ఐపీఎస్ అధికారి ఏబీ ఊహించినట్టే చేసిన జగన్ సర్కార్..!

ABN , First Publish Date - 2021-01-19T23:34:45+05:30 IST

ఏపీ ప్రభుత్వం తనపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కుట్ర పన్నుతోందని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు...

ఐపీఎస్ అధికారి ఏబీ ఊహించినట్టే చేసిన జగన్ సర్కార్..!

అమరావతి: ఏపీలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆరు నెలల పాటు సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది ఆగస్ట్ నుంచి సస్పెన్షన్ పొడిగింపు ఉత్తర్వులు అమలు కావడం గమనార్హం. ఏపీ ప్రభుత్వం తనపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కుట్ర పన్నుతోందని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు ఇప్పటికే లేఖ రాశారు. త్వరలోనే క్రిమినల్ కేసుపెట్టి జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపి.. మళ్లీ సస్పెన్షన్ ఆర్డర్ విధించాలని కుట్ర పన్నుతోందంటూ ఆయన ఆరోపించిన కొద్దిరోజుల్లోనే సస్పెన్షన్ ఉత్వర్వులను జగన్ సర్కార్ జారీ చేయడం గమనార్హం.


ఇందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆ లేఖలో ఏబీ పేర్కొన్నారు. ఇప్పటికే నెలల తరబడి తనను ఉద్యోగం చేయనీయకుండా, జీతం ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని వెంకటేశ్వరరావు విమర్శించారు. వెంటనే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌ జనరల్ బాడీ ఏర్పాటు చేస్తే అన్ని విషయాలు ఆధారాలతో సహా వివరిస్తానని, నిష్పక్షపాత విచారణ జరగాలన్నది తన డిమాండ్ అని వెంకటేశ్వరరావు ఆ లేఖలో వివరించారు.


అంతేకాదు, తనపై ప్రభుత్వం చేసిన నేరారోపణకు ఏబీ వెంకటేశ్వరావు ఇప్పటికే సమాధానం ఇచ్చారు. సమాధానానికి 30 రోజులు గడువు ఇచ్చారని.. కానీ ఇచ్చింది మాత్రం 15 రోజులేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేరారోపణ పత్రాలు కూడా ప్రభుత్వం తనకు ఇవ్వలేదన్నారు. ఒక్క రూపాయి నష్టం జరగని కొనుగోళ్లలో తానెలా దోషినౌతానని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. సీపీఆర్వో శ్రీహరితో 7 పేజీల ఆరోపణల నోట్‌తో ప్రచారం చేయించారన్నారు. వైసీపీ ప్రభుత్వం మీద తనకు నమ్మకం లేదని ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరావు తెలిపారు. నిఘా పరికరాల కొనుగోళ్లలో పోలీసులు ఏదో విధంగా తనను అరెస్ట్‌ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-01-19T23:34:45+05:30 IST