‘యాప్‌’సోపాలు

ABN , First Publish Date - 2022-08-03T06:23:34+05:30 IST

స్పందన, అస్మిత ఒకప్పటి మైక్రోఫైనాన్స్‌ సంస్థలు.

‘యాప్‌’సోపాలు

గగ్గోలు పెడుతున్న రుణ యాప్‌ బాధితులు

  బాధితుల్లో మహిళలు, విద్యార్థులు

  ఉత్తరాది నుంచి నడస్తున్న కథ

  సమాచారం మాత్రం విదేశాల్లో..

 మంగళగిరిలో ఓ మహిళ అత్యవసరం రావడంతో రుణ యాప్‌లో అప్పు తీసుకుంది. కొన్ని రోజులు ఈఎంఐలు బాగానే చెల్లించినా తర్వాత కాస్త ఇబ్బంది వచ్చింది. యాప్‌ సంస్థ రికవరీ ఏజెంట్ల వేఽధింపులు పెరగడంతో మానసిక ఒత్తిడికి లోనైంది. చివరికి తట్టు కోలేక ఆత్మహత్య చేసుకుంది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఘటన ఇది. 

  ఓ యువకుడికి యూట్యూబ్‌లో వీడియోలు చూడడం హాబీ. ఇలా వీడియోలను చూసే క్రమంలో సులువుగా అప్పు పొందడం ఎలా అనే  వీడియో చూశాడు. ఆ వీడియోలోని వ్యక్తి చెప్పినట్టుగా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని రుణం కోసం అన్ని వివరాలూ ఇచ్చాడు. తీసుకున్నది రూ.5వేలే అయినా అవతలివైపు నుంచి వేధింపులు మాత్రం ఆ యువకుడ్ని మానసికంగా కుంగదీశాయి. తనకు ఈ వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.   

(ఆంధ్రజ్యోతి - విజయవాడ)

స్పందన, అస్మిత ఒకప్పటి మైక్రోఫైనాన్స్‌ సంస్థలు. వీధుల్లో మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రతిజ్ఞ చేయించి చేతుల్లో అప్పులు పెట్టేవారు. వారంవారం చెల్లించాల్సిన వాయిదాల కోసం వంట చేసుకునే సమయానికి ఇంటి ముందు వాలిపోయేవారు. ఒక ఈఎంఐ చెల్లించకపోతే రకరకాలు వేధింపులు ఉండేవి. మైక్రోఫైనాన్స్‌ సంస్థలు రూపం మార్చుకున్నాయి. మైక్రో మాదిరిగానే చిన్నచిన్న యాప్‌ల రూపంలో అడుగుపెట్టాయి. గూగుల్‌ ప్లేస్టోర్‌లో పుట్టుగొడుగుల్లా యాప్‌లను విడుదల చేశాయి. ఆర్థిక అవసరాలు పీకల మీదకు రావడంతో యాప్‌లను తెరిచి అన్ని వివరాలను ఇచ్చేస్తున్నారు. డబ్బులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత బాధితులు తలలు పట్టుకుంటున్నారు. 

  ఫొటోల మార్ఫింగ్‌తో వేధింపులు

రుణాలు తీసుకుని ఈఎంఐలు చెల్లించని వారితోపాటు చెల్లించిన వారినీ అదనపు వడ్డీ కోసం వేధిస్తున్నారు. తక్కువ మొత్తంలోనే అప్పులను ఇస్తూ ఎక్కువ మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. తీసుకున్న రుణం స్వల్పమే అయినా వడ్డీలు మాత్రం తలబొప్పి కట్టిస్తున్నాయి. ఈఎంఐల చెల్లింపుల్లో ట్రాక్‌ తప్పగానే రుణం తీసుకున్న వారి ఫొటోలనూ, ఆ కుటుంబంలోని మహిళల ఫొటోలనూ అత్యంత దారుణంగా మార్ఫింగ్‌ చేస్తున్నారు. వాటిని బంధువులు, మిత్రుల ఫోన్‌ నంబర్లకు వాట్సాప్‌ల్లో షేర్‌ చేస్తున్నారు. ఈ అవమానాలు భరించలేక బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

  యువతపై ప్రభావం

 యువత యూట్యూబ్‌లోని వీడియోలకు ఆకర్షితులవుతున్నారు. ఇళ్లలో తల్లిదండ్రులకు తెలియకుండా ఈ యాప్‌ల ద్వారా రుణాలను పొందుతున్నారు. కరోనా సమయం నుంచి ప్రారంభమైన ఈ యాప్‌ల గోల ఇప్పుడు పెరిగిపోయింది. అందరి చేతుల్లోనూ అండ్రాయిడ్‌ ఫోన్లు ఉండడంతో వీడియోలు చూడగానే క్షణాల్లో యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ముఖ్యంగా డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఈ విధంగా యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని అప్పులు తీసుకుంటున్నారు. వాటికి చెల్లించాల్సిన ఈఎంఐల కోసం మరోచోట చేతులు చాచాల్సిన పరిస్థితి వస్తోంది. ఫలితంగా రెండు అప్పులు తీరకపోగా రుణ భారం మరింతగా పెరుగుతోంది. వారం రోజులు, 15 రోజులు, నెల రోజులకు ఈఎంఐలు చెల్లించేలా పరిమితి పెడుతున్నారు. 

  ఉత్తరాదిలో యాప్‌ల రూపకల్పన

రుణ యాప్‌ల రూపకల్పన మొత్తం ఉత్తరాదిలో జరుగుతోంది. వాటికి సంబంధించిన సర్వర్లు మాత్రం విదేశాల్లో ఉంటున్నాయి. యాప్‌ల్లో వివరాలు నమోదు చేస్తే చాలా సులభంగా రుణాలు మంజూరు చేస్తామని వస్తున్న ప్రకటనలన్నీ ఉత్తరాది ప్రాంతాల నుంచే వస్తున్నాయి. కొన్ని యాప్‌ల సంస్థలు మాత్రం దక్షిణాదిలోని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఈ యాప్‌లు పనిచేయడానికి ఆధారమైన సర్వర్లను మాత్రం విదేశాల్లో నిర్వాహకులు అమర్చుకుంటున్నారు. యాప్‌లో ఉన్న డేటాను పోలీసులకు ఇవ్వకుండా ఉండేందుకు నిర్వాహకులు ఈ విధంగా విదేశాలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. బాధితులు ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తే మాత్రం కొద్దిరోజులపాటు మౌనంగా ఉంటున్నారు. ఆ తర్వాత మళ్లీ కథ మామూలుగా నడిపిస్తున్నారు.

యాప్‌ల ఊబిలోకి దిగొద్దు 

రుణ యాప్‌లు పెద్ద మాయాజాలం. ఈ ఊబిలో అడుగు పెట్టొద్దు. ఒక్క యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని సంప్రదింపులు మొదలుపెడితే మన డేటా మొత్తం మిగిలిన యాప్‌లకు వెళ్తోంది.  తక్కువ మొత్తంలో అప్పుల కోసం యాప్‌ల వలలో పడొద్దు. చాలామంది ఎలాంటి హామీ లేదని భావిస్తున్నారు. ఫొటోలు, బంధువులు, మిత్రుల ఫోన్‌ నంబర్లే యాప్‌ల నిర్వాహకులు హామీగా భావిస్తారు. యాప్‌ల ద్వారా రుణాల తీసుకుని బాధితులుగా మారిన ఇద్దరు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

- టి.కాంతిరాణా, పోలీసు కమిషనర్‌

Updated Date - 2022-08-03T06:23:34+05:30 IST