సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. ఎప్పటినుంచి అంటే..

ABN , First Publish Date - 2021-11-09T15:31:04+05:30 IST

భారత ఆర్మీలో నియామకాల కోసం..

సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. ఎప్పటినుంచి అంటే..

వచ్చే ఏడాది జనవరి 30 వరకు నిర్వహణ 


న్యూఢిల్లీ(ఆంధ్రజ్యోతి): భారత ఆర్మీలో నియామకాల కోసం ఈ నెల 29 నుంచి సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ మొదలవుతుందని కేంద్ర రక్షణ శాఖ సోమవారం ప్రకటించింది. సోల్జర్‌ టెక్‌ (ఏఈ), సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌ ట్రేడ్స్‌మెన్‌, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు (ఓపెన్‌ కేటగిరీ), సోల్జర్‌ సీఎల్‌కే కేటగిరీల్లో ఈ నెల 29 నుంచి వచ్చే ఏడాది జనవరి 30 వరకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌ సెంటర్‌లో ఉన్న ఏబీసీ ట్రాక్‌ వద్ద నియామకాలు జరుగుతాయని పేర్కొంది. సోల్జర్‌ టెక్‌, జనరల్‌ డ్యూటీకి 17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సుగల వారు అర్హులని, మిగతా వాటికి 17 ఏళ్ల 6 నెలల నుంచి 23 ఏళ్ల వయస్సు వారు అర్హులని పేర్కొంది.


సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ, ట్రేడ్స్‌మెన్‌కు 10వ తరగతి, సోల్జర్‌ టెక్‌, సీఎల్‌కేకు ఇంటర్మీడియట్‌ను విద్యార్హతలుగా రక్షణ శాఖ నిర్ణయించింది. మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్‌లోని ఈస్ట్‌ మారేడుపల్లిలో ఉన్న ఏఓసీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించాలని లేదా www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. 

Updated Date - 2021-11-09T15:31:04+05:30 IST