ఉత్తర ప్రదేశ్ ప్రజలను కాంగ్రెస్ అవమానిస్తోంది : అనురాగ్ ఠాకూర్

ABN , First Publish Date - 2022-02-16T23:57:20+05:30 IST

ఉత్తర ప్రదేశ్, బిహార్ సోదరులను పంజాబ్‌లో ప్రవేశించనివ్వొద్దని

ఉత్తర ప్రదేశ్ ప్రజలను కాంగ్రెస్ అవమానిస్తోంది : అనురాగ్ ఠాకూర్

లక్నో : ఉత్తర ప్రదేశ్, బిహార్ సోదరులను పంజాబ్‌లో ప్రవేశించనివ్వొద్దని పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ పిలుపునివ్వడంపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ ఉత్తర ప్రదేశ్ ప్రజలను అవమానించారని, ఆ సమయంలో అక్కడే ఉన్న  ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా నవ్వుతున్నారని, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఉత్తర ప్రదేశ్ ప్రజలను పబ్లిక్ గూండాలని అన్నారని, అఖిలేశ్ యాదవ్ ఆమెకు పెద్ద పెద్ద పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారని మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌ను అవమానించే పనిని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ చేపట్టాయా? అని ప్రశ్నించారు. 


ఉత్తర ప్రదేశ్ ప్రజలను గూండాలుగా పేర్కొనడాన్ని వీరంతా ఎలా సమర్థిస్తారని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలు అనేక రాష్ట్రాలు, దేశాలకు వెళ్తూ, తమ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తున్నారన్నారు. చన్నీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వంటివారు ఆ మంచి పేరును చెడగొడుతున్నారని ఆరోపించారు. 


ఉత్తర ప్రదేశ్‌లో రెండో దశ పోలింగ్ దర్వాత సమాజ్‌వాదీ పార్టీ అయోమయంలో పడిందని అనురాగ్ ఎద్దేవా చేశారు. అఖిలేశ్ యాదవ్‌కు చెమటలు పడుతున్నాయన్నారు. మహిళా సభ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు గీత షాక్యపై దాడి జరిగిందన్నారు. ఎస్‌పీ సింగ్ బాఘెల్‌పై కర్హాల్ నియోజకవర్గంలో  సమాజ్‌వాదీ పార్టీ గూండాలు దాడి చేశారన్నారు. ఈ గూండాలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. మయిన్ పురి జిల్లాలోని కర్హాల్, ఇటావా తదితర నియోజకవర్గాల్లో పారామిలిటరీ దళాలను మోహరించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో బీజేపీ నేతల బృందం ఈ సంఘటనలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 


ఉత్తర ప్రదేశ్, బిహార్ సోదరులను పంజాబ్‌లో ప్రవేశించనివ్వొద్దని పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ పిలుపునిచ్చారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసేటపుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అక్కడే ఉన్నారు. ఆమె చిరునవ్వులు చిందించారు.  యూపీ, బిహార్ రాష్ట్రాలకు చెందిన బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారం కోసం పంజాబ్ వెళ్తున్న నేపథ్యంలో  చన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు.


Updated Date - 2022-02-16T23:57:20+05:30 IST