భారత్-పాక్ కాల్పుల విరమణ సుదీర్ఘ ప్రయాణానికి తొలి అడుగు : ఆర్మీ చీఫ్
ABN , First Publish Date - 2021-05-29T23:56:07+05:30 IST
భారత్-పాక్ మధ్య నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి
న్యూఢిల్లీ : భారత్-పాక్ మధ్య నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి మూడు నెలల నుంచి అమలవుతున్న కాల్పుల విరమణ వల్ల ప్రశాంతత, భద్రత ఏర్పడుతున్నాయనే భావన కలిగిందని భారత సైన్యం చీఫ్ జనరల్ ఎంఎం నరవణే చెప్పారు. భారత్-పాక్ సైన్యాల కాల్పుల విరమణ ఇరు దేశాల మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడటానికి అవసరమైన సుదీర్ఘ ప్రయాణంలో తొలి అడుగు అని పేర్కొన్నారు.
జనరల్ నరవణే ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జమ్మూ-కశ్మీరులోని నియంత్రణ రేఖ వెంబడి మూడు నెలల నుంచి అమలవుతున్న కాల్పుల విరమణ వల్ల శాంతి, రక్షణ ఉన్నాయనే భావం కలిగిందని చెప్పారు. ఇది ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి అవసరమైన సుదీర్ఘ ప్రయాణంలో తొలి అడుగు అని పేర్కొన్నారు. కాల్పుల విరమణ అంటే ఉగ్రవాదంపై పోరాటాన్ని భారత దేశం ఆపేసినట్లు కాదని చెప్పారు. ఎల్ఓసీ వెంబడి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పాకిస్థాన్ సైన్యం నిర్మూలించినట్లు భావించకూడదని స్పష్టం చేశారు.
మంచి ఇరుగు పొరుగు సంబంధాలను వృద్ధి చేసుకోవాలనే ఉద్దేశం తనకు ఉందని పాకిస్థాన్ భారత దేశానికి హామీ ఇవ్వాలని తెలిపారు. ఇది జరగాలంటే జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాద దాడులు, చొరబాటు యత్నాల తగ్గుదలలో నిలకడ ఉండాలన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడటం వల్ల కచ్చితంగా శాంతి, భద్రతల గురించి ఈ ప్రాంతంలో సద్భావం ఏర్పడిందన్నారు. సుదీర్ఘ కాలం ఘర్షణల తర్వాత శాంతి నెలకొనే అవకాశాలు బలోపేతమయ్యాయని చెప్పారు.