పేరుకే అన్నమయ్య..!

ABN , First Publish Date - 2022-04-15T05:00:05+05:30 IST

అన్నమయ్య స్వస్థలం తాళ్లపాకలో ఇసుమంత కూడా అభివృద్ధి లేదు.

పేరుకే అన్నమయ్య..!
అన్నమయ్య థీంపార్క్‌లో ఎండిపోతున్న మొక్కలు

రాయచోటి కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు అన్నమయ్య అనే పేరు పెట్టారు. అన్నమయ్యకు విలువ ఇచ్చామని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. కానీ అన్నమయ్య స్వస్థలం తాళ్లపాకలో ఇసుమంత కూడా అభివృద్ధి లేదు. ఇక్కడ ఉన్న అన్నమయ్య విగ్రహానికి జిల్లా ఆవిర్భావం రోజున మూరెడు పూలు వేసినవారు లేరు. అన్నమయ్య పేరుతో ఉన్న నీటి ప్రాజెక్టు కొట్టుకుపోయి ఐదునెలలు అవుతున్నా దాని అతీగతీ లేదు.. పేరుకు మాత్రం ‘అన్నమయ్య’ను గొప్పగా వాడుకుంటున్నారే కానీ.. ఆయన విగ్రహానికి, ఆయన జన్మస్థలానికి, ఆయన రచనలకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదు అని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మలనేవి ఉంటే.. అన్నమయ్య ఎలా ఆవేదన వ్యక్తం చేస్తారో అనేదే ఈ కథనం..

- రాజంపేట


రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు 

అయ్యా.. !

నేను వైకుంఠప్రాప్తి పొంది 519 ఏళ్లైన తర్వాత నన్ను స్మరిస్తూ ఈ జిల్లాకు నా పేరు పెట్టడం చూసి.. నాకు పెద్ద గౌరవం ఇస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. నా పేరిట జిల్లాను ఆవిర్భావం చేసి మీరు ప్రచారం పొందారు.. కనీసం అన్నమయ్య జిల్లా ఆవిర్భావం రోజున తాళ్లపాకలోని నా విగ్రహానికి సున్నంకొట్టి మూరెడు పూలైనా వేయలేదు. తిరుమల ఆలయంలో.. శ్రీవారికే హుండీని ఏర్పాటు చేసి అపర కుబేరున్ని చేసిన నన్నే జిల్లా ఆవిర్భావం రోజున అన్ని విధాలా అవమాన పరిస్తిరి. ఆ రోజున నేను పుట్టిన తాళ్లపాకలో కానీ, 108 అడుగుల విగ్రహం వద్ద కానీ కనీసం చిన్నపాటి వేడుక చేసి మా గ్రామస్తులను, నన్ను సంతోషరచలేదు సరికదా.. రాయచోటి జిల్లా కేంద్రంలో సైతం నా చిన్నపాటి ఫొటో తప్ప నా పదకవితలకు సంబంధించిన చారిత్రాత్మక అంశాలను ప్రజలకు చూపించకపోతిరి. 

అన్నమయ్య పేరిట జిల్లా అంటూ.. మీ ఆనందంలో మీరుంటిరి. నేను పుట్టిన తాళ్లపాకలో మీ నాన్న నా విగ్రహం ఏర్పాటు చేశారు.. ఓ పార్కును కూడా పెట్టారు.  కొన్ని అభివృద్ధి పనులు చేశారు. నా పేరు వాడవాడలా వినపడేటట్లు చేసి పుణ్యం కట్టుకున్నారు. నీవు..? సీఎంగా అధికారం చేపట్టిన వెంటనే మా ఊరికి ఎంతో మేలు చేస్తావనుకుంటిమి. మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తావని, నా పేరు వాడవాడలా వినిపిస్తారని అనుకొని ఆనందపడితి. మీనాన్న ఇచ్చిన విలువలో కనీసం పదోవంతు కూడా నాకు విలువ ఇవ్వలేదు.

నా విగ్రహానికి ఎన్నో ఏళ్ల నుంచి తేనెటీగల తుట్టి పెట్టి చూపరులను వెక్కిరిస్తున్నా... అయ్యో అన్నమయ్యా... అని వారు బాధపడుతున్నా... జిల్లా ఆవిర్బావం రోజున కూడా ఆ తేనెటీగల తుట్టిని కనీసం తీయించలేదు. హైవే రోడ్డు పక్కన ఉన్న 108 అడుగుల నా విగ్రహం చుట్టూ మీ నాన్న పార్క్‌ ఏర్పాటు చేస్తే.. దానిని అభివృద్ధి చేయకపోగా అందులో కంపచెట్లను కూడా తొలగించకుండా విషసర్పాలకు నిలయంగా మార్చారు.  నా సభాస్థలి పూర్తిగా శిథిలమైనా పట్టించుకోకపోతిరి. నా పక్కనే మీ నాన్న రూ.10 కోట్లతో ఏర్పాటు చేస్తామన్న శ్రీవారి దేవాలయాన్ని కట్టించకపోతిరి. నా ఊరిలో మీ నాన్న డబుల్‌ రోడ్లు వేసి, సెంట్రల్‌ లైట్లు పెట్టి తిరుమల రీతిలో దేదీప్యమానంగా వెలిగిస్తామని చెప్పారు. నీవు కనీసం పాడైన రోడ్లకు ప్యాచింగ్‌ కూడా చేయకపోతివి. తాళ్లపాకలో ఉన్న నా విగ్రహానికి పట్టెడు పూలు పెట్టకపోతివి. ఎవరో కట్టించిన నా ధ్యానమందిరం కూలిపోయే స్థితిలో ఉన్నా దానికి కూసింత సిమెంటు పూత వేయకపోతివి. మీ నాన్న నా ఊరిలోని నా విగ్రహం చుట్టూ మాడ వీధులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.. పట్టించుకునేవారు లేక ఆ మాడవీధులు నేడు మురికి కూపాలుగా మారాయి. మా గ్రామంలో ఏర్పాటు చేస్తామన్న సంగీత కళాశాలపై దృష్టి పెట్టకపోతివి. నా సంగీత భాండాగారాన్ని ప్రజలు చూసేందుకు అందుబాటులో పెట్టకపోతివి. 

అసలు తాళ్లపాక గ్రామం ఎలా ఉంటుందో నీకు తెలియదు. నా ఊరికి ఏనాడూ రాకపోతివి. ఏదో అందరూ అనుకుంటున్నారు తప్ప నా పేరు తెలుసు. నా పేరిట ఉన్న ప్రాజెక్టు మీవారి స్వలాభం వల్ల కొట్టుకుపోయింది. నా ప్రాంత వాసుల ప్రాణాలు పోయాయి.. అన్నదాతలు నట్టేట మునిగారు. నా పేరిట ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు పాయే.. నా జన్మస్థలిని అభివృద్ధి చేయకుండా.. జిల్లాకు మాత్రం నా పేరు పెడితివి.. అన్నమయ్య... అన్నమయ్యా... అంటూ నాకు అన్ని రకాలా అన్యాయం చేస్తివి. జిల్లాకు అన్నమయ్య అనేపేరు తప్ప.. నాకంటూ ఈ జిల్లాలో ఏమైనా మిగిలిందా..? ఇదేనా నాకు మీరిచ్చే మర్యాద..? ఇంకా నన్ను, నా ప్రాంతాన్ని ఏమి చేయాలనుకుంటున్నావు జగన్మోహనా..?

ఇట్లు 

అన్నమయ్య ఆత్మ



Updated Date - 2022-04-15T05:00:05+05:30 IST