అక్రమ లేఅవుట్లపై చర్యలేవీ?

ABN , First Publish Date - 2021-04-08T05:16:56+05:30 IST

అక్రమ వెంచర్లు, ప్లాట్ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోవడమే కాకుండా లే అవుట్‌లేని ప్లాట్లను కొనుగోలు చేసిన సామాన్య, మధ్య తరగతి ప్రజలు మోసపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

అక్రమ లేఅవుట్లపై చర్యలేవీ?
కామారెడ్డిలో మున్సిపల్‌ అఽధికారులు గుర్తించిన అక్రమ లేఅవుట్‌లు

అక్రమ వెంచర్లపై రాజకీయ జోక్యం
చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్న అధికారులు
జిల్లాలో 28 వేలకు పైగానే అక్రమ ప్లాట్లు
గతంలోనే అక్రమ లేఅవుట్లు, వెంచర్ల గుర్తింపు
మున్సిపాలిటీలలో రూ.కోట్లల్లో వ్యాపారం
లేఅవుట్‌ అనుమతి వస్తుందంటూ నమ్మబలికిస్తున్న వైనం
నాన్‌ లేఅవుట్‌ ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్న రియల్టర్లు
టాస్క్‌ఫోర్స్‌ టీంలు ఏర్పాటు చేసినా చర్యలు శూన్యమే
కామారెడ్డి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): అక్రమ వెంచర్లు, ప్లాట్ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోవడమే కాకుండా లే అవుట్‌లేని ప్లాట్లను కొనుగోలు చేసిన సామాన్య, మధ్య తరగతి ప్రజలు మోసపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు చేపడితే ఇకపై రిజిస్ట్రేషన్‌ చేయమని నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్రప్రభుత్వం గతంలో ప్రకటించింది. నాన్‌లేవుట్ల ప్లా ట్ల రిజిస్ట్రేషన్లకే పలు నిబంధనలతో కూడిన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకునేందుకు జిల్లాలోని మున్సిపాలిటీలో టాస్క్‌ఫోర్స్‌ టీంలను సైతం ఏర్పాటు చేశారు. కానీ ఈ టీంలు అక్రమ వెంచర్లపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు అక్రమ ప్లాట్లపై చర్యలు తీసుకునేందుకు వెళ్తున్న అధికారులపై స్థానిక రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్లు ఆయా శాఖల అధికా రులు వాపోతున్నారు. మరోవైపు లే అవుట్‌లకు అనుమతులు వస్తున్నా యంటూ రియల్టర్‌లు కొనుగోలుదారులను మభ్యపెడుతూ నాన్‌లేఅవుట్‌ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయిస్తూ రూ.కోట్లలో దందా కొనసాగిస్తున్నారు.
జిల్లాలో 28 వేలకు పైగానే అక్రమ ప్లాట్లు

జిల్లాలోని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో అక్రమప్లాట్లు సుమా రు 28వేలకు పైగానే ఉన్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరంలో అక్రమలేఅవుట్లకు రిజిస్ర్టేషన్‌ చేయ మని ప్రకటించి పలు నిబంధనలను జారీ చేసింది. అదేవిధంగా అక్రమ లేఅవుట్లను, ప్లాట్లను గుర్తించాలంటూ మున్సిపల్‌, పంచాయతి శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కామారెడ్డి జిల్లాలోని 526 గ్రామ పంచా యతీ పరిధిలో సుమారు 9,257 అక్రమ ప్లాట్లు ఉున్నట్లు అధికారులు గుర్తించారు. కామారెడ్డి మున్సిపాలిటీలో లేఅవుట్‌ లేని వెంచర్‌లు 82 లలో 4వేలకు పైగా అక్రమప్లాట్లతో పాటు మరో 15 వేల వరకు అక్రమ ప్లాట్లు  ఉన్నట్లు మున్సిపల్‌ అధికారుల సర్వేలో తేలింది. బాన్సువాడ మున్సిపాలిటీలో 600, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 60కి పైగా అక్రమ ప్లాట్లు ఉన్నట్లు ఆయా శాఖల అధికారులు గుర్తించారు.
అక్రమ వెంచర్లపై రాజకీయ జోక్యం
జిల్లాలోని రియల్‌ వెంచర్లలో రాజకీయ నాయకుల జోక్యం ఉండటం తో చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతున్నారు. కామారెడ్డి పట్ట ణ శివారులోని ఓ రియల్టర్‌ సుమరు 5 ఎకారాలలో మున్సిపాలిటీ అను మతి లేకుండానే ప్లాట్లుగా మార్చాడు. ఈ వెంచర్‌కు అనుమతి తీసుకోవా లంటూ సంబందిత శాఖ అధికారులు సదరు వెంచర్‌ నిర్వాహకుడికి నోటీసులు పంపారు. దీంతో ఆ రియల్‌ వ్యాపారి స్ధానికంగా ఉండే ఓ నేతను కలిసి మున్సిపల్‌ అధికారులపై ఒత్తిడి చేయించాడు. దీంతో అధి కారులు గమ్మున ఉండిపోయారు. ఇలా బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలి టీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంటుంది.  కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పట్టణాలు, మేజర్‌ గ్రామ పంచాయతీల చుట్టూ ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చాయి. పట్టణాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ భూములన్నీ ప్లాట్లుగా మారడంతో మధ్య తరగతి కుటుంబీకులు చిట్టీలు కట్టి, అప్పులు చేసి కొనుగోలు చేసిన వేలాది మంది రిజిస్ర్టేషన్లు కాక నిరీక్షిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా మూడు మున్సిపాలిటీల్లో, మేజర్‌ గ్రామ పంచాయ తీలలో ఇదే పరిస్థితి. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో లెక్కకు మించి అనుమతిలేని వెంచర్లు వెలిశాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ విఽధానంలో ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను సాకుగా చూపి మున్సిపాలిటీల్లో లేఅవు ట్లని సక్రమమే అని చెప్పి ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయించి, అనుమతి వస్తు ందంటూ రియల్టర్లు కొనుగోలుదారులను  మభ్యపెడుతున్నారు.
టాస్క్‌ఫోర్స్‌ బృందం ఏర్పాటు చేసినా కనిపించని చర్యలు
జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలలో అక్రమ వెంచర్లను కట్టడి చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ శరత్‌ ఆయా మున్సిపల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులతో మూడు మున్సిపాలిటీలకు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. గతంలోనే మున్సిపల్‌ అధికారులు గుర్తించిన అక్రమ లేఅవుట్లపై టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు ఇంత వరకూ విచారణ జరపలేదనే వాదన వినిపిస్తో ంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో కొత్తగా వెలిసిన అక్రమ వెంచర్ల పై నిఘా పెట్టకపోవడంతో రియల్టర్లు ఎలాంటి అనుమతులు తీసుకో కుండానే వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి అమాయక ప్రజల కు అంటగడుతున్నట్లు తెలుస్తోంది. ఈ బృందాలు ఆయా మున్సిపాలిటీ లో అక్రమ లేఅవుట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించి నా ఫలితం మాత్రం శూన్యం.
అక్రమ వెంచర్లపై కఠినంగా వ్యవహరించాల్సిందే..
గతంలో జనావాసానికి ఆమోదం లేని ప్రాంతాలను రెడ్‌జోన్లు, బంప ర్‌ జోన్లుగా గుర్తించారు. అప్పట్లో ఇక్కడ ఎలాంటి అనుమతులు ఇవ్వ లేదు. ప్రస్తుతం అదేప్రాంతాల్లో వెంచర్లు ఏర్పాటు చేసిన చర్యలు తీసు కునేందుకు అఽధికారులు వెనక్కి తగ్గుతున్నారు. రెడ్‌, బఫర్‌ జోన్లు, శిఖం భూములు, ప్రభుత్వ, వక్ఫ్‌ భూములు నాలాలపై వెంచర్ల ఏర్పాటు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలకు ఆదేశించాలని మూడు మున్సిపాలి టీల్లోనూ అక్రమ వెంచర్లు గుర్తించి రియల్టర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

Updated Date - 2021-04-08T05:16:56+05:30 IST