పాక్ కవ్వింపునకు గట్టిగా బదులిచ్చిన భారత సైన్యం

ABN , First Publish Date - 2020-04-11T03:23:13+05:30 IST

కాల్పుల విరమణ ఒప్పందానికి మరోమారు తూట్లు పొడిచిన పాక్ సైన్యానికి భారత సైన్యం దీటుగా బదులిచ్చింది.

పాక్ కవ్వింపునకు గట్టిగా బదులిచ్చిన భారత సైన్యం

కుప్వారా: కాల్పుల విరమణ ఒప్పందానికి మరోమారు తూట్లు పొడిచిన పాక్ సైన్యానికి భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. కాల్పుల ముసుగులో దాదాపు 200 మంది ఉగ్రవాదులను సరిహద్దు దాటించేందుకు ఎదురుచూస్తున్న పాక్ కుట్రను సైన్యం తిప్పికొట్టింది. శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన పాక్.. కుప్వారాలోని కేరన్ సెక్టార్‌ లక్ష్యంగా కాల్పులు ప్రారంభించింది. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం సరిహద్దుకు సమీపంలో ఉన్న టెర్రర్ లాంచ్‌ప్యాడ్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. భారత్ ఎదురుదాడిలో పాకిస్థాన్‌వైపు భారీగానే నష్టం జరిగి ఉంటుందని తెలుస్తోంది. పలు లక్ష్యాలతోపాటు ఓ లాంచ్ ప్యాడ్ కూడా ధ్వంసమై ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 


పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాదాపు 200 మంది భారత్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి లాంచ్ ప్యాడ్లు సిద్ధం చేసినట్టు ఇటీవల పలు ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరించాయి. దీంతో అప్రమత్తంగా ఉన్న సైన్యం నేటి పాక్ కుట్రను తిప్పికొట్టింది. నీలం లోయలోని కేల్ లాంచింగ్ ప్యాడ్లను కూడా లక్ష్యంగా చేసుకుని కాల్పులు ప్రారంభించినట్టు అధికారి ఒకరు తెలిపారు.


ఉగ్రవాదులు కనుక భారత భూభాగంలోకి ప్రవేశిస్తే ప్రాణ నష్టం జరగకుండా వారిని పట్టుకోవడం, మట్టుబెట్టడం కష్టమని, అందుకనే లాంచ్‌ప్యాడ్లను లక్ష్యంగా చేసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. గతవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఐదుగురు స్పెషల్ ఫోర్స్ కమాండోలు అమరులయ్యారు. 

Updated Date - 2020-04-11T03:23:13+05:30 IST