వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటుకు మేము ఒప్పుకోం

ABN , First Publish Date - 2020-09-21T09:35:33+05:30 IST

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటుకు మేము ఒప్పుకోం

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటుకు మేము ఒప్పుకోం

- మీటర్లు అమర్చితే దేనికైనా సిద్ధం

- ఆందోళనకు దిగిన అన్నదాతలు.. వెనుదిరిగిన అధికారులు


గార్లదిన్నె, సెప్టెంబరు 20 : ‘మా వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటుకు మేం ఒప్పుకోం. కాదని అమర్చితే దేనికైనా సిద్ధం. మాకు మీటర్లు వద్దంటే వద్దు’ అంటూ పలువురు రైతులు ఆందోళనకు దిగిన సంఘటన మండలంలోని మర్తాడు గ్రామంలో ఆదివారం జరిగింది. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మర్తాడు గ్రామంలో మీటర్లు ఏర్పాటు చేయడానికి వెళ్లిన విద్యుత్‌ అధికారులకు చుక్కెదురైంది. అధికారులను రైతులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. వివరాలు ఇలా... మండ లంలో  ట్రాన్స్‌ కో ఏఈ అశోక్‌కుమార్‌ గత రెండు రోజులుగా మర్తాడు గ్రామంలోని వ్యవసాయ విద్యుత్‌ పంపుసె ట్లకు విద్యుత్‌ మీటర్లను అమర్చాలని సర్వే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి వ్యవసాయ పంపు సెట్‌ వద్ద రైతుల వివరాలు సేకరిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆ గ్రామ రైతులు రాష్ట్రంలో ఎక్కడా లేకున్నా మా గ్రామంలో పంపుసెట్లకు మీటర్లు అమర్చవద్దని ఆందోళనకు దిగారు. విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేస్తే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే ఉచిత విద్యుత్‌ అందజేయాలన్నారు. ప్రతి ఏడాది నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తమకు ఈ విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు గుదిబండగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై పార్టీలకతీతంగా రైతులు ధర్నాకు దిగారు.  ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు భీష్మించుకుకూర్చున్నారు. ఈ విషయంలో తమపై కేసులు పెట్టినా భయపడేది లేదని అధికారులకు రైతులు తెగేసి చెప్పారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. 

 

సర్వే నిర్వహిస్తున్నాము : అశోక్‌ కుమార్‌, ట్రాన్స్‌కో ఏఈ, గార్లదిన్నె

మండలంలోని మర్తాడు గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్ని వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయో సర్వే మాత్రమే నిర్వహిస్తున్నాము. అయితే రైతులు ఈ సర్వేను వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం.

Updated Date - 2020-09-21T09:35:33+05:30 IST