కోరలు చాచిన కరోనా

ABN , First Publish Date - 2020-06-29T10:15:12+05:30 IST

కరోనా కోరలు చాచింది. రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా కంటికి కనిపించని మహమ్మారి ప్రజలపై దాడి చేస్తోంది.

కోరలు చాచిన కరోనా

మరో 111 కేసులు నమోదు

వెయ్యికి చేరువలో కరోనా బాధితులు

బెడ్స్‌ కొరత అధిగమించేరా?

హోం ఐసోలేషన్‌కు అవకాశాలు

సీఎం పర్యటనపై అధికారుల్లో భయాందోళన


కడప (ఆంధ్రజ్యోతి) : కరోనా కోరలు చాచింది. రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా కంటికి కనిపించని మహమ్మారి ప్రజలపై దాడి చేస్తోంది. విజృంభిస్తున్న కరోనాను చూసి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత వారం పదిరోజులుగా రోజూ 50, 100కు పైగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా శనివారం ఒక్కరోజే 111 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 951కి చేరింది. ఒక్క పులివెందులలోనే 53 కేసులు నమోదయ్యాయి. జిల్లా కోవిడ్‌-19 ఆసుపత్రి ఫాతిమా మెడికల్‌ కాలేజీలో బెడ్స్‌ కొరత వేధిస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. అన్ని అవకాశాలు ఉంటే హోం ఐసోలేషన్‌కు అనుమతిస్తామని అధికారులు అంటున్నారు. జిల్లాలో ఒ ప్రజాప్రతినిధి ప్రైవేటు పీఏకు కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. జూలై 8న సీఎం జగన్‌ జిల్లా పర్యటన ఉంది. ఓ పక్క కేసులు పెరుగుతుండడంతో సీఎం పర్యటనపై అధికారులు భయాందోళన చెందుతున్నారు. 

జిల్లాలో కరోనా అడ్డూ అదుపు లేకుండా విజృంభిస్తోంది. వెయ్యికి చేరువలో కరోనా బాధితుల సంఖ్య చేరింది. శనివారం పులివెందులలో 53, ప్రొద్దుటూరులో 17, కడపలో 8, మైలవరం మండలం చిన్నకొమెర్లలో 9, ఎర్రగుంట్లలో 10 కేసులు నమోదయ్యాయి. కడప నగరంలో రాజారెడ్డివీధి, నభీకోట, ఎర్రముక్కపల్లె, నాగరాజుపేటలలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జనం ఆందోళన చెందుతున్నారు. పులివెందుల పట్టణమంతా కేసులు విస్తరిస్తున్నాయి. ప్రొద్దుటూరులో కరోనా వైరస్‌ అదుపులోకి రావడం లేదు. దీంతో అక్కడ కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కలెక్టరు హరికిరణ్‌ అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలింపు తరువాత భారీగా కేసులు పెరుగుతుండడంతో సామాన్యులు బయటికి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఫాతిమా మెడికల్‌ కాలేజీలో చికిత్స పొందుతున్న 29 మంది శనివారం డిశ్చార్జి అయ్యారు. వీరితో కలిపి కరోనాను జయించి కోలుకున్న వారి సంఖ్య 362కు చేరింది.


కోవిడ్‌ ఆసుపత్రిలో బెడ్స్‌ కొరత అధిగమించేరా?

జిల్లాలో కరోనా పాజిటివ్‌ బాధితులు 951కి చేరారు. రోజురోజుకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 362 మంది బాధితులు కరోనాను జయించి కోలుకున్నారు. 589 మంది జిల్లా కోవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫాతిమా మెడికల్‌ కాలేజీని జిల్లా కోవిడ్‌ ఆసుపత్రిగా కొనసాగిస్తున్నారు. 500 బెడ్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం 480 మంది చికిత్స పొందుతున్నారు. గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీని కోవిడ్‌ సెంటరుగా మార్చి మరో 300 బెడ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఆ కేంద్రంలో 95 మంది చికిత్స పొందుతున్నారని వైద్య ఆరగ్యోశాఖ అధికారులు తెలిపారు. మరో 14 మంది ప్రభుత్వ నిబంధనలకు లోబడి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.


కాగా రోజురోజుకూ పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని శ్రీనివాస ఇంజనీరింగ్‌ కాలేజీని కోవిడ్‌ సెంటరుగా మార్చి 300 నుంచి 400 బెడ్స్‌ అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. రిమ్స్‌ ఆసుపత్రిలో కోవిడ్‌ బాధితుల కోసం 200 బెడ్స్‌ అందుబాటులో ఉన్నా సాధారణ జబ్బులతో వచ్చే రోగులను, గర్భిణులను దృష్టిలో ఉంచుకుని కరోనా బాధితులను అక్కడ ఉంచడం లేదు. కాగా పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ఏ ఇబ్బంది లేకుండా కోవిడ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.


హోం ఐసోలేషన్‌కు అవకాశం

దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు లేకుండా, గుండెజబ్బు, బీపీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులు లేని కరోనా పాజిటివ్‌ రోగులకు హోంఐసోలేషన్‌లో ఉండే అవకాశం కల్పిస్తామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇంట్లో అటాచ్డ్‌ బాత్‌రూం కలిగిన ప్రత్యేక గది ఉండాలి. వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారు కుటుంబంలో ఉండరాదు. స్మార్ట్‌ ఫోన్‌ కలిగి వీడియో కాల్‌ ద్వారా టెలీ మెడిసిన్‌ సెంటరు నుంచి డాక్టర్లు ఎప్పటికప్పుడు మాట్లాడేందుకు అవకాశం ఏర్పాటు చేసుకుంటే అలాంటి వారు హోం ఐసోలేషన్‌లో ఉండవచ్చు. వారికి పదిరోజులకొకసారి పదో రోజు, 14వ రోజు కరోనా టెస్టులు చేసి నెగటివ్‌ వస్తే వారిని విముక్తి చేసే అవకాశం ఉంది. ఇలా ప్రభుత్వ నిబంధనలకు లోబడి డిక్లరేషన్‌ ఇచ్చే వారికి మాత్రమే అవకాశం ఇస్తారు. ప్రస్తుతం కడప, ప్రొద్దుటూరు పట్టణాల్లో 14 మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 


8న సీఎం పర్యటనపై అధికారుల్లో భయాందోళన

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8న సీఎం జగన్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఇడుపులపాయ, పులివెందుల ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ మేరకు జిల్లా అధికారులు, సీఎంవో ఆఫీసు అధికారులు ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. కాగా ఒకపక్క కరోనా వైరస్‌ అదుపు లేకుండా వేగంగా విస్తరిస్తుండడం జిల్లాలో వెయ్యికి చేరువలో కరోనా కేసులు చేరాయి. అధికారులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ సమయంలో సీఎం జిల్లా పర్యటనకు వస్తే ఆయనను కలిసేందుకు జనం, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎవరిని అదుపు చేయాలో అర్థం కాక అధికారులు భయాందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కాగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఎవరికీ ఇబ్బంది లేకుండా సీఎం పర్యటన ఉంటుందని జిల్లా యంత్రాంగం పేర్కొనడం కొసమెరుపు.


ఓ ప్రజా ప్రతినిధి ప్రైవేటు పీఏకు పాజిటివ్‌

జిల్లాలో ఓ కీలక ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకులు (ప్రైవేటు పీఏ)కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. ఆయనను ఫాతిమా మెడికల్‌ కాలేజీకి తరలించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆ ప్రజాప్రతినిధితో కలిసి ప్రైవేటు పీఏ ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధి వెంటే ఉన్నారు. దీంతో ఆ కార్యక్రమాలకు హాజరైన అధికారులు, ప్రభుత్వ సిబ్బంది భయాందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. 


కరోనా అప్‌డేట్స్‌

మొత్తం శాంపిల్స్‌ - 67874

ఫలితాలు వచ్చినవి - 63977

నెగటివ్‌ - 63026

పాజిటివ్‌ - 951

ఫలితాలు రావాల్సినవి - 3897

28న తీసిన శాంపిల్స్‌ - 1419

డిశ్చార్జి అయిన వారు - 362

యాక్టివ్‌ కేసులు - 589


శనివారం నమోదైన పాజిటివ్‌ కేసులు

పులివెందుల - 53

ప్రొద్దుటూరు - 17

కడప - 8

మైలవరం - 8

ఎర్రగుంట్ల - 10

లింగాల - 1

ముద్దనూరు - 1

రాజంపేట - 3

గాలివీడు - 1

దువ్వూరు - 1

వేంపల్లె - 1

వల్లూరు 1 

సీకేదిన్నె - 1

మైదుకూరు - 2

బద్వేలు -1 

ఫారిన్‌ రిటర్న్స్‌ - 2 

మొత్తం  - 111

Updated Date - 2020-06-29T10:15:12+05:30 IST