Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్థలమేదైనా స్వాహా

అద్దంకిలో క్రైస్తవ సంస్థల భూమిపై వైసీపీ నేతల కన్ను 

ప్లాట్లు వేసి విక్రయించేందుకు ప్రయత్నాలు 

మార్కెట్‌ ప్రకారం విలువ రూ.10కోట్లపైనే!

దీనిపై ఇప్పటికే కోర్టులో వివాదం 

అయినా అధికారపార్టీ నాయకుల బేరం 

ఆందోళనకు సిద్ధమవుతున్న పాస్టర్లు 

అధికార పార్టీ నేతలు భూబకాసురులుగా మారారు. ఖాళీస్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. వివాదాస్పద భూములను సైతం సొంతం చేసుకుని విక్రయించి  సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా అద్దంకి పట్టణంలోని విలువైన క్రైస్తవ భూమిపై కన్నేశారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ  అందులో పాగా వేసేందుకు పన్నాగం పన్నారు. అది బెడిసి కొట్టడంతో ఒకేసారి ప్లాట్లుగా మార్చి అమ్మేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి బేరసారాలు కూడా ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పలువురు పాస్టర్లు ఇటీవల సమావేశమై ఎవ్వరూ ఆ స్థలాన్ని కొనుగోలు చేయవద్దని బహిరం గంగా కోరారు. వైసీపీ నేతల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగాలని నిర్ణయించారు. 

అద్దంకి, డిసెంబరు 7 : ఉత్తర అద్దంకి రెవెన్యూ పరిధిలో 100/2 సర్వే నెంబరులో 2-13 ఎకరాల భూమి ఉంది. అందిన సమాచారం మేరకు 1971లో ఈ భూమిని పట్టణంలోని కట్టకిందపాలెంకు చెందిన పూనూరి నాగేంద్రం, మరియమ్మ, దావీదులకు సాగు కోసం ప్రభుత్వం కేటాయించింది. అనంతరం 1990లో ది ప్రాపర్టీ అసోసియేషన్‌ ఆఫ్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పీఏబీసీ) అనే క్రైస్తవ సంస్థకు ముగ్గురు ఎస్సీ రైతులు అమ్మారు. ఈ సంస్థ ఆధీనంలో అద్దంకి ప్రాంతంలోని 120 చర్చిలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కార్యకలాపాల నిర్వహణకు వీలుగా ఈ స్థలాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకొని గతంలో ఆర్చి, బోరింగ్‌ ఏర్పాటు చేశారు. అనంతరం అభివృద్ధి చేయలేదు.  అయితే ఈ భూమిని 2014లో అమెరికన్‌ బాప్టిస్ట్‌ ఫారిన్‌ మిషన్‌ సొసైటీ (ఏబీఎఫ్‌ఎంఎస్‌) తరపున పాల్విక్‌ అనే వ్యక్తి వేమవరపు వరలక్ష్మి అనే మహిళకు జీపీ రిజిస్ర్టేషన్‌ చేశారు. దాని ఆధారంగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ చేశారు. విషయం తెలుసుకున్న పీఏబీసీ అద్దంకి ప్రాంత కస్టోడియన్‌ ఇమ్మానియేల్‌ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు సంస్థల మధ్య వివాదం నెలకొంది. దీంతో గతంలో ఈ స్థలం కొనుగోలుకు ఆసక్తిచూపిన వారు కూడా వెనక్కి తగ్గారు.  


రంగంలోకి  వైసీపీ నాయకులు 

 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఆ పార్టీకి చెందిన నాయకులు కొందరు జీపీ పొందిన మహిళ తరపున రంగంలోకి దిగారు. గతంలో ఉన్న ఆర్చి, బోరింగ్‌ను తొలగించి చదును చేశారు. విషయం తెలుసుకున్న చర్చి పాస్టర్‌లు, పలువురు కట్టకిందపాలెంకు చెందిన క్రైస్తవులు స్థలం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. పోలీసులు సదరు స్ధలంలో పనులు చేస్తున్న ఎక్స్‌కవేటర్‌, ట్రాక్టర్లను పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అదే సమయంలో కోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది. 


ప్లాట్లుగా మార్చి అమ్మేందుకు పావులు 

వివాదంలో ఉన్న ఆ స్థలంపై అద్దంకి పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు, పలువురు అధికార పార్టీ కౌన్సిలర్లు కన్నేశారు. కొంత మొత్తాన్ని వరలక్ష్మికి ఇచ్చి తమ ఆధీనంలోకి తెచ్చుకునే విధంగా పావులు కదుపుతున్నారు. అదే సమయంలో సదరు భూమిని ఒకేసారి ప్లాట్లుగా విభజించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకోవాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. అందుకు అవసరమైన వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా  నడుపుతున్నారు. ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం ఈ స్థలం విలువ రూ.10కోట్లపైనే ఉంటుంది. దీంతో పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకోవచ్చన్న ఆలోచనతో వారు ఉన్నట్లు సమాచారం. 


కాపాడుకునేందుకు పాస్టర్ల ప్రయత్నం

విషయం తెలుసుకున్న అద్దంకి ప్రాంతంలోని పలువురు చర్చి పాస్టర్‌లు ఇటీవల పట్టణంలోని పసుమర్తిపాలెంలో ఉన్న చర్చిలో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. అదే సమయంలో సదరు స్థలం పీఏబీసీ సంస్థకు చెందినదని మరోసారి స్పష్టం చేశారు. పలువురు వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు కబ్జా చేసి అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారని, ఎవరూ కొని మోసపోవద్దని విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. అదే సమయంలో తమ స్థలాన్ని పరులపరం కాకుండా కాపాడుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. విలువైన క్రైస్తవ సంస్థల స్థలంపై వైసీపీ నాయకులు కన్నేయటం అద్దంకిలో చర్చనీయాంశమైంది. 


స్థలం అన్యాక్రాంతం కానివ్వం

ఇమ్మానియేల్‌, పీఏబీసీ కస్టోడియన్‌

ఉత్తర అద్దంకి రెవెన్యూ పరిధిలో 2.13 ఎకరాల స్థలాన్ని 1990లో ప్రాపర్టీ అసోసియేషన్‌ ఆఫ్‌ బాప్టిస్ట్‌ చర్చి ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పీఏబీసీ) తరఫున కొనుగోలు చేశాం. ఇది అద్దంకి ప్రాంతంలోని 120 చర్చిలకు సంబంధించినది. మా సంస్థతో సంబంధం లేని వ్యక్తుల ద్వారా 2014లో వరలక్ష్మి జీపీ పొందినట్లు తెలిసి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. 2019లో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతోపాటు కోర్టును ఆశ్రయించాం. కేసు నడుస్తోంది. ఇటీవల కొందరు వైసీపీ నాయకులు, ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఆ భూమిని ప్లాట్లు మార్చి అమ్మేందుకు సిద్ధమైనట్లు మా దృష్టికి వచ్చింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కానివ్వం.


రికార్డుల్లో చుక్కల భూమిగా ఉంది

ప్రభాకరరావు, తహసీల్దార్‌, అద్దంకి

ఉత్తర అద్దంకి రెవెన్యూ పరిధిలోని 100/2 సర్వే నెంబరులో ఉన్న 2.13 ఎకరాలు రికార్డుల్లో చుక్కల భూమిగా ఉంది. అయితే 2014లో వేమవరపు వరలక్ష్మి పేరుతో ఆన్‌లైన్‌ చేశారు. ఈ స్థలంపై కోర్టులో కేసు నడుస్తున్నందున వివాదాస్పద భూమిగా గుర్తించాం. కోర్టులో కేసు తేలే వరకూ భూమిలోకి ఎవ్వరూ ప్రవేశించటానికి వీలులేదు.

వివరాలను వెల్లడిస్తున్న పాస్టర్లు


Advertisement
Advertisement