వెళ్ళయంగిరికి ప్రత్యేక రహదారి

ABN , First Publish Date - 2022-05-23T15:04:40+05:30 IST

కోయంబత్తూరు జిల్లాలోని వెళ్ళయంగిరి ఆలయానికి ప్రత్యేక రహదారి నిర్మించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన స్థానిక

వెళ్ళయంగిరికి ప్రత్యేక రహదారి

- మంత్రి శేఖర్‌బాబు

చెన్నై, మే 22 (ఆంధ్రజ్యోతి) : కోయంబత్తూరు జిల్లాలోని వెళ్ళయంగిరి ఆలయానికి ప్రత్యేక రహదారి నిర్మించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన స్థానిక భక్తులతో కలిసి కాషాయం ధోవతి, బనియన్‌, తువ్వాలు ధరించి ఊతకర్రలను పట్టుకుని కొండపైకి నడిచి వెళ్ళారు. దేవాదాయ శాఖ అధికారులతోపాటు ఆ కొండపైకి వెళ్ళి ప్రత్యేక రహదారి నిర్మించే అంశంపై కూడా పరిశీలించారు. కొండపై ఆలయాన్ని దర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వెళ్ళయంగిరి ఆండవర్‌ ఆలయానికి భక్తులు కాలినడకనే వెళ్తున్నారని, ఈ కాలిబాట పొడవునా బండరాళ్ళను దాటుకుని తీవ్ర ఇబ్బందులతో వెళ్ళాల్సి ఉందని చెప్పారు. ఈ కొండపైకి సులువుగా వెళ్లేందుకు నడక రహదారినైనా నిర్మించాలని భక్తులు తనకు విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో దేవాదాయ శాఖకు సబంధించిన ఆర్థిక పద్దులపై జరిగిన చర్చల సందర్భంగా వెళ్ళయంగిరి ఆలయానికి, తిరువణ్ణామలై జిల్లా పర్వతమలై మల్లిఖార్జున స్వామి ఆలయం, పోలూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మదురై జిల్లా సదురగిరి సుందరరామలింగస్వామిఆలయం, తేని జిల్లా కన్నగి ఆలయానికి భక్తులకోసం ప్రత్యేక రహదారులు నిర్మించనున్నట్లు ప్రకటించినట్టు గుర్తు చేశారు.. ఆ మేరకు   వెళ్ళయంగిరి ఆండవర్‌ ఆలయానికి ప్రత్యేక రహదారిని నిర్మించనున్నామని తెలిపారు. ఈ కొండపైకి రహదారి నిర్మించే విషయమె నిపుణుల కమిటీతో పరిశీలన జరుపనున్నట్టు తెలిపారు.  కమిటీ  నివేదిక ప్రకారం వీలైనంత త్వరగా ఈ ఆలయానికి ప్రత్యేక రహదారిని నిర్మిస్తామని చెప్పారు. మంత్రి వెంట దేవాదాయ శాఖ కమిషనర్‌ కుమరగురుబరన్‌, అదనపు కమిషనర్‌ కన్నన్‌ తదితర అధికారులు పర్యటించారు.

Updated Date - 2022-05-23T15:04:40+05:30 IST