అన్నపూర్ణగా తెలంగాణ

ABN , First Publish Date - 2020-07-02T11:38:15+05:30 IST

ఆకలి దప్పికల నుంచి రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సిగిరెడ్డి

అన్నపూర్ణగా తెలంగాణ

1.50 కోట్ల ఎకరాలకు రూ.7 వేల కోట్ల సాయం అందించాం

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి


వనపర్తి, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : ఆకలి దప్పికల నుంచి రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సిగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రైతుబంధు అమలు విషయం చాలా గర్వంగా ఉందని, 1.50 కోట్ల ఎకరాలకు గాను ఇప్పటి వరకు వానాకాలానికి సంబంధించి రూ.7 వేల కోట్ల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు. 28 వేల మంది రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేసినా, ఐఎఫ్‌ఎస్‌సీ తప్పుగా ఉండటమో, నాన్‌ ఆపరేటీవ్‌ అకౌంట్లు ఉండటం వల్ల వాపస్‌ వచ్చాయని అన్నారు. మరో 11 వేల మంది రైతుల ఖాతాలకు గాను బ్యాంకు, ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకంలో పేర్లు సరిపోలడం లేదని, అందు వల్ల వాటిల్లో జమకాలేదని వివరించారు. రైతులు అధికారులను సంప్రదించి, సరైన వివరాలు పంపిస్తే త్వరితగతిన డబ్బులు జమ అయ్యే విధంగా చూస్తామని చెప్పారు.


ఏ క్లస్టర్‌లోనైనా అర్హులుగా ఉండి రైతుబంధు రాకపోతే, వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటి వరకు 60.35 లక్షల రైతులు పథకానికి అర్హులుగా ఉంటే, వారిలో 55.06 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్లు జమచేశామని, నిన్న, మొన్న 1.96 లక్షల రైతులు వివరాలు సమర్పించగా, వారికి ఒకటి, రెండు రోజుల్లో రూ.214.75 కోట్లు జమ చేస్తామని అన్నారు. రాష్ట్రంలో చివరి రైతు వరకూ రైతుబంధు అందడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని, అందు కోసం మరో రూ.400 కోట్లు కూడా ఖర్చు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారని అన్నారు. కేవలం 36 గంటల వ్యవధిలోనే సుమారు ఐదు వేల కోట్లకు పైగా డబ్బులు జమచేసి ప్రపంచ రికార్డును తెలంగాణ నెలకొల్పిందని అన్నారు. ఆర్థిక మాంద్యం, కరోనా కష్టాలు ఉన్నా, రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి చెప్పారు. సమావేశంలో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, రాష్ట్ర మార్కెటింగ్‌ సహకార సంఘం డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-02T11:38:15+05:30 IST