గర్భశోకం

ABN , First Publish Date - 2020-10-19T09:44:19+05:30 IST

గర్భశోకం

గర్భశోకం

తోట్లవల్లూరు : కృష్ణమ్మ గర్భంలోని లంకల్లో బంగారు పంటలు పండించే రైతులు ఏటా వరుసగా సంభవిస్తున్న వరదలతో ఆర్థికంగా కుదేలవుతున్నారు. పంటలకు బీమా ఉన్నా మండల యూనిట్‌ నిబంధనలతో అందని పరిస్థితి ఏర్పడింది. లంకల్లో పసుపు, కంద, అరటి, చెరకు, తమలపాకు, బొప్పాయి, జామ తదితర పంటలు పండిస్తున్నారు. వీటి సాగుకు ఎకరాకు రూ.లక్షకుపైగానే ఖర్చవుతుంది. వరదల కారణంగా సాగు ఖర్చు కూడా అందని పరిస్థితి ఏర్పడింది. యనమలకుదురు నుంచి దివిసీమ వరకు లంకల్లో వేలాది ఎకరాలు సాగువున్నాయి. ఒక్క తోట్లవల్లూరు మండలంలోనే ఎనిమిది లంకల్లో సుమారు పదివేల ఎకరాలు ఉన్నాయి. 1998, 2009, 2019లో కృష్ణానదికి అతి భారీ వరదలు వచ్చి వందశాతం పంటలను మింగేశాయి. ఇక ప్రతి ఏడాది వచ్చే సాధారణ వరదలకు సైతం పల్లపు ఏరియాల్లోని పంటలు వరద ముంపునకు గురవుతున్నాయి. 


ఒక్క రైతుకూ అందని ఇన్సూరెన్స్‌

బ్యాంకుల నుంచి క్రాప్‌ రుణం తీసుకునే సమయంలోనే పంటలకు ఇన్సూరెన్స్‌ పేరుతో కొంత సొమ్ము మినహాయించుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. చెరకు పంటపై రూ.50వేలు రుణం తీసుకుంటే రూ.2వేలు ఇన్సూరెన్స్‌కు కట్‌ చేసుకుంటున్నారు. వరద వచ్చి పంట చనిపోయిందంటే మండలమంతా నష్టం జరిగితేనే ఇన్సూరెన్స్‌ వస్తుందని, ఒక్క లంకలో నష్టం జరిగితే రాదని అధికారులు చెబుతున్నారు. 


నిబంధనలు మారిస్తేనే..

ఈ ఏడాది ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకానికి ప్రభుత్వమే ఒక రూపాయి చెల్లించింది. ఈ పథకం ద్వారానైనా లంక రైతులకు పంటల ఇన్సూరెన్స్‌ అందుతుందో లేదోనని ఎదురు చూస్తున్నారు. మండల యూనిట్‌ నిబంధనలను మారిస్తేనే బీమా అందుతుందని రైతులు చెబుతున్నారు.

Updated Date - 2020-10-19T09:44:19+05:30 IST