ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్.. అలెర్ట్ చూసుకుని హాస్పిటల్‌కు వెళితే..

ABN , First Publish Date - 2022-03-18T22:12:12+05:30 IST

ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది.

ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్.. అలెర్ట్ చూసుకుని హాస్పిటల్‌కు వెళితే..

ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా యాపిల్ వాచ్‌ల్లో ఉండే హార్ట్ రేట్ ట్రాకర్లు కచ్చితంగా పనిచేస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడయనే వార్తలు తరచుగా వస్తున్నాయి. వాచ్ 4 సిరీస్‌ నుంచి ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసీజీ) రీడింగ్‌ను యాపిల్ సంస్థ అందిస్తోంది. హర్యానాకు చెందిన ఓ వ్యక్తి ఈ వాచ్ కారణంగా గుండెపోటు నుంచి తప్పించుకున్నాడట. హర్యానాకు చెందిన డెంటిస్ట్ నితీష్ చోప్రాకు ఈ నెల 12వ తేదీన ఛాతీ భాగంలో అసౌకర్యంగా అనిపించిందట. 


ఆయన వెంటనే యాపిల్ వాచ్ ధరించి ఈసీజీ యాప్ ఓపెన్ చేశాడు. ఆయనకు యాప్ నుంచి ఏఎఫ్ఐబీ (ఆర్టియల్ ఫిబ్రిల్లేషన్) వార్నింగ్ వచ్చింది. వెంటనే హాస్పిటల్‌కు వెళ్లమనే సూచన వచ్చింది. ప్రపంచంలోని గుండె సంబంధిత మరణాల్లో ఈ ఏఎఫ్ఐబీ రెండో అతిపెద్ద కారణం. దీనిని ముందుగా గుర్తించకపోతే రక్తం గడ్డకట్టి గుండె విఫలమవుతుంది. ప్రమాదకరమైన ఈ ఏఎఫ్ఐబీకి సంబంధించి ముందస్తుగా ఎలాంటి లక్షణాలు కనబడవు. హఠాత్తుగా ఛాతిలో నొప్పి, ఆయాసం, నీరసం వచ్చి గుండెపోటుకు దారి తీస్తుంది. 


యాపిల్ వాచ్ నుంచి వార్నింగ్ వచ్చిన వెంటనే నితీష్ దగ్గర్లోని హాస్పిటల్‌కు వెళ్లి ఈసీజీ తీయించుకున్నారట. దానిలో కూడా అదే కండిషన్ కనిపించింది. వెంటనే యాంజియోగ్రామ్ తీస్తే కరోనరీ ఆర్టరీ పూర్తిగా బ్లాక్ అయినట్టు తెలిసింది. వెంటనే వైద్యులు ఆపరేషన్ చేసి నితీష్‌కు స్టంట్ వేశారు. దానిని ముందుగానే గుర్తించి ఉండకపోతే చాలా ప్రమాదం జరిగేదని వైద్యులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-18T22:12:12+05:30 IST