ఎస్‌ఎమ్‌ఎస్‌తో కరోనా కట్టడి

ABN , First Publish Date - 2020-10-22T10:30:22+05:30 IST

ఎస్‌ఎమ్‌ఎస్‌తో కరోనా కట్టడి

ఎస్‌ఎమ్‌ఎస్‌తో కరోనా కట్టడి

గుంటూరు(తూర్పు), అక్టోబరు 21: శానిటైజర్‌, మాస్క్‌, సోషల్‌డిస్టెన్స్‌ (ఎస్‌ఎమ్‌ఎస్‌) వంటి జాగ్రత్తలు పాటిస్తే అదే కరోనా కట్టడి అని, అదే  పెద్దవ్యాక్సిన్‌ అని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. కొవిడ్‌  అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం గుంటూరు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ మున్సిపల్‌ కార్యాలయం వరకు సాగింది. అనంతరం విలేకర్లతోనూ, మాస్కే కవచం అనే అంశంపై కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన సదస్సులో కలెక్టర్‌ మాట్లాడారు. పాజిటివ్‌ రేటును 7 శాతం నుంచి సున్నాకు తగ్గించడమే లక్ష్యమన్నారు. 


మాస్కే కరోనా కవచం

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కవచంలా పని చేసే మాస్కులను సక్రమంగా వినియోగించాలన్నారు. ఈ అంశంపై వ్యాపారులు విస్త్రృతంగా వినియోగదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కొవిడ్‌-19 అన్‌లాక్‌ 6.0లో నిబంధనల సడలింపు ఎక్కువగా ఉండటంతో ప్రజలు యఽథేచ్ఛగా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తోన్నారని చెప్పారు. షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్‌లు, హోటళ్లు, సినిమా హాల్స్‌ వద్ద వినియోగదారులకు టెంపరేచర్‌ చెక్‌ చేసి, చేతులు శానిటైజేషన్‌ చేసుకున్న తర్వాత మాస్కుతో ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. కొవిడ్‌-19 నిబంధనలు, ముందస్తు జాగ్రత్తల అమలుపై గురువారం నుంచి తనిఖీలు జరుగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వ్యాపార సంస్థలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో జేసీలు దినేష్‌కుమార్‌, ప్రశాంతి, శ్రీధర్‌రెడ్డి, తెనాలి, నరసరావుపేట సబ్‌ కలెక్టర్లు మయూర్‌ అశోక్‌, శ్రీవాస్‌ నుపూర్‌, ఆర్డీవోలు భాస్కర్‌రెడ్డి, పార్థసారథి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌, నగరపాలకసంస్థ కమిసనర్‌ చల్లా అనురాధ, జడ్పీ సీఈవో చైతన్య, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-22T10:30:22+05:30 IST