‘గోళ్లపాడు’ ఆధునీకరణకు మరో రూ.30కోట్లు

ABN , First Publish Date - 2020-10-28T10:34:29+05:30 IST

ఖమ్మంలో భూగర్భ డ్రెయినేజీ సమస్య పరిష్కారం కోసం రూ.70కోట్లతో నిర్మితమవుతున్న గోళ్లపాడు చానల్‌ ఆధునికీకరణకు మరో రూ.30కోట్లు నిధులు కేటాయిస్తున్నట్టు రవాణా శాఖా మంత్రి పువ్వాడ

‘గోళ్లపాడు’ ఆధునీకరణకు మరో రూ.30కోట్లు

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

నగరంలో విస్తృత పర్యటన

నూతన బస్టాండ్‌ పనులు, మోడల్‌ రైతుబజార్‌ పనుల పరిశీలన


ఖమ్మం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మంలో భూగర్భ డ్రెయినేజీ సమస్య పరిష్కారం కోసం రూ.70కోట్లతో నిర్మితమవుతున్న గోళ్లపాడు చానల్‌ ఆధునికీకరణకు మరో రూ.30కోట్లు నిధులు కేటాయిస్తున్నట్టు రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మంలో మంగళవారం  కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తో కలిసి గోళ్లపాడు చానల్‌ పనులను పరిశీలించి, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గోళ్లపాడు చానల్‌ పూర్తిచేయడంతో భూగర్భ డ్రెయినేజీ సమస్యకు పరిష్కారం కలుగుతుందన్నారు. మురికికూపంగా ఉన్న గోళ్లపాడు చానల్‌ను ఆధునీకరించేందుకు ఇప్పటికే 11కి.మీ.మేర 80శాతం ప్రధాన పైపులైన్‌ పనులు పూర్తయ్యాయని, 350మ్యాన్‌హోల్స్‌లో 215 పూర్తయ్యాయని వివరించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ పురపాలక మంత్రి కేటీఆర్‌లు నగర అభివృద్ధికి ఇచ్చిన హామీ మేర అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. అనంతరం ఖమ్మం బైపాస్‌రోడ్డులో రూ.17.50కోట్లతో నిర్మిస్తున్న ఆర్టీసీ బస్టాండ్‌ పనులను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పరిశీలించారు.  ఏడువారాల్లోగా పనులు పూర్తికావాలని, నాణ్యతలో రాజీపడవద్దని అన్నారు. బస్టాండ్‌ సమీపంలోని సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌మార్కెట్లు, మోడల్‌ రైతుబజార్‌నుమంత్రి పరిశీలించారు. ఆర్డీవో కార్యాలయం పక్కన ఉన్న రైతుబజార్‌ను నూతన బస్టాండ్‌ సమీపంలోని సమీకృత మార్కెట్‌లోకి మార్చుతామన్నారు.


అత్యాధునిక రైతుబజార్‌ ఏర్పాటుచేసి 450మంది రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. నగరాన్ని సువిశాలంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మరో రూ.50కోట్లతో నగర అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, మేయర్‌ పాపాలాల్‌, డిప్యూటీమేయర్‌ బత్తుల మురళి, కమిషనర్‌ అనురాగజయంతి, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌రావు, శిక్షణ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఆర్టీసీ చీఫ్‌ ఇంజనీర్‌ రాంప్రసాద్‌, ఆర్‌ఎం కృష్ణమూర్తి, ఆర్డీవో రవీంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-28T10:34:29+05:30 IST