ఆర్టీసీ అడ్వాన్స్‌ బుకింగ్‌.. 15, 16 తేదీల్లో హౌస్‌ఫుల్‌

ABN , First Publish Date - 2020-04-09T20:06:04+05:30 IST

లాక్‌డౌన్‌ను ఈ నెల 14 తర్వాత ఎత్తివేస్తే గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రజలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ సొంత ఇళ్లకు చేరుకున్న వారంతా తిరుగు పయనం కావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు

ఆర్టీసీ అడ్వాన్స్‌ బుకింగ్‌.. 15, 16 తేదీల్లో హౌస్‌ఫుల్‌

రైళ్లలో ప్రయాణానికి రిజర్వేషన్ల జోరు

లాక్‌డౌన్‌ పొడిగిస్తే టికెట్ల రద్దు


(ఆంధ్రజ్యోతి-రాజమహేంద్రవరం): లాక్‌డౌన్‌ను ఈ నెల 14 తర్వాత ఎత్తివేస్తే గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రజలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ సొంత ఇళ్లకు చేరుకున్న వారంతా తిరుగు పయనం కావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా బస్సులను తిప్పడానికి సమాయత్తమవుతున్నారు. జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు 51 ఉన్నాయి. అందులో  19 ఏసీ బస్సులు ఉన్నాయి.  వీటిని తప్ప మిగతా వాటిని నడుపుతారు. హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, చైన్నైల వైపు వెళ్లే బస్సుల్లోని సీట్లన్నీ ఈ నెల 15, 16 తేదీల్లో అడ్వాన్స్‌ బుకింగ్‌ అయిపోయాయి. ఒక టికెట్‌ కూడా లేదని అధికారులు చెప్తున్నారు. ఏసీ బస్సుల్లో అడ్వాన్స్‌ బుకింగ్‌కు అనుమతి ఇవ్వడంలేదు.


ఇప్పటికే బుకింగ్‌ చేసుకున్న వారి టిక్కెట్లను రద్దు చేసేశారు. రైళ్ల పరిస్థితీ అంతే. స్టేషన్లలో రిజర్వేషన్‌ కౌంటర్లను మూసేశారు. కానీ ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ చేసుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున టికెట్లు బుక్కయినట్టు అధికారులు చెప్తున్నారు. లాక్‌డౌన్‌ పొడిగిస్తే ఇవన్నీ రద్దవుతాయి. నగదు తిరిగి ఇచ్చేస్తారు. విమానాల విషయానికొస్తే... గల్ఫ్‌ దేశాల్లో అనధికారికంగా ఉంటున్న భారతీయులందరినీ ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు ఇక్కడకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు అక్కడ ఉంటున్నవారు చెప్తున్నారు. అదే నిజమైతే వారంతా విమానాల్లోనే వస్తారు. హైదరాబాద్‌, చెన్నై తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చేవారు, జిల్లా నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు విమాన టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు.

Updated Date - 2020-04-09T20:06:04+05:30 IST