పారిశుధ్యంపై చర్యలేవీ?

ABN , First Publish Date - 2022-08-06T05:23:23+05:30 IST

అసలే వ్యాధుల కాలం ఎప్పుడో ఏ మూల నుంచి వ్యాధులు సక్రమిస్తాయో తెలియని పరిస్థితి. ఈ తరుణంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకు సూచనలు చేయడంతో వాటి అమలుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులపై అధికారులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన అధికారులు ఓ చెవితో విని మరో చెవితో వదిలివేస్తున్నారు.

పారిశుధ్యంపై చర్యలేవీ?
రాజీవ్‌నగర్‌ అంగన్‌వాడీ సెంటర్‌ పక్కనే ఆనుకొని ఉన్న భారీ మురికి కుంట

- శివారు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు కరువు

- పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్‌ పరిధిలోని పరిసరాలు దుర్గంధభరితం

- రాజీవ్‌నగర్‌లోని భారీ మురికికాలువతో అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఇక్కట్లు

- నిత్యం పాములు సంచరిస్తున్నాయంటున్న ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు

- ప్రైవేట్‌ వెంచర్‌ నిర్వాహకులు చేసిన అనాలోచిత చర్యల వల్ల ప్రమాదానికి ఆస్కారం

- ఇందిరానగర్‌లోని మురికికుంటపై ఇప్పటికీ చర్యలు కరువు

- ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ సిబ్బందికి తెలిపినా పట్టించుకోని పరిస్థితి

- జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే చిన్నారులు రోగాల భారిన పడకుండా ఉండే అవకాశం


కామారెడ్డి టౌన్‌, ఆగస్టు 5: అసలే వ్యాధుల కాలం ఎప్పుడో ఏ మూల నుంచి వ్యాధులు సక్రమిస్తాయో తెలియని పరిస్థితి. ఈ తరుణంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకు సూచనలు చేయడంతో వాటి అమలుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులపై అధికారులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన అధికారులు ఓ చెవితో విని మరో చెవితో వదిలివేస్తున్నారు. దీంతో పాఠశాల విద్యార్థులు, అంగన్‌వాడీకి వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు రోగాల పాలవుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతాలోని రాజీవ్‌నగర్‌, ఇందిరానగర్‌, రాజనగర్‌ లాంటి ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ భారీ మురికి కుంటలు ఉన్న మున్సిపల్‌ సిబ్బంది కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడంతో ప్రజలు, చిన్నారులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు.

భారీ మురికి కుంటలతో ప్రజలకు, చిన్నారులకు, విద్యార్థులకు ఇక్కట్లు

జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం వద్ద గల భారీ మురికికుంటతో ప్రజలకు, చిన్నారులకు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఓ ప్రైవేట్‌ వెంచర్‌ నిర్వాహకుల అనాలోచిత చర్యల వల్ల అంగన్‌వాడీకి వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు రోగాలపాలవుతున్నారు. వెంచర్‌ నిర్వాహకులు తమ స్వలాభం కోసం తవ్వించిన భారీ గుంతలో మురికి నీరు నిలిచి ఓ పెద్ద ఊబి మాదిరి తయారైంది. చిట్టడివిలా చెట్లు పెరిగిపోవడంతో నిత్యం పాములు సంచరిస్తున్నాయి. ఒకపక్క మురికినీటి దుర్గంధం, మరోపక్క దోమలు, ఈగలు పాములతో సహవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంగన్‌వాడీ సిబ్బంది, పాఠశాల సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ విషయమై మున్సిపల్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళితే మా పరిధిలోకి రాదంటే మా పరిధిలోకి రాదంటూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని వెంచర్‌ నిర్వాహకులను అడిగితే దురుసుగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. అంగన్‌వాడీకి వచ్చేవారికి ఏ ప్రమాదానికి గురికాకముందే ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

శివారు ప్రాంతాలపై పట్టింపు కరువు

పట్టణంలోని శివారు ప్రాంతాలైన రాజీవ్‌నగర్‌, ఇందిరానగర్‌, రాజనగర్‌ ప్రాంతాలతో పాటు బతుకమ్మకుంట, సైలాన్‌బాబాకాలనీ, అయ్యప్పనగర్‌, గొల్లవాడ లాంటి ప్రాంతాల్లోని పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయి. ఈ ప్రాంతాల్లో అసలు పారిశుధ్య పనులను ఎప్పుడు చేపడుతున్నారో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది ఆయా ప్రజాప్రతినిధులు చెప్పిన చోటే పనులు నిర్వర్తిస్తున్నారే తప్ప ప్రజలకు అసౌకర్యం ఉన్న చోట మాత్రం పనులు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శివారు ప్రాంతాలపై ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పర్యటన లేకపోవడంతోనే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా పరిసరాలు కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఇందిరానగర్‌లో ఉన్న భారీ మురికి కాలువను ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి పరిశీలన చేసిన దాఖలాలు లేవని పరిసర ప్రాంత అధికారులు పేర్కొంటున్నారు. సీజనల్‌ వ్యాధులపై తూతూ మంత్రంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా అధికారులు వాటిని అమలు చేసేందుకు మాత్రం చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - 2022-08-06T05:23:23+05:30 IST