మరో రెండు పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-06-01T10:17:21+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మధురనగర్‌ కాలనీలో ఓ యువకుడికి కరోనా సోకింది. ఆ

మరో రెండు పాజిటివ్‌

అచ్చంపేటలో ఢిల్లీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా

పాలమూరులో మరో యువకుడికి వైరస్‌ నిర్ధారణ

ఉప్పునుంతలలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ

ప్రైమరీ కాంటాక్ట్‌లను క్వారంటైన్‌ చేసిన అధికారులు


కరోనా వైరస్‌ మళ్లీ తిరగ తోడుతోంది.. నెల రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ప్రశాంతంగా ఉన్న తరుణంలో, తాజాగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.. ప్రధానంగా ముంబై, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీల ద్వారానే వైరస్‌ వ్యాపిస్తుండటం, అందున పల్లె ప్రాంతాల్లోనే కేసులు పెరుగుతుండటం కలవర పెడుతున్నది.. తాజాగా ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో ఢిల్లీ నుంచి వచ్చిన యువకుడికి, మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఓ యువకుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వారి వారం కాంటాక్ట్‌ను క్వారంటైన్‌ చేసింది..


మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం)/అచ్చంపేట టౌన్‌/లింగాల: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మధురనగర్‌ కాలనీలో ఓ యువకుడికి కరోనా సోకింది. ఆ యువకుడు ఎనిమిది రోజుల కిందట ఢిల్లీ నుంచి అచ్చంపేటకు వచ్చాడు. ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. అతడితో పాటు రూంలో ఉండే స్నేహితుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని అచ్చంపేటలోని స్నేహితుడికి చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. విషయం తెలుసుకున్న డీఎండీఎం అండ్‌ హెచ్‌ఓ సుధాకర్‌లాల్‌, డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌ఓ శ్రీధర్‌, డీఎస్పీ నర్సింహులు, సీఐ రామకృష్ణ పోలీసులు, అతడి కుటుంబ సభ్యులను ఆదివారం నాగర్‌కర్నూల్‌లోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.


హైపో క్లోరైడ్‌తో శుద్ధి

అచ్చంపేటకు చెందిన యువకుడికి కరోనా నిర్ధారణ కాగా, ఆ యువకుడి పెద్దనాన్న లింగాల పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆ యువకుడు పెద్దనాన్నను కలిసినట్లు తెలిసింది. దీంతో అతన్ని పోలీసు అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు. అలాగే ఆదివారం లింగాల్‌ పోలీస్‌ స్టేషన్‌ను హైపో క్లోరైడ్‌ ద్రావణంతో పిచికారి చేశారు. కాగా, ఈ యువకుడు లింగాల, ధారారం గ్రామాలలో ఉన్న బంధువుల ఇళ్లకు కూడా వెళ్లినట్లు సమాచారం.


వైద్య బృందం సర్వే

ఉప్పునుంతలలోని కంటైన్మెంట్‌ జోన్‌గా ఏర్పాటు చేసిన బీసీ కాలనీలో ఆదివారం ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి తారసింగ్‌ ఆధ్వర్యంలో వైద్య బృందం సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్న వారిని గుర్తింపు పనిలో నిమగ్నమైంది. అలాగే కాలనీతో పాటు మండల కేంద్రంలో వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించింది.


పాలమూరులో మరొకరికి పాజిటివ్‌

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని శివశక్తి నగర్‌ కాలనీకి చెందిన 27 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్‌ సోకింది. ఇతని తమ్ముడు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతనికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే ఇటీవల ఆ యువకుడు అతని తమ్ముడిని చూడటానికి హైదరాబాద్‌ వెళ్లాడు. దీంతో పాటు అతని సోదరిని కూడా తీసుకురావడానికి కార్లో ముంబై వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో అతనికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. గత మూడు రోజులుగా అతనికి కరోనాకు సంబంధించిన కొన్ని లక్షణాలు కనిపించడంతో, ఆ యువకుడు శనివారం స్వచ్ఛందంగా గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నాడు. దీంతో అతనికి వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని కుటుంబసభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. ప్రస్తుతం ఈ కేసుతో కలుపుకొని ఈ రెండు రోజులలో కొత్తగా మహబూబ్‌నగర్‌లో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-06-01T10:17:21+05:30 IST