పకడ్బందీగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-03-30T11:27:38+05:30 IST

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ సత్ఫలితాలను ఇస్తుంది.

పకడ్బందీగా లాక్‌డౌన్‌

ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలు 

కిక్కిరిసిపోతున్న మార్కెట్లు

సామాజిక దూరంపై నిర్లక్ష్యం 

కుత్బుల్లాపూర్‌లో పాజిటివ్‌ కేసులు నమోదవడంతో అప్రమత్తమైన అధికారులు 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ సత్ఫలితాలను ఇస్తుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. స్వీయ నిర్బంధం పాటిస్తుండటంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇతర ప్రాంతాల నుంచి వాహనాల రాకపోకలు కొనసాగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా కొనసాగుతోంది. కుత్బుల్లాపూర్‌ పరిధిలో ఐదు పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఉన్నతాధికారులు మరింత అప్రమత్తమయ్యారు. వారు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారనే సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇతర ప్రాంతాలకు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో తమ గ్రామాలకు ఇతరులు ఎవరూ రాకుండా రోడ్లపై అడ్డంగా వేసిన ముళ్లకంచె, పైపులు అత్యవసర సమయాల్లో అడ్డంకిగా మారడంతో వాటిని తొలగించేలా చర్యలు చేపట్టారు. 


సామాజిక దూరంపై ఇంకా నిర్లక్ష్యమే..

నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మార్కెట్లకు ప్రజలు గుంపులుగా వస్తున్నారు. సామాజిక దూరం పాటించాలనే నిబంధన పట్టించుకోవడం లేదు. ఈ విషయమై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అవగాహన కల్పిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. కరోనా వ్యాప్తి జరగకుండా గ్రామీణ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటుండగా, పట్టణ ప్రాంతాల్లో ఇంకా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సామాజిక దూరం పాటించాలని తెలిసినా పట్టణ ప్రజల్లో ఇంకా ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు.


పలుచోట్ల కూరగాయ విక్రయ కేంద్రాలు

కూరగాయలు విక్రయించే ప్రాంతాల్లో ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదనే విషయం గుర్తించిన ఎమ్మెల్యేలు, అఽధికారులు విశాలంగా ఉండే స్థలాలకు కూరగాయ మార్కెట్లను మారుస్తున్నారు. వికారాబాద్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న రైతుబజారుకు అదనంగా మరో మూడు ప్రాంతాల్లో కొత్తగా కూరగాయలు విక్రయించే మార్కెట్లను ప్రారంభించారు. కూరగాయల బీట్లు నిర్వహించే స్థలం తక్కువ ఉండ డంతో లేనిపోని సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం పొంచి ఉన్నందున ముందు జాగ్రత్తగా సోమవారం నుంచి బీట్లను తాత్కాలికంగా బ్లాక్‌ గ్రౌండ్‌లోకి తరలించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ ఆదేశించారు. పరిగి వ్యవసాయ మార్కెట్లో సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. షెడ్‌ వద్దనే కాకుండా దుకాణాల ఎదుట కూరగాయలు విక్రయించేందుకు ఏ ర్పాట్లు చేశారు.


తాండూరులోనూ ఇతర చోట్ల కూరగాయలు విక్రయించేందుకు చర్యలు చేపట్టారు. శంషాబాద్‌లో కూరగాయల మార్కెట్‌ ఇరు కుగా ఉండడంతో కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ఇబ్రహీంపట్నం బస్‌ స్టేషన్‌లో తాత్కాలికంగా కూరగాయల విక్రయాలు కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒక్కో బాక్సులో ఒక్కొక్కరు ఉండి కూరగాయలు విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. మేడ్చల్‌ జిల్లాలో మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో కూరగాయల కొరత నెలకొనకుండా సంచార కూరగాయ విక్రయ వాహనాలు ఏర్పాటు చేశారు. షాద్‌నగర్‌, చేవెళ్ల తదితరప్రాంతాల్లో చికెన్‌ సెంటర్లు తిరిగి తెరుచుకున్నాయి.

Updated Date - 2020-03-30T11:27:38+05:30 IST