రుణం.. నరకం!

ABN , First Publish Date - 2022-08-06T04:26:23+05:30 IST

జిల్లాలో రుణ యాప్‌ల బాధితులు పెరుగుతున్నారు. సాంకేతికత మాటున స్మార్ట్‌ ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో రకరకాల నోటిఫికేషన్లు సెల్‌ఫోన్లకు వస్తుంటాయి. ‘నిమిషాల వ్యవధిలో రుణాలు, పేపర్‌లెస్‌, ఎటువంటి స్టేట్‌మెంట్లు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ అవసరం లేదు’ అంటూ ఆకర్షించే రీతిలో మెసేజ్‌లు వస్తుంటాయి. డబ్బులు అత్యవసరం అయిన వా

రుణం.. నరకం!

యాప్‌లతో అప్రమత్తంగా ఉండకపోతే ముప్పే

పేపర్‌ లెస్‌ అంటూ ముగ్గులోకి..

ఆపై అధిక వడ్డీ వసూలు

ఈఎంఐల ట్రాక్‌ తప్పితే వేధింపులే..

బాధితుల్లో యువకులే అధికం

(రాజాం)

 -  రాజాం పట్టణానికి చెందిన ఒక యువకుడు అవసరాల కోసం రుణ యాప్‌లో అప్పు తీసుకున్నాడు. కొన్ని నెలల పాటు ఈఎంఐలు బాగానే చెల్లించాడు. కానీ తరువాత ఇబ్బందులతో జాప్యం జరిగింది. యాప్‌ సంస్థ రికవరీ ఏజెంట్ల వేధింపులు అధికం కావడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొద్దిరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

- ఓ యువకుడు నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్‌లో ఆసక్తికరమైన నోటిఫికేషన్‌ వచ్చింది. సులభంగా అప్పు పొందడం ఎలా అనేది దీని సారాంశం. దీంతో యాప్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకొని రుణం కోసం అన్ని వివరాలను తీసుకున్నారు. ఆయన తీసుకున్నది తక్కువ మొత్తమే అయినా.. ఎక్కువ మొత్తం కట్టాలని అవతలి వైపు నుంచి వేధింపులు మాత్రం ఆ యువకుడ్ని మానసికంగా కుంగదీస్తున్నాయి. 

- జిల్లాలో రుణ యాప్‌ల బాధితులు పెరుగుతున్నారు. సాంకేతికత మాటున స్మార్ట్‌ ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో రకరకాల నోటిఫికేషన్లు సెల్‌ఫోన్లకు వస్తుంటాయి. ‘నిమిషాల వ్యవధిలో రుణాలు, పేపర్‌లెస్‌, ఎటువంటి స్టేట్‌మెంట్లు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ అవసరం లేదు’ అంటూ ఆకర్షించే రీతిలో మెసేజ్‌లు వస్తుంటాయి. డబ్బులు అత్యవసరం అయిన వారు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తరువాత యాప్‌ నిర్వాహకులు వివరాలన్నీ అడుగుతున్నారు. ‘పేపర్‌ లెస్‌’ అంటూనే ఆధార్‌ నంబర్‌, బ్యాంక్‌ అకౌంట్‌ నంబరు సైతం అడుగుతున్నారు. వాస్తవానికి ఆధార్‌ నంబరు సేకరించే అధికారం ప్రైవేటు సంస్థలకు లేదు. ఇటు డబ్బు అవసరం మాటున బాధితులు కూడా ఆవేవీ పట్టించుకోవడం లేదు. వివరాలన్నీ పొందుపరుస్తున్నారు. అయితే నిమిషాల వ్యవధిలో రుణాలు మంజూరవుతుండడం, దీనిపై ఎక్కువ ప్రచారం జరుగుతుండడంతో ఎక్కువ మంది రుణయాప్‌లను ఆశ్రయిస్తున్నారు. అటు యాప్‌ నిర్వాహకులు ఆదాయ వివరాలు తెలుసుకొని మరీ బాధితులను ముగ్గులోకి దించుతున్నారు. అధిక మొత్తంలో రుణాలిచ్చి.. ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు.

రూటు మార్చారు..

గతంలో స్పందన, అస్మిత వంటి మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు రుణాల పేరిట మభ్యపెట్టేవి. ప్రధానంగా మహిళలను టార్గెట్‌ చేస్తూ రుణాలు అందించేవి.  వీధుల్లో మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిజ్ఙ చేయించి చేతుల్లో అప్పులు పెట్టేవారు. వారం వారం చెల్లించాల్సిన వాయిదాల కోసం వంట చేసుకొనే సమయానికి ఇంటి ముందు వాలిపోయేవారు. ఒక ఈఎంఐ చెల్లించకపోయినా విడిచిపెట్టేవారు కాదు. రకరకాల వేధింపులకు గురిచేసేవారు. అయితే దేశ వ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్‌ సంస్థల ఆగడాలు పెచ్చుమీరడంతో ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమించాయి. ఇప్పుడు అటువంటి సంస్థలు రూటు మార్చాయి. మైక్రో మాదిరిగా చిన్న చిన్న యాప్‌ల రూపంలో అడుగుపెట్టాయి. గూగుల్‌ ప్లేప్టోర్‌లో పుట్టగొడుగుల్లా యాప్లను విడుదల చేశాయి. దీంతో డబ్బులు అత్యవసరమైన వారు యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. 

 యువతే టార్గెట్‌..

యాప్‌ల ద్వారా రుణాలు తీసుకొని సక్రమంగా ఈఎంఐలు చెల్లించని వారితో పాటు చెల్లించిన వారిని సైతం వేధింపులకు గురిచేస్తున్నారు. అదనపు వడ్డీ వసూలు చేస్తున్నారు.  తక్కువ మొత్తంలో అప్పులు ఇస్తూ ఎక్కువ మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తున్నారు. తీసుకున్న రుణం స్వల్పమే అయినా వడ్డీలు మాత్రం తలనొప్పిని తెప్పిస్తున్నాయి. ఈఎంఐలు చెల్లింపులో జాప్యం జరిగితే రుణం తీసుకున్న వారి ఫొటోలను, ఆకుంటుంబంలోని మహిళల ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తున్నారు. వాటిని బంధువులు, మిత్రుల ఫోన్‌ నంబర్లకు వాట్సాప్‌లో షేర్‌ చేస్తున్నారు. ఈ అవమానాలు భరించలేక బాధితులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే బాధితుల్లో ఎక్కువ మంది యువత ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా డిగ్రీ. ఇంజనీరింగ్‌ విద్యార్థులు యాప్‌లకు ఆకర్షితులవుతున్నారు. వాటికి చెల్లించాల్సిన ఈఎంఐల కోసం మరోచోట చేతులు చాచాల్సిన పరిస్థితి వస్తోంది. ఫలితంగా రెండు చోట్లా అప్పు చేసినట్టవుతోంది. 

 పల్లెలకు పాకిన సంస్కృతి

తొలుత ఈ యాప్‌ల సంస్కృతి అభివృద్ధి చెందిన నగరాల్లో కనిపించేది. ప్రస్తుతం  పల్లెలకు పాకింది. ప్రధానంగా రుణ యాప్‌ల రూపకల్పన మొత్తం ఉత్తరాధిలో జరిగేవి. వాటికి సంబంధించిన సర్వర్లు మాత్రం విదేశాల్లో ఉంటున్నాయి. యాప్‌ల్లో వివరాలు నమోదు చేస్తే చాలా సులభంగా రుణాలు మంజూరు చేస్తామని వస్తున్న ప్రకటనలన్నీ ఉత్తరాధి ప్రాంతాల నుంచే వస్తున్నాయి. కొన్ని యాప్‌ల సంస్థలు మాత్రం దక్షిణాదిలోని బెంగుళూరు. చెన్నై కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ఈ యాప్‌లు పనిచేయడానికి ఆధారమైన సర్వర్లును మాత్రం విదేశాల్లో నిర్వాహకులు అమర్చుకుంటున్నారు. యాప్‌లో ఉన్న డేటాను పోలీసులకు ఇవ్వకుండా ఉండేందుకు నిర్వాహకులు ఈ విధంగా విదేశాలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. బాధితులు ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తే మాత్రం కొద్దిరోజుల పాటు కదలికలను నిలిపివేస్తున్నారు. తరువాత మళ్లీ మొదలు పెడుతున్నారు. 

జాగ్రత్తగా ఉండాలి

ఇటీవల సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే నష్టం తప్పదు. ప్రధానంగా రుణ యాప్‌ అనేది పెద్ద మాయాజాలం. దాని బారిన ఎవరూ పడకూడదు. అదో వ్యసనంలా మార్చేచేశారు. ఒకసారి సంప్రదింపులు మొదలుపెడితే మన డేటా మొత్తం మిగిలిన యాప్‌లకు వెళుతుంది. కానీ ఫొటోలు, బంధువులు మిత్రుల ఫోన్‌ నంబర్లను యాప్‌ల నిర్వహాకులు హామీగా భావిస్తున్నారు.

- కె.రవికుమార్‌, సీఐ, రాజాం




Updated Date - 2022-08-06T04:26:23+05:30 IST