నియామకాలు నిల్‌!

ABN , First Publish Date - 2022-05-19T05:23:11+05:30 IST

ప్రభుత్వం ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతుండడంతో నిరుద్యోగులు వాటిని సాధించేందుకు కుస్తీ పడుతున్నారు.

నియామకాలు నిల్‌!
లైబ్రేరియన్‌ల పోస్టులు ఖాళీగా ఉన్న కేశంపేట గ్రంథాలయం


  • 1994 నుంచి లైబ్రేరియన్‌ ఉద్యోగాల భర్తీయే లేదు
  • గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు 
  • పట్టించుకోని సర్కారు
  • ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు గ్రంథాలయాల బాధ్యతలు 
  • ఇబ్బందులు పడుతున్న పాఠకులు

ప్రభుత్వం ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. భారీగా ఉద్యోగ నియామకాలు 

చేపడుతుండడంతో నిరుద్యోగులు వాటిని సాధించేందుకు కుస్తీ పడుతున్నారు. అయితే, నిరుద్యోగులు ఈ పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు గ్రంథాలయాల్లో మెటీరియల్‌ను అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం చెప్పింది. మెటీరియల్‌ సంగతి అటుంచితే అసలు వాటి నిర్వహణ చేపట్టాల్సిన అధికారులే లేకుండా పోయారు. 28 ఏళ్లుగా లైబ్రరీ అధికారుల పోస్టులనే భర్తీ చేయలేదు.

షాద్‌నగర్‌. మే, 18: విజ్ఞాన్ని ఆర్జించాలనుకునే పాఠకులకు గ్రంఽథాలయాలే దేవాలయాలు. కానీ ఈ ఆలయాలు అధికారులు లేక మూగబోతున్నాయి. చదివే పాఠకులున్నా నిర్వహణాలోపంతో పుస్తకాలు మూలనపడుతున్నాయి. లైబ్రేరియన్‌ల నియామకం లేకపోవడంతో ఒక్కో లైబ్రేరియన్‌కు మూడు, నాలుగు గ్రంథాలయాలకు ఇన్‌చార్జులుగా నియమించారు. దీంతో వాటి నిర్వహణ భారంగా మారిపోయింది. ఇది పాఠకులను తీవ్ర ఇబ్బందులను గురి చేస్తోంది. 

నియామకాలు ఎక్కడ ? 

గ్రంథాలయం అన్న తర్వాత ప్రతి గ్రంథాలయానికి నిర్వహణ నిమిత్తం ఒక గ్రంథాలయ అధికారి ఉండటం తక్షణ అవసరం. కానీ 1994 నుంచి కొత్తగా గ్రంథాలయ అధికారుల నియామకం జరగలేదు. అప్పుడు నియమించిన వారే ఇప్పటికీ కొనసాగుతున్నారు. వీరిలో ఉద్యోగ విరమణ చేసిన వారిని పక్కనపెడితే మిగతా కొద్దిమంది చేతిలో గ్రంథాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయ అధికారులకు మూడు నుంచి నాలుగు గ్రంథాలయాల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో ఎక్కడా వారు సరిగా పని చేయలేకపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ శాఖలకు చెందిన 82వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇందులో లైబ్రేరియన్‌ పోస్టులను మాత్రం పట్టించుకోలేదు. రాష్ట్రంలో 28 ఏళ్లుగా గ్రంథాలయ అధికారులను నియామకాలు చేపట్టలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 82వేల పోస్టుల భర్తీలోనైనా వీటిని భర్తీ చేస్తారని పాఠకులు భావించారు, కానీ చివరికి ఇందులో కూడా గ్రంథాలయాల ఊసెత్తకపోవడంతో వారు నిరాశకు గురయ్యారు.

జిల్లాలో పరిస్థితి ఇలా..  

జిల్లాకేంద్ర గ్రంథాలయంతో పాటు జిల్లాలో 24 గ్రంథాలయాలు ఉండగా, ఆరుగురు గ్రంథాలయ అధికారులు మాత్రమే ఉన్నారు. మొత్తంగా జిల్లాకేంద్ర గ్రంథాలయంతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న లైబ్రరీల్లో 28 లైబ్రేరియన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని షాద్‌నగర్‌ గ్రేడ్‌-1 గ్రంథాలయం కాగా, ఇబ్రహీంపట్నంలో ఉన్న గ్రంథాలయం గ్రేడ్‌-2. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో గ్రేడ్‌-3 గ్రంథాలయాలు ఉన్నాయి. ఇక్కడ పనిచేస్తున్న అధికారులకు కూడా మూడు, నాలుగు గ్రంథాలయాలకు ఇన్‌చార్జిలుగా నియమించారు. దీంతో అసిస్టెంట్‌ల మీదే భారం వేసి గ్రంథాలయాలను కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో కూడా పుస్తకాల లభ్యత సక్రమంగా లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. 

అసిస్టెంట్ల పోస్టులకు ఎసరు 

జిల్లాలో ఉన్న 24 గ్రంథాలయాల్లో 39మంది గ్రంథాలయ అసిస్టెంట్లుగా ఉన్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నా వారిని ఇప్పటికీ పర్మినెంట్‌ చేయలేదు. రెండు నెలల క్రితం వరకు కూడా వారికి నెలకు రూ.2,080 వేతనాన్ని మాత్రమే గ్రంథాలయ సంస్థ చెల్లించింది. గత నెల నుంచి మాత్రం రూ. 12వేలు చెల్లిస్తున్నారు. అయితే వీరిని కూడా తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీనిపై గ్రంథాలయ అసిస్టెంట్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉండబోతుందనే భయాందోళనలో పడ్డారు. 

పోస్టుల భర్తీ అత్యవసరం 

గ్రంథాలయ అధికారుల పోస్టుల భర్తీ అత్యవసరమని పాఠకులు అంటున్నారు. ప్రస్తుత తరుణంలో గ్రంథాలయాలకు పాఠకుల ఆదరణ విపరీతంగా పెరిగిపోతుందని, పోటీ పరీక్షలకు సంబంధించి స్టడీ మెటీరియల్‌ గ్రంథాలయలకు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం చెబుతోంది. నిరుపేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ కొనుక్కునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో వారికి గ్రంథాలయాలే అందుబాటులో ఉంటాయి. కానీ పూర్తిస్థాయిలో అధికారులు లేక పోవడం వల్ల గ్రంథాలయాలు బోసిపోతున్నాయి. 

 గ్రంథాలయ పోస్టులను భర్తీ చేయాలి 

విజ్ఞాన్ని అందించే గ్రంథాలయాలపై ప్రభుత్వం శ్రద్ధ చూపాలి. నిరుపేద విద్యార్థులకు గ్రంథాలయం ఒక దేవాలయం లాంటిది. వాటిని అభివృద్ధి పర్చాలేకానీ నిర్లక్ష్యం చేయకూడదు. లైబ్రేరియన్లు లేకపోతే లైబ్రరీలు ఎందుకో ఆలోచించాలి. వెంటనే పోస్టులు భర్తీ చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 

                                             -శివాజీ, నిరుద్యోగి, కేశంపేట ప్రభుత్వానికి విన్నవించాం

 ప్రభుత్వానికి విన్నవించాం

జిల్లాలోని గ్రంథాలయాల్లో ఏర్పడిన ఖాళీలు త్వరలో భర్తీ కానున్నాయి. సుమారు 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొదటి విడతగా 18 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. ఖాళీలు భర్తీ కాని పక్షంలో ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించాం. 

                                            -కప్పాటి పాండురంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌

Updated Date - 2022-05-19T05:23:11+05:30 IST