కర్ణాటక: హిజాబ్ వివాదం ముగియకముందే మరొకటి

ABN , First Publish Date - 2022-03-22T23:11:16+05:30 IST

ఉడిపి జిల్లా కౌప్‌లోని మారి జాతర (మారి గుడి సమీపంలో జరిగే ఉత్సవం), శివమొగ్గలోని ఒక గుడిలో ఈ వివాదం చెలరేగింది. మారి జాతరకు సంబంధించి ఆలయ కమిటీ వేలం పాట నిర్వహించగా, వేలం పాటను అడ్డుకున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలు..

కర్ణాటక: హిజాబ్ వివాదం ముగియకముందే మరొకటి

బెంగళూరు: కర్ణాటకను కొద్ది రోజులుగా హిజాబ్ వివాదం ఊపేస్తోంది. ఇప్పిడిప్పుడే ఈ వివాదం కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇది పూర్తిగా ముగిసిపోక ముందే మరో వివాదం తలెత్తింది. హిందూ దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ముస్లింలు వ్యాపారాలు చేయడాన్ని భజరంగ్ దళ్ సహా మరికొన్ని రైట్ వింగ్ గ్రూపులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బలవంతంగా ముస్లిం దుకాణాలను మూసివేస్తున్నాయి. హిందూ దేవాలయ పరిసర ప్రాంతాల్లో హిందువులు మాత్రమే వ్యాపారాలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆలయ కమిటీ ఈ డిమాండ్‌కు తలొగ్గి ముస్లింలను వేలంలోకి తీసుకోలేదు. హిజాబ్ వివాదం ప్రారంభమైన ప్రాంతం నుంచి తాజా వివాదం కూడా లేవడం గమనార్హం.


ఉడిపి జిల్లా కౌప్‌లోని మారి జాతర (మారి గుడి సమీపంలో జరిగే ఉత్సవం), శివమొగ్గలోని ఒక గుడిలో ఈ వివాదం చెలరేగింది. మారి జాతరకు సంబంధించి ఆలయ కమిటీ వేలం పాట నిర్వహించగా, వేలం పాటను అడ్డుకున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలు.. జాతర సమీపంలో ముస్లింలకు వ్యాపార అనుమతి ఇవ్వవద్దని, వారిని వేలంలోకే తీసుకోవద్దని డిమాండ్ చేశారు. ఉడిపి, శివమొగ్గ ప్రాంతంలోని ఈ గుళ్లలో జరిగే ఉత్సవంలో చివరిరోజు కోళ్లను బలి ఇస్తుండటం సంప్రదాయం. అయితే ఆ సమయంలో కోళ్ల స్టాల్స్‌ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. ఇందులో మెజారిటీ ముస్లింలే ఉంటారు. అయితే మంగళవారం ప్రారంభమైన ఈ ఉత్సవంలో ఆ ప్రాంతంలో ముస్లింలు ఎవరూ కనిపించడం లేదు. తమ ఉపాధి పోయిందని, జాతర కోసం చాలా పెట్టుబడి పెట్టామని, కానీ ఇప్పుడిలా జరిగే సరికి ఏం చేయాలో తోచట్లేదని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-03-22T23:11:16+05:30 IST