Abn logo
Oct 26 2021 @ 23:27PM

అప్పుల వంట!

అందని మధ్యాహ్న భోజన బిల్లులు

మూడు నెలలుగా పెండింగ్‌!

నిర్వాహకులకు ఇవ్వాల్సింది రూ.3.6 కోట్లు

ఆయాల వేతన బకాయి రూ.3.95 కోట్లు


ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించి రేపటి సమాజానికి ఆరోగ్యవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి అమలు చేస్తున్న మధ్నాహ్న భోజన పథకానికి నిధుల కొరత వెంటాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినెలా బిల్లులు అందకపోవడంతో నిర్వహణ ఇబ్బందిగా మారిందని నిర్వాహకులు వాపోతున్నారు. ఓ వైపు నిర్వహణ ఖర్చులు, మరోవైపు వేతనాలు రాకపోవడంతో రూ.7.55 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. 


నెల్లూరు (విద్య) అక్టోబరు 26 : ప్రభుత్వ పథకాల సక్రమ అమలుకు సకాలంలో బిల్లుల చెల్లింపే కీలకం. ఈ విషయంలో కొద్దికాలంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థులకు అందించే మధ్నాహ్న భోజన ఏజెన్సీలకు బకాయిలు పేరుకుపోవడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 2,688  ప్రాఽథమిక, 361 ప్రాథమికోన్నత, 418 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3,467  సర్కారు బడులు ఉండగా, 2,50,785 మంది విద్యార్థులు భోజనం చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో నెల్లూరు అర్బన్‌ ప్రాంతంలో 109 స్కూళ్లలో ఇస్కాన్‌ నిర్వాహకులు భోజన పథకాన్ని అమలు చేస్తుండగా, గూడూరు, వెంకటాచలం, ముత్తుకూరు, మనుబోలు ప్రాంతాల్లోని 289 పాఠశాలల్లో అక్షయపాత్ర సంస్థ ద్వారా భోజనం పెడుతోంది. మిగిలిన పాఠశాలల్లో పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో భోజనాన్ని వండి వడ్డిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ.4.97, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థికి రూ.7.45 చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబరు వరకు ఏజెన్సీ నిర్వాహకులకు రూ.3.6 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీరితోపాటు జిల్లాలో పనిచేస్తున్న 3,042 మంది ఆయాలకు జులై నెలలో ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున రూ.30,42,000, ఆగస్టు నుంచి ఒక్కొక్కరికి రూ.6వేలు చొప్పున సెప్టెంబరు వరకు రూ.3,65,4000 కలిపి మొత్తం రూ.3,95,46,000 బకాయిలు చెల్లించాల్సి ఉంది. మొత్తం మీద ఏజెన్సీ నిర్వాహకులకు, ఆయాలకు కలిపి రూ.7,55,92,000 నగదు చెల్లించాలి. అప్పుడప్పుడు ఆన్‌లైన్‌ కొంత నగదు జమ చేస్తున్నా అందులో వేతనమేదో, నిర్వహణ ఖర్చులకు ఎంతో అర్థంకావడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. కష్టమో, నష్టమో భరిస్తూ అప్పులు చేసి విద్యార్థులకు భోజనం అందిస్తున్నామని చెబుతున్నారు. 


బకాయిలతో ఇబ్బందులు..


సకాలంలో బకాయిలు మంజూరుకాక మధ్నాహ్న భోజన పథకం నిర్వాహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వంట మనిషి, హెల్పర్‌ నుంచి విద్యార్థుల వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇబ్బందులు చవిచూస్తున్నారు. భోజన నాణ్యతను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. నిర్వహణ లోపాలను అధికారులు ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది. జగనన్న గోరుముద్ద పథకంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, నేరుగా మెనూ ప్రకటించారని ప్రజాప్రతినిధులు, అధికారులు బాకాలు ఊదుతున్నా క్షేత్రస్థాయిలో ఇవి అమలు కావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలల తరబడి కోట్లాదిరూపాయలు బిల్లులు అందకపోవడంపై ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోడిగుడ్లు చిన్నవిగా ఉంటున్నాయని, చిక్కీలు అందడం లేదని, నాణ్యత సరిగా లేదని పలుచోట్ల విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. కానీ వీటిని సరిదిద్దేస్థాయిలో అధికారులు లేకపోవడంతో ఇక తాము ఆందోళన బాట పట్టడమే ఒక్కటే మార్గమని నిర్వాహకులు తేల్చి చెపుతున్నారు. 


సకాలంలో అందని బిల్లులు..


పాఠశాల నుంచి ప్రతి నెలా బిల్లులు డీఈఓ కార్యాలయానికి చేరాలి. విద్యార్థుల సంఖ్య, రోజువారీ హాజరు, వాటికి సంబంధించిన బిల్లు వివరాలు మొదటివారంలో పంపాలి. బిల్లుల వివరాలు పంపడంలోనూ విద్యాశాఖలోని మధ్నాహ్నభోజన పథకం పర్యవేక్షించే సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఆలస్యమవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని డీఈఓ కార్యాలయంలో సరిచేసి కమిషనర్‌ కార్యాలయానికి పంపించాలి. సీఎ్‌ఫఎంఎ్‌సలో నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఆర్థిక శాఖ ఆమోదం తెలిపేసరికి నెలల సమయం పడుతోంది. గత 3 మాసాలకు చెందిన బిల్లులు రూ.7.5కోట్లకుపైగా ఇప్పటికీ బకాయిలు ఉండడం విశేషం. ఇప్పటికైనా అధికారులు స్పందించి పథక నిర్వహణలో క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించడంతోపాటు బకాయిలు విడుదల చేసి తమను ఆదుకోవాలని ఏజెన్సీ నిర్వాహకులు, ఆయాలు ముక్తకంఠంతో కోరుతున్నారు. 


బకాయిలన్నీ త్వరలో చెల్లిస్తాం


పాఠశాలల పునఃప్రారంభానికి ముందు ఉన్న బకాయిలన్నీ  పూర్తిగా చెల్లించాం. తిరిగి ప్రారంభమైన తరువాత చెల్లించాల్సిన నగదుకు సంబంధించి బిల్లులను తమకు అందించాల్సి ఉంది. వీటి  వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాము. నగదు సీఎ్‌ఫఎంఎ్‌సలో పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు అందించిన వెంటనే బకాయిలన్నీ  పూర్తిగా చెల్లిస్తాం. ఆయాలకు సంబంధించి నగదు విడుదలైంది. జులైలో వెయ్యి చొప్పున, ఆగస్టు నుంచి ఆరువేల చొప్పున చెల్లించేందుకు జాబితాలను సిద్ధం చేస్తున్నాము. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నగదును పూర్తిస్థాయిలో చెల్లిస్తాము. 

- రమేష్‌, డీఈవో