ఈసారైనా.. రుణం దక్కేనా?

ABN , First Publish Date - 2021-10-10T05:18:24+05:30 IST

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో రైతుబంధు పథకం అమలు కావడం లేదు. ఏడాది నుంచి పూర్తిగా నిలిపివేశారు. గత ఏడాది ఒక్క రైతుకు కూడా రుణం అందలేదు. ఈ ఏడాదైనా తమకు రుణ భాగ్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు.

ఈసారైనా.. రుణం దక్కేనా?
ఇచ్ఛాపురం ఎఎంసీ కార్యాలయం

- నిలిచిపోయిన రైతుబంధు పథకం

- ఏడాది నుంచి ఏఎంసీలలో అమలు కాని వైనం

(ఇచ్ఛాపురం రూరల్‌)

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో రైతుబంధు పథకం అమలు కావడం లేదు. ఏడాది నుంచి పూర్తిగా నిలిపివేశారు. గత ఏడాది ఒక్క రైతుకు కూడా రుణం అందలేదు. ఈ ఏడాదైనా తమకు రుణ భాగ్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో 14 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. 50 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల 58 గొడౌన్లు ఉన్నాయి. కొన్ని చోట్ల గొడౌన్లు శిఽథిలావస్థకు చేరాయి. మరి కొన్నిచోట్ల ప్రభుత్వ రంగ సంస్థలకు, ఇతర విభాగాలకు అద్దెకిచ్చారు. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించని సమయంలో మార్కెట్‌ కమిటీ గొడౌన్లలో నిల్వ చేస్తే రైతుబంధు పథకంలో విరివిగా రుణాలివ్వాలని 2014లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మునుపటి మార్గదర్శకాలు సవరణ చేశారు. సరుకు విలువలో గరిష్టంగా 75 శాతం పరపతి పొందవచ్చు. ఒక్కొక్క రైతుకు రూ.2 లక్షలు ఇచ్చేందుకు అనుమతిచ్చారు. జిల్లాలో వరి పండించే రైతులు లబ్ధి పొందేవారు. దాన్యాన్ని గొదాముల్లో నిల్వ చేసిన నాటి నుంచి 180 రోజుల వరకు ఎలాంటి వడ్డీ భారం ఉండదు. అనంతరం 181 నుంచి 270 రోజుల వరకు 12 శాతం వడ్డీ చెల్లించాలి. ప్రకృతి విపత్తులు, ప్రమాదాలతో ధాన్యం దెబ్బతింటే బీమా పొందే వెసులుబాటు కల్పించారు. ఒకసారి పత్రం పొందితే ఐదేళ్లు వాడుకోవచ్చు. గత ఏడాది ఎక్కడా రైతుబంధు పథకం అమలు చేయలేదు. ఒక్కరికీ నిల్వ చేసిన సరుకుపై రుణం ఇవ్వలేదు. ఏఎంసీల్లో నిధుల కొరత కారణంగా ఏడాది నుంచి రైతుబంధు పథకం అమలు కాకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. ఈ ఏడాదైనా రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నారు.  


నిధులు కొరత 

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో నిధుల కొరత ఉంది. ఈ కారణంగా గత ఏడాది నుంచి అన్నదాతలకు రైతుబంధు పథకాన్ని అమలు చేయడం లేదు. రుణాలు మంజూరు చేయలేదు. రైతులు పండించిన ఉత్పత్తులను ఆయా ప్రాంతాల్లోని గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు. ఇందుకు రైతులు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. బీమా కల్పిస్తాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావు. కమిటీలే ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. 

- బి.శ్రీనివాసరావు, సహాయ మార్కెటింగ్‌ సంచాలకులు, శ్రీకాకుళం


రైతుబంధు పథకం అమలు ఇలా..

సంవత్సరం  అమలైన కమిటీలు   లబ్ధిపొందిన రైతులు   రుణం మంజూరు(రూ. లక్షల్లో)

2016- 17          9                  148                     106.15                                          

2017- 18          10                 154                     217.00                             

2018- 19          8                  80                      128.00               

2019- 20          4                  20                      43.00                         

2020- 21          -                   -                       -                                    

2021- 22          -                   -                       -                                                                                                     


Updated Date - 2021-10-10T05:18:24+05:30 IST