ఇన్‌చార్జీలతో ఇంకెన్నాళ్లు?

ABN , First Publish Date - 2022-06-26T06:32:51+05:30 IST

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎన్నో అభివృద్ధి పనులు కొనసాగుతున్నా.. కీలకమైన అఽధికారుల పోస్టులు మాత్రం భర్తీ కావడం లేదు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పని చేసేందుకు రాష్ట్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు మొగ్గుచూపకపోవడంతో ఏళ్ల తరబడి పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. రెగ్యులర్‌ అధికారులు రాకపోవడం వల్ల ఇన్‌చార్జ్‌లతో పాలన కొనసాగడం వల్ల కార్పొరేషన్‌కు తగిన

ఇన్‌చార్జీలతో ఇంకెన్నాళ్లు?
నిజామాబాద్‌లోని మున్సిప్‌ కార్పొరేషన్‌ కార్యాలయం

నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌లో కీలక అధికారులు లేక పనుల్లో జాప్యం 

ఇన్‌చార్జీ అధికారులతో పెండింగ్‌లో పనులు 

ఒత్తిళ్లతో ధీర్ఘకాలిక సెలవుల్లోకి వెళ్తున్న అధికారులు

ప్రజాప్రతినిధులు దృష్టిసారిస్తేనే కొత్త అధికారుల నియామకం

నిజామాబాద్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎన్నో అభివృద్ధి పనులు కొనసాగుతున్నా.. కీలకమైన అఽధికారుల పోస్టులు మాత్రం భర్తీ కావడం లేదు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పని చేసేందుకు రాష్ట్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు మొగ్గుచూపకపోవడంతో ఏళ్ల తరబడి పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. రెగ్యులర్‌ అధికారులు రాకపోవడం వల్ల ఇన్‌చార్జ్‌లతో పాలన కొనసాగడం వల్ల కార్పొరేషన్‌కు తగిన ఆదాయం రావడంలేదు. పన్నులు కూడా సకాలంలో వసూలు కావడంలేదు. కీలక ఫైళ్లు కూడా నెలల తరబడి సంతకాలు కావడంలేదు. కార్పొరేషన్‌ పరిదిలో నేతల ఒత్తిళ్ల వల్ల అధికారులు ఇక్కడికి రావడానికి జంకుతుండడంతో రెగ్యులర్‌ అధికారులను నియమించేందుకు తంటాలు పడుతున్నారు. ప్రజాప్రతినిఽధు లు ప్రయత్నాలు చేసిన కీలక అదికారులు రాకపోవడంతో పాలనపరంగా సమస్యలు ఎదురవుతున్నాయి. ఉన్న అధికారులు కూడా సెలవులు పెట్టి వెళ్లడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కార్పొరేషన్‌ పరిధిలో 60 డివిజన్‌లు

నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో 60 డివిజన్‌లున్నాయి. వీటి పరిధిలో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కోట్ల రూపాయల పనులు కొనసాగుతున్నాయి. రోడ్లు, డ్రైనేజీ లు, సుందరీకరణతో పాటు ఇతర పనులు జరుగుతున్నాయి. ఇవేకాకుండా పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లతో పాటుపార్కులు, ఇతర నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. నగరం భారీగా విస్తరించడం వల్ల నిర్మాణాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. భవన నిర్మాణాలతో పాటు ఇతర నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటన్నింటికీ అనుమతులు ఇవ్వాలి. ఇవేకాకుండా ప్రతీ నెల కార్పొరేషన్‌కు పన్నుల వసూలు లక్ష్యం ఉంది. ఇంటి పన్నుతో పాటు ఆస్తీ పన్ను, నల్లాపన్ను, ఇతర పన్నులను వసూలు చేస్తున్నారు. ఇవేకాకుండా పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటికీ పూర్తిస్థాయిలో పర్యవేక్షించేందుకు కీలకమైన అధికారులు కావాలి. వీటిని పర్యవేక్షించే అధికారులు లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. రెగ్యులర్‌ అధికారులు ఉన్నపుడే పన్నులపైన నజర్‌ ఎక్కువ గా ఉంటుంది. పనులు ఎక్కువగా జరుగుతాయి. పర్మిషన్‌లు తొందరగా వస్తాయి. పన్నుల వసూలు కూడా పెరుగుతుంది. ఇంచార్జ్‌లు ఉండడం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయి. కార్పొరేషన్‌ పరిధిలో గత కొన్ని నెలలుగా రెగ్యులర్‌ కమిషనర్‌ లేరు. ఇక్కడి పనిచేస్తున్న జితేష్‌వి.పాటిల్‌ను కామారెడ్డి కలెక్టర్‌గా నియమించడంతో అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది. వేరే ఐఏఎస్‌ అధికారిని నియమించలేదు. 

ఇన్‌చార్జీ కమిషనర్‌గా అదనపు కలెక్టర్‌

జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి చిత్రామిశ్రాను ఇన్‌చార్జీ కమిషనర్‌గా నియమించారు. ఆమె స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఉండడంతో ఆమెకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. గ్రామ పంచాయతీలతో పాటు అన్ని మున్సిపాలిటీలు ఆమె పరిధిలో ఉండడం వల్ల పనులు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతీరోజు కొంత సమయాన్ని కార్పొరేషన్‌కు కేటాయిస్తూ ఫైళ్లను క్లియర్‌ చేస్తున్నా పూర్తిస్థాయిలో కావడంలేదు. కిందిస్థాయిలో అదనపు కమిషనర్‌ గత కొన్నేళ్లుగా నియమించకపోవడం, ఉన్న డిప్యూటీ కమిషనర్‌ రవిబాబు కూడా సెలవుపెట్టి వెళ్లిపోవడం వల్ల గత నెలరోజులుగా సమస్యలు ఎదురవుతున్నాయి. రెవన్యూ అధికారికి డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు అప్పజెప్పినా సంతకాలు పెట్టే అజమాయిషీ లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఈ పోస్టులే కాకుండా నగర కార్పొరేషన్‌ పరిదిలో ఎంహెచ్‌వో లేకపోవడం వల్ల పారిశుధ్యం పను ల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగర కార్పొరేషన్‌ పరిదిలో సానిటేషన్‌ పనులను ఎంహెచ్‌వో పరిదిలో ఉండడం వల్ల కీలక చెల్లింపుల్లో కూడా సమస్యలు వస్తున్నాయి. సానిటేషన్‌ సూపర్‌వైజర్‌కు బాధ్యతలు ఇవ్వడం వల్ల పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడంలేదు. 

టౌన్‌ప్లానింగ్‌ విభాగంలోనూ ఖాళీలు

నగరంలో కీలకమైన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో పోస్టులు గత కొన్ని నెలుగా ఖాళీగా ఉన్నాయి. భవన నిర్మాణాలకు దరఖాస్తు చేసుకున్న ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. టౌన్‌ప్లానింగ్‌ లో డిప్యూటీ సిటీ ప్లానర్‌, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ లో పనిచేస్తున్న అధికారు లు బదిలీ అయిన తర్వాత కొత్తవారిని నియమించలేదు. జిల్లా టౌన్‌అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారి శ్యాంకుమార్‌కు బాద్యతలు అప్పజెప్పారు. ఆయన తన శాఖతో పాటు నుడా, కార్పొరేషన్‌లో ఇన్‌చార్జిగా వ్యవహరించడం వల్ల అన్నిపనులు చేయడం ఇబ్బందిగా మారింది. ఇవేకాకుండా కార్పొరేషన్‌ పరిధిలో మరికొన్ని పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల సమస్యలు తలెత్తుతున్నా యి. కొన్ని బడా సంస్థలు రెగ్యులర్‌ అధికారులు లేకపోవడంవల్ల పన్నులు చెల్లించడంలేదు. కిందిస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ప న్నులు వసూలు కావడంలేదు. ఇవన్ని తెలిసిన ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో అధికారులు నియమించాలని కోరిన ఇప్పటి వరకు రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేయలేదు. సీనియర్‌ అధికారులను ఖాళీగా ఉన్న పోస్టుల్లో ని యమించ లేదు. దీని వల్ల పనులు ఆలస్యం కావడంతో కార్యాలయాలకు వచ్చేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఉన్న అధికారులు కాస్త సెలవుల్లోకి..

ఎక్కువసార్లు వస్తే తప్ప పనులు కావడంలేదు. ఉన్న అధికారులు కూడా ఒత్తిళ్లతో సెలవుపెట్టి వెళ్లడం వల్ల పనులు పెండింగ్‌లో పడుతున్నా యి. సెలవులను కూడా పెంచుకుంటూపోవడం వల్ల కిందిస్థాయి అధికారులకు అవకాశం ఇవ్వడంతో వారు కూడా కొంత వరకు పనిచేస్తున్న రెండు శాఖలపై దృష్టిపెట్టక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది అధికారులను ఇక్కడికి వెసేందుకు ప్రయత్నాలు చేసిన రాజకీయ ఒత్తిళ్లు ఉం టాయని నెపంతో ఇక్కడికి రాకుండానే ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. భారీ గా నిదులు వచ్చి పనులు కొనసాగుతున్న సమయాల్లో కీలక అదికారిని నియమిస్తే కార్పొరేషన్‌ పరిదిలో ఉన్న ప్రజలకు మేలు జరగనుంది. కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఐఏఎస్‌నుగాని, మున్సిపల్‌సర్వీసులో ఉన్న అదేస్థాయి అధికారిని గాని నియమిస్తే పనులు సజావుగా జరగనున్నాయి. ఇవేకాకుండా అదనపు కమిషనర్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారులను నియమిస్తే అ నుమతులతో పాటు పన్నులు వసూలుకానున్నా యి. సంవత్సరంలోపు ఎన్నికలు ఉన్న ఈ సమయంలో అధికార ప్రజాప్రతినిధులు దృష్టిసారిస్తే కార్పొరేషన్‌కు రెగ్యులర్‌ అధికారులు వచ్చే అవకాశం ఉంది. వారు తీసుకునే నిర్ణయం ఆధారంగానే ప్రభుత్వం ఈ అధికారులను నియమించనుంది. 

Updated Date - 2022-06-26T06:32:51+05:30 IST