులోనూ మందులేని వ్యాధి. మనకు రక్షణ లేదా? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అన్న సంశయం. ఏం చేద్దామన్నసందిగ్ధం అందర్నీ వేధిస్తోంది. ఈ తరుణంలో భారత ఆరోగ్యశాఖ చేతికి దొరికిన సాంకేతిక అస్త్రం ‘ఆరోగ్యసేతు’. మొబైల్‌ ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి మన వద్దకు రాగానే అప్రమత్తం చేస్తుంది. కరోనా పరీక్షల ల్యాబ్‌లు దగ్గర్లో ఏమున్నాయో చెబుతుంది. సేతు ఇచ్చిన సమాచారం ఆధారంగా పరీక్షలు చేయగా సుమారు 25 శాతం మందికి కరోనా సోకినట్లు తేలింది. భారత్‌లో యాప్‌ను పదికోట్లకు పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇది బ్లూటూత్‌, లొకేషన్ల ఆధారంగా పనిచేస్తుంది. కరోనారోగి ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవర్ని కలిశాడు? వంటి విషయాలన్నీ తెలుస్తాయి. ఈ సమాచారంతో వ్యాప్తిని కట్టడి చేయొచ్చు. ఇన్ని ప్రయోజనాలున్న ఆరోగ్యసేతును ఒక బృందం.. ఎవరిళ్లలో వాళ్లు ఉంటూనే నడిపిస్తుండటం విశేషం.


తెలుగువాడు సైతం..

కరోనా వ్యాపిస్తున్న మార్చి తొలినాళ్లలోనే భారత ప్రభుత్వ ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్‌ సాహ్నీ.. ఈ యాప్‌ రూపకల్పనకు పూనుకున్నారు. లలితేష్‌కు ఫోన్‌ చేశారు. ఈయన ముంబై ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేశారు. ఆ తరువాత అమెరికాలోని కార్నెగీ మిలన్‌ విశ్వవిద్యాలయంలో రోబోటిక్స్‌పై డాక్టరేట్‌ చేశారు. అనంతరం గూగుల్‌లో చేరి, భారత శాఖాధిపతిగా చేసి.. గూగుల్‌ మ్యాప్స్‌ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. అమెరికాలో 2002లో గూగుల్‌లో చేరిన లలితేష్‌ ఆ తరువాత భారత్‌ శాఖకు వచ్చారు. ఇప్పుడు అజయ్‌ సాహ్నీ పిలుపుతో ఆరోగ్యసేతు యాప్‌లో భాగస్వామి అయ్యారు. యాప్‌ పర్యవేక్షణ బాధ్యతల్ని భుజాన వేసుకున్న మరో వ్యక్తి నీతా వర్మ. ఈమె ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌)కి డైరెక్టర్‌ జనరల్‌. ఆమె సారథ్యంలోనే సాంకేతిక బృందం పనిచేస్తుంది. యాప్‌లో ఎప్పటికప్పుడు ఎలాంటి మార్పులు అవసరం? ప్రస్తుత పనితీరు ఎలా ఉంది? వంటివన్నీ ఆమె బాధ్యతలే. ఎన్‌ఐసీకే చెందిన డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌ఎస్‌ మణి కూడా యజ్ఞంలో ఒకరు. బృంద సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుంటారు. మద్రాస్‌ ఐఐటీ కంప్యూటర్‌ విభాగాధిపతి ఆచార్యులు వి.కామకోటి టీమ్‌లీడర్‌. కోట్లాది మంది కరోనా అనుమానితుల వ్యక్తిగత వివరాలను సేకరించడం, ఆ సమాచారాన్ని భద్రపరచడం, ప్రైవసీకి భంగం వాటిల్లకుండా చూడటం.. ఈయన పని.


చేయిచేయి కలిపి..

ఆరోగ్యసేతు యాప్‌ రూపకల్పనలో ప్రైవేటు కంపెనీల నిపుణులు సైతం చేతులు కలిపారు. అందులో ఒకరు వికల్ప్‌సాహ్ని. మేక్‌ మై ట్రిప్‌ అనే ట్రావెల్‌ యాప్‌ నిర్వాహకులు. యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేసే సభ్యుల పర్యవేక్షణ చూస్తారీయన. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లోని ఎలక్ర్టికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌ అయిన అమృతార్‌ భరద్వాజ్‌ డాటా విశ్లేషకులు. ప్రతిరోజూ లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న వాళ్ల సమాచారాన్ని క్రోడీకరించడం, విశ్లేషించడం ఈయన ప్రధాన విధి. వీళ్లే కాదు, డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు కూడా యాప్‌ పనితీరును పర్యవేక్షిస్తున్నారు. టాటాసన్స్‌, టెక్‌ మహీంద్రా వంటి సంస్థల సాంకేతిక నిపుణుల సహాయం కూడా తోడైంది. ఆరోగ్యసేతు విజయవంతం కావడంతో.. అభివృద్ధి చెందిన దేశాలకు మన దేశం ఏమీ తీసిపోదని నిరూపితం అయ్యింది.

- అంజలి గాంధీ కొప్పర, విజయనగరం

Updated Date - 2020-05-24T18:10:02+05:30 IST