అక్రమమని తెలిసినా చర్యలేవీ?

ABN , First Publish Date - 2022-01-17T06:20:58+05:30 IST

కొత్తపాలెంలోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మా ణాలు జోరుగా సాగుతున్నాయి. ఆ నిర్మాణాలను టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కూల్చేసినా ఆక్రమణదారులు వెనక్కి తగ్గడం లేదు.

అక్రమమని తెలిసినా చర్యలేవీ?
కొత్తపాలెం ప్రధాన రహదారిలోని రామాలయం ఎదురుగా షాపుల నిర్మాణ పనులు చేపడుతున్న దృశ్యం

ప్రభుత్వ స్థలంలో దర్జాగా షాపుల నిర్మాణం

ఏడేళ్ల క్రితం పాక్షికంగా కూల్చేసిన టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది

తాజాగా మళ్లీ పనులు ప్రారంభం

అధికారుల మౌనంపై పలు సందేహాలు


గోపాలపట్నం, జనవరి 16: కొత్తపాలెంలోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మా ణాలు జోరుగా సాగుతున్నాయి. ఆ నిర్మాణాలను టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కూల్చేసినా ఆక్రమణదారులు వెనక్కి తగ్గడం లేదు. కొన్నాళ్ల విరామం తరువాత మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటనే కొత్తపాలెం సర్వే నంబర్‌ 107లో చోటుచేసుకుంది.

జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెంలోని సర్వే నంబర్‌ 107లో సుమారు ఎకరం పైగా ప్రభుత్వ భూమి ఉంది. అయితే జీవీఎంసీ, రెవెన్యూ అధికారుల పర్య వేక్షణ లేకపోవడంతో ఆ భూమిలో పలు నిర్మాణాలు వెలిశాయి. 2014వ సంవత్సరంలో కొత్తపాలెం ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో వ్యాపార సముదాయాలు నిర్మించడానికి పనులు చేపట్టడంతో ఆ ప్రాంతానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు, టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది ఆ అక్రమ నిర్మాణాన్ని పాక్షికంగా కూల్చివేసి వెళ్లిపోయారు. అయితే అప్పటి నుంచి ఈ భవనానికి ఎటువంటి పనులు చేపట్టడానికి సాహసించని వ్యక్తులు తాజాగా పనులు ప్రారంభించారు. పండుగ సీజన్‌ కావడంతో సెలవుల వల్ల అధికారులు పట్టించుకోరనే ఉద్దేశంతో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి షట్టర్లు బిగించే పనిలో ఉన్నారు. 

అధికారుల పాత్రపై అనుమానాలు!

కొత్తపాలెంలోని సర్వే నంబర్‌ 107లో రెవెన్యూ అధికారులు చాలా ఏళ్ల క్రితం ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి సర్వే రాళ్లను కూడా పాతారు. అయితే ఈ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలను కూడా కొందరు గతంలో విక్రయించడంతో ఈ భూములపై వివాదం నడుస్తోంది. ఈ ప్రాంతంలో నిత్యం వలంటీర్లు, సచివాలయం సిబ్బంది, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తిరుగుతూ ఉండగానే అక్రమ నిర్మాణం చేపట్టడం వెనుక అధికారుల సహాయ సహకారాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే కొందరు స్థానికులు ఈ నిర్మాణాల విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై రెవెన్యూ అధికారులు, టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.


Updated Date - 2022-01-17T06:20:58+05:30 IST