మరో గంట

ABN , First Publish Date - 2022-01-20T05:36:02+05:30 IST

మద్య నిషేధం విషయంలో నాటి ఎన్నికల హామీకి.. నేటి రాష్ట్ర ప్రభుత్వ తీరుకు పొంతన లేకుండా పోతోంది. అధికారంలోకి వస్తే దశలవారీగా దుకాణాలు తగ్గించి.. పూరిస్థాయిలో మద్య నిషేధం అమలు చేస్తామన్న సీఎం జగన్‌ హామీ.. ఆచరణకు దూరమవుతోంది. తాజాగా మద్యం దుకాణాల నిర్వహణ సమయాన్ని ప్రభుత్వం మరో గంట పెంచింది. ఉదయం 11 నుంచి రాత్రి పది గంటల వరకు దుకాణాలు తెరచి ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి వేళ ఓ వైపు రాత్రి వేళ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. మద్యం దుకాణాలకు మాత్రం గంట సమయాన్ని పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరో గంట

మద్యం దుకాణాల నిర్వహణకు సమయం పెంపు

రాత్రి 10 వరకు తెరచి ఉంచాలని ఉత్తర్వులు

కరోనా వ్యాప్తి వేళ.. ప్రభుత్వ తీరుపై విమర్శలు

(రాజాం, జనవరి 19)

మద్య నిషేధం విషయంలో నాటి ఎన్నికల హామీకి.. నేటి రాష్ట్ర ప్రభుత్వ తీరుకు పొంతన లేకుండా పోతోంది. అధికారంలోకి వస్తే దశలవారీగా దుకాణాలు తగ్గించి.. పూరిస్థాయిలో మద్య నిషేధం అమలు చేస్తామన్న సీఎం జగన్‌ హామీ.. ఆచరణకు దూరమవుతోంది. తాజాగా మద్యం దుకాణాల నిర్వహణ సమయాన్ని ప్రభుత్వం మరో గంట పెంచింది. ఉదయం 11 నుంచి రాత్రి పది గంటల వరకు దుకాణాలు తెరచి ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి వేళ ఓ వైపు రాత్రి వేళ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. మద్యం దుకాణాలకు మాత్రం గంట సమయాన్ని పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యానికి కొవిడ్‌ ఆంక్షలు వర్తించవా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దుకాణాల్లో అకౌంట్లు చూసుకునేందుకు గంట సమయాన్ని పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇప్పటికే రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు అకౌంట్లు చూసుకునేందుకు సమయం కేటాయించగా.. అదనంగా గంట పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలున్నాయి. 


 జిల్లాలో ఇదీ పరిస్థితి  

జిల్లాలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 239 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రైవేటు దుకాణాలను రద్దు చేసింది. 2019 అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా 187 దుకాణాలను ఏర్పాటు చేసింది. షాపునకు ఇద్దరు సేల్స్‌మేన్లు, ఒక సూపర్‌వైజర్‌ చొప్పున నియమించింది. 2020 మార్చి తరువాత షాపుల కుదింపులో భాగంగా 29 షాపులను తగ్గించింది. దీంతో అప్పటి నుంచి 158 మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. 2020 అక్టోబరులో ప్రభుత్వం రెండోసారి మద్యం పాలసీని ప్రకటించింది. కానీ, షాపులు తగ్గించలేదు. ఇప్పుడు తాజాగా ప్రకటించిన మూడో మద్యం పాలసీలో కూడా అదే పరిస్థితి. కనీసం షాపులు తగ్గించే ప్రతిపాదనలు ఏవీ లేవు సరికదా.. నిర్వహణ సమయాన్ని గంట పెంచింది. దీనికితోడు మద్యం వాక్సిన్‌ స్టోర్స్‌, పర్యాటక ప్రాంతాల్లో మాల్స్‌ పేరిట కొత్తగా 14 షాపులను ఏర్పాటుచేశారు. ఈ లెక్కన ఈ రెండున్నరేళ్లలో కేవలం 15 మద్యం దుకాణాలు మాత్రమే తగ్గాయి. ఈ నేపథ్యంలో  మద్య నిషేధం విషయంలో ప్రభుత్వం మాట తప్పిందంటూ పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాలో కరోనా, ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతోంది. రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిస్తే కర్ఫ్యూ ఎలా సాధ్యమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. 


 ఆది నుంచి విమర్శలే..

మద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆది నుంచీ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దుకాణాల సమయపాలన మార్చడం, ధరల పెంపు, మద్యం బ్రాండ్లపై పెద్ద దుమారమే రేగింది. కానీ మందుబాబులకు మద్యం నుంచి దూరం చేయడంలో భాగమేనని ప్రభుత్వం సమర్థించుకుంటూ వచ్చింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడపడమేంటని విపక్షాలు ప్రశ్నించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మద్యం ధరల పెంపుతో మందుబాబులు సారా వైపు మరిలారు. ఒడిశా మద్యం సైతం పెద్ద ఎత్తున దిగుమతి అయ్యింది. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా సారా ఏరులై ప్రవహిస్తోంది. మద్యం, సారా అక్రమ రవాణాకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో విభాగం కూడా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో షాపులు మూతపడినా, మద్యం విక్రయాలు మాత్రం యథాతధంగా సాగింది. కొందరు సిబ్బంది పాత్రతోనే ఇది జరిగిందని విచారణలో తేలింది. కానీ ప్రభుత్వం మాత్రం తూతూమంత్రపు చర్యలకే పరిమితమైంది. 


ప్రభుత్వ ఆదేశాల మేరకు  

ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టాం. ఈ నెల 17వ తేదీ నుంచి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరచి ఉంచాలని నిర్వాహకులకు ఆదేశించాం.  

- సీహెచ్‌ దాసు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, శ్రీకాకుళం 

Updated Date - 2022-01-20T05:36:02+05:30 IST