ఇరాన్‌లో మరో యువతి మృతి

ABN , First Publish Date - 2022-10-03T09:10:53+05:30 IST

ఇప్పటికే 22ఏళ్ల మహ్సా అమీనీ మృతి పట్ల ఇరాన్‌ రగిలిపోతుండగా.. తాజాగా నికా షకరామీ అనే మరో యువతి(17) అనుమానాస్పదంగా బలగాల చేతిలో కన్నుమూసింది.

ఇరాన్‌లో మరో యువతి మృతి

మృతదేహంపై తీవ్రగాయాలు

ఇరాన్‌ బలగాల దాడుల్లో 92మంది కన్నుమూత

న్యూఢిల్లీ, అక్టోబరు 10: ఇప్పటికే 22ఏళ్ల మహ్సా అమీనీ మృతి పట్ల ఇరాన్‌ రగిలిపోతుండగా.. తాజాగా నికా షకరామీ అనే మరో యువతి(17) అనుమానాస్పదంగా బలగాల చేతిలో కన్నుమూసింది. మృతదేహంపై చిత్రహింసలకు సంబంధించిన గాయాలున్నాయని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. గత నెల 20న టెహ్రాన్‌లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న తర్వాత ఆమె ఆచూకీ లభించలేదు. చివరిగా తన స్నేహితురాలితో ఫోన్‌లో మాట్లాడుతూ భద్రత బలగాల నుంచి పారిపోతున్నట్లు ఆమె తెలిపిందని ది టెలిగ్రాఫ్‌ పత్రిక తమ కథనంలో తెలిపింది. ఆమె ఎత్తైన ప్రదేశం నుంచి కిందపడి మరణించినట్లు అధికారులు మృతదేహం అప్పగించే సమయంలో బాలిక కుటుంబీకులకు తెలిపారు. తల భాగాన్ని చూడనివ్వకుండా అధికారులు అడ్డుకోవడం గమనార్హం. నికా ముక్కు పూర్తిగా ధ్వంసం కాగా, పుర్రెపై పదే పదే బలమైన వస్తువుతో కొట్టిన ఆనవాళ్లున్నాయని టెలిగ్రాఫ్‌ పేర్కొంది. నికాకు సంస్మరణ సభ నిర్వహించరాదని షకరామీ కుటుంబానికి అధికారులు హుకుం జారీ చేశారు. ఇక.. హిజాబ్‌ వ్యతిరేక నిరసనకారులపై ఇరాన్‌ బలగాల దాడుల్లో ఇప్పటి వరకూ కనీసం 92మంది బలయ్యారని ఇరాన్‌ మానవహక్కుల సంఘం ఆదివారం తెలిపింది. మరోవైపు.. మహ్సా అమీనీకి సంఘీభావంగా కెనడాలోని ఒటావా, టొరంటో, వాంకూవర్‌ వంటి పలు నగరాల్లో వేలాదిమంది ర్యాలీ నిర్వహించారు. పలువురు మహిళలు తమ జుట్టును కత్తిరించుకున్నారు. అటు అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో సైతం శనివారం వందలాదిమంది ప్లకార్డులతో ర్యాలీ తీసి, శ్వేత సౌధ గేట్ల ముందు గుమిగూడారు. టెహ్రాన్‌లో పాలన మారాలంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. 

Updated Date - 2022-10-03T09:10:53+05:30 IST