ఇంటర్‌ విద్యార్థులపై ఫీజుల పడగ

ABN , First Publish Date - 2021-08-02T06:29:59+05:30 IST

జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులపై యాజమాన్యాలు ఫీజుల పడగ విప్పుతున్నాయి. ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ చదువుతున్న విద్యార్థులతో పాటు గత యేడాది ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన విద్యార్థులు పూర్తి ఫీజు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి.

ఇంటర్‌ విద్యార్థులపై ఫీజుల పడగ

జిల్లాలోని ప్రైవేటు ఇంటర్మీడియట్‌ కాలేజీల్లో ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు
ప్రభుత్వం వద్దన్నా.. పూర్తి ఫీజు వసూలు చేస్తున్న కళాశాలల యాజమాన్యాలు
ఫీజు చెల్లించని వారికి టీసీ, మెమో, బోనఫైడ్‌ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ
తప్పనిసరి పరిస్థితుల్లో అడిగినంత ముట్టజెబుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
ఫీజుపై ప్రభుత్వ నియంత్రణలేక పెద్దఎత్తున వసూలు చేస్తున్న కళాశాలలు
కార్పొరేట్‌ కళాశాలల్లో రూ.లక్ష పైనే ఫీజు
పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
ఆందోళనకు సిద్ధమవుతున్న విద్యార్థి సంఘాల నాయకులు

నిజామాబాద్‌ అర్బన్‌, ఆగస్టు 1: జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులపై యాజమాన్యాలు ఫీజుల పడగ విప్పుతున్నాయి. ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ చదువుతున్న విద్యార్థులతో పాటు గత యేడాది ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన విద్యార్థులు పూర్తి ఫీజు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో పూర్తి ఫీజు చెల్లించడం ఏవిధంగా సాధ్యమో తెలియక విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత యేడాదితో పాటు ఈ యేడాది కూడా కరోనా విజృంభిస్తున్నవేళ ఆన్‌లైన్‌ క్లాసులకే విద్యార్థులు పరిమితమయ్యారు. గత యేడాది ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్‌ మొదటి సంవత్సరం మార్కుల ఆధారంగా ఉత్తీర్ణులను చేసింది. ప్రస్తుతం దోస్త్‌ అడ్మిషన్‌ల ప్రక్రియ జరుగుతున్న వేళ డిగ్రీలో అడ్మిషన్‌ల కోసం ఇంటర్‌ టీసీ, మెమోలు అనివార్యమైన పరిస్థితుల్లో ఇదే అదునుగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ముక్కుపిండి పూర్తి ఫీజును వసూలు చేస్తున్నాయి. జిల్లాలో ప్రైవేటు కళాశాలల ఫీజుల దోపిడీ విషయంలో విద్యార్థి సంఘాలు అనేక ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం అవేమీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వాటిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇంటర్‌ ఫీజులపై స్పష్టత కరువు
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇంటర్మీడియట్‌ ఫీజుల విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పాఠశాలల్లో గత విద్యాసంవత్సరం ఫీజును మాత్రమే వసూలు చేయాలని.. కేవలం ట్యూషన్‌ఫీజు మాత్రమే అది కూడా నెలవారిగా మాత్రమే వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ, ఇంటర్మీడియట్‌ ఫీజుల విషయంలో మాత్రం ఇంటర్మీడియట్‌ బోర్డుగానీ, ప్రభుత్వంగానీ ఫీజుల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇదే అదునుగా ప్రైవేటు కళాశాలలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జిల్లాలో కొన్ని కార్పొరేట్‌ కళాశాలలు ఆన్‌లైన్‌ తరగతులకే విద్యార్థుల నుంచి రూ.లక్ష వరకు ఫీజు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. దీనిని బట్టి జిల్లాలో ప్రైవేటు కళాశాలల తీరుఏవిధంగా ఉందో అర్థమవుతోంది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ఫీజులు తీసుకుంటున్నప్పటికీ కళాశాలల్లో మాత్రం అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయి.
దోస్త్‌ అడ్మిషన్ల వేళ దోపిడీ
ప్రస్తుతం డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం ప్రభుత్వం దోస్త్‌ ద్వారా అడ్మిషన్లు నిర్వహిస్తోంది. ఈ అడ్మిషన్ల ప్రక్రియలో ఇంటర్‌ టీసీ, బోనఫైడ్‌, మెమో అనివార్య మైనందున ప్రైవేటు కళాశాలలు విద్యార్థులు పూర్తి ఫీజు చెల్లించకుంటే ఆ సర్టిఫికెట్లు జారీ చేయడంలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో మొత్తం ఫీజు చెల్లిస్తూ సర్టిఫికెట్లు తీసుకెళ్తున్నారు. కనీస సౌకర్యాలు, వసతులు కల్పించకుండా.. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కళాశాలలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ విషయంలో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై తమకు ఫిర్యాదు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఏకంగా కాల్‌  సెంటర్‌నే ప్రారంభించడం విశేషం.
ఫిర్యాదులు బుట్టదాఖలు
జిల్లాలో మొత్తం 47 ప్రైవేటు ఇంటర్మీడియట్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో గత ఏడాది సుమారు 37వేల మంది విద్యార్థులు చదువుకున్నారు. ఇందులో దాదాపు 19వేల మంది ఇంటర్‌ పూర్తిచేశారు. అయితే, ఆయా కళాశాలల యాజమాన్యాలు ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థుల నుంచి టీసీ, మెమోల పేరుతో ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. కార్పొరేట్‌ కళాశాలలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతుండడమే దీనికి కారణంగా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫీజుల వసూలు విషయంలో స్పష్టమైన ఆధారాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఆయా కళాశాలలపై చర్యల విషయంలో మాత్రం అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు కళాశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తూ ఫీజులు మాత్రం ఆఫ్‌లైన్‌ ఫీజులను తీసుకుంటున్నారనే విషయం అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల నగరంలోని ఆర్యనగర్‌లో గల ఓ కళాశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులకు బదులు ఆఫ్‌లైన్‌ క్లాసులు నిర్వహించినా.. ఈ అంశంపై ఇంట ర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి నివేదిక ఇచ్చినప్పటికీ చర్యలు మాత్రం తీసుకోవడంలేదు.
అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు..
- రఘురాజ్‌, డీఐఈవో

జిల్లాలో ప్రైవేటు ఇంటర్‌ కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే విషయంలో మాకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేయకూడదు.

Updated Date - 2021-08-02T06:29:59+05:30 IST