ఉద్ధండ్రాయునిపాలెంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-10-22T10:32:59+05:30 IST

ఉద్ధండ్రాయునిపాలెంలో ఉద్రిక్తత

ఉద్ధండ్రాయునిపాలెంలో ఉద్రిక్తత

శంకుస్థాపన ప్రాంతంలో రైతుల శ్రమదానం

అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి గురువారానికి ఐదేళ్లు అవుతున్న సందర్భంగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో శ్రమదానం చేసి శుభ్రం చేసేందుకు బుధవారం రాజధాని ప్రాంత రైతులు వచ్చారు. పిచ్చిమొక్కలను తొలగిస్తుండగా ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు రైతులను అడ్డుకున్నారు. మాకు.. దేవాలయం లాంటి ప్రాంతమిది. వెళ్లేందుకు అనుమతి లేదని ఎలా ఆపుతారంటూ రైతులు, దళిత జేఏసీ సభ్యుడు పులి మరియదాసు(చిన్నా) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి సమీప గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రైతులు వచ్చారు. బయట ప్రాంతాల వారికి రోజుకు రూ.500 చొప్పున ఇచ్చి ఆటోల్లో తీసుకువస్తున్న వారి గురించే పట్టించుకోని వారికి మమ్మల్ని అడ్డుకోవడం ఏమిటంటూ   నిలదీశారు. దీంతో పోలీసులు తగ్గడంతో రైతులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకున్నారు. 


నేడు ప్రత్యేక కార్యక్రమాలు

ఉద్దండ్రాయునిపాలెంలో అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి గురువారానికి ఐదేళ్లు అవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. ఈ సందర్భంగా గుంటూరు లక్ష్మీపురం మధర్‌థెరిస్సా విగ్రహం నుంచి గురువారం ఉదయం 7.30కి ప్రారంభమయ్యే మహాపాదయాత్ర  ఉద్దండ్రాయునిపాలెం వరకు జరుగుతుందని జేఏసీ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా గోరంట్ల వేంకటేశ్వరస్వామి ఆలయం మీదగా లాం, తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, తుళ్లూరు రాయపూడి నుంచి సీడ్‌ రహదారి మార్గంలో ఉద్దండ్రాయునిపాలెం చేరే విధంగా జేఏసీ నేతలు 35 కిలోమీటర్ల రోడ్డు మ్యాప్‌ను విడుదల చేశారు.  


Updated Date - 2020-10-22T10:32:59+05:30 IST