దాతలపై దయ ఏదీ ?

ABN , First Publish Date - 2020-09-25T09:56:26+05:30 IST

ప్లాస్మా దాతలకు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రి అధికారులు చుక్కలు చూపుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పారితోషికం ఇవ్వడా

దాతలపై దయ ఏదీ ?

కరోనా మృతుల కుటుంబికులకు డెత్‌ సర్టిఫికెట్‌లు ఇవ్వని దుస్థితి

  అంత్యక్రియల సొమ్ము కోసం బాధితులకు తప్పని పాట్లు

  సర్వజనాస్పత్రిలో సర్వం మాయ

 

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 24 : ప్లాస్మా దాతలకు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రి అధికారులు చుక్కలు చూపుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పారితోషికం ఇవ్వడానికి కూడా పడిగాపులు గాసేలా చేస్తున్నారు. చివరికి కరోనాతో మృతి చెందిన వారి బంధువులకు మరణధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి కూడా వేధిస్తున్నారు. మందులతో కోలుకోలేని కరోనా బాధితులకు ప్లాస్మా థెరపీ ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులతో పాటు ప్రభుత్వం కూడా చెబుతూ వచ్చింది.


ప్లాస్మా దానంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూ వచ్చారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటిబాడీస్‌ పెరిగిన తర్వాత ప్లాస్మా ఇస్తే అది సీరియస్‌ బాధితులకు ఎంతో మేలుచేస్తుంది. అందుకే  జిల్లా ఆస్పత్రిలో కరోనా బాధితుల కోసం ప్లాస్మా థెరపీని కలెక్టర్‌ ప్రారంభించారు. ఆగస్టు 6న ప్లాస్మా థెరపీని సర్వజనాస్పత్రిలోని రక్త నిధి కేంద్రంలో ప్రారంభించారు.


దీనిపై అవగాహన పెంచడంతో పాటు ప్లాస్మా దాతలకు రూ5 వేలు పారితోషికాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలా మంది సేవాభావం ఉన్నవారు ప్లాస్మా దానం చేయడానికి ముందుకొచ్చారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లా ఆస్పత్రిలో 153 మంది ప్లాస్మా దానం చేశారు. ప్లాస్మా దానం చేసిన వెంటనే వారికి ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేలు పారితోషికం అందించి గౌరవంగా పంపించాలి.


అయితే పారితోషికం సొమ్ము ఇవ్వడానికి ప్లాస్మా దాతలకు వైద్య అధికారులు, సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. రోజుల తరబడి ఆస్పత్రి చుట్టూ తిప్పుకుంటున్నారని పలువురు ‘ఆంధ్రజ్యోతి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.


మృతుల అంత్యక్రియల సాయం, సర్టిఫికెట్లకు ఇదే తిప్పలు

కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియల కోసం ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు రూ.15 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే జిల్లాలో అనేక మంది కరోనా మృతుల కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందలేదు.


చనిపోయినప్పుడు ఆ కుటుంబాలు ఆవేదనతో తమ వారి మృతదేహాలను తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తర్వాత ప్రభుత్వ సాయం కోసం ఆస్పత్రికి వస్తే డెత్‌ సర్టిఫికెట్‌, రూ.15 వేల సొమ్ము ఇవ్వకుండా రోజుల తరబబడి తిప్పుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 460 మంది మరణించారు. ఇందులో జిల్లా  ఆస్పత్రిలోనే అత్యధిక మంది కరోనా బాధితులు మరణించారు.


కనీసం మరణ ధ్రువీకరణ(డెత్‌) సర్టిఫికెట్లు కూడా సకాలంలో ఇవ్వలేదని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో చాలా మంది ఉద్యోగులు మరణించారు. వారి కుటుంబాలకు రావాల్సిన పింఛన్‌, బీమా వంటి ప్రయోజనాలు చేకూరాలంటే డెత్‌ సర్టిఫికెట్లు చాలా ముఖ్యం.


ఈ ఆస్పత్రిలో కరోనా మృతుల కుటుంబాల పట్ల కనీస మానవత్వం చూపకుండా రోజుల తరబడి తిప్పుకుంటుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ పారితోషికం బాధితులకు అందించి, డెత్‌ సర్టిఫికెట్లు వెంటనే జారీ చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2020-09-25T09:56:26+05:30 IST