మళ్లీ అన్నాడీఎంకేలో శశి ‘కళకలం’!

ABN , First Publish Date - 2021-12-21T13:05:25+05:30 IST

అన్నాడీఎంకేలో మళ్లీ ‘శశికళకలం’ రేగింది. ప్రణాళికాబద్ధంగానో, యాదృచ్ఛికంగానో గానీ.. మిత్రపక్షాలైన బీజేపీ, అన్నాడీఎంకే నేతల నోటివెంట శశికళ వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది. దీంతో మళ్లీ పార్టీలో ఏదో

మళ్లీ అన్నాడీఎంకేలో శశి ‘కళకలం’!

- తప్పు సరిదిద్దుకుని వస్తే సాదరంగా ఆహ్వానిద్దాం

- ఎడప్పాడి సమక్షంలో పన్నీర్‌సెల్వం

- ఆ అవసరమే లేదు

- మాజీ మంత్రి జయకుమార్‌

- శశికళ కలిస్తే అన్నాడీఎంకే బలోపేతం : బీజేపీ


చెన్నై: అన్నాడీఎంకేలో మళ్లీ ‘శశికళకలం’ రేగింది. ప్రణాళికాబద్ధంగానో, యాదృచ్ఛికంగానో గానీ.. మిత్రపక్షాలైన బీజేపీ, అన్నాడీఎంకే నేతల నోటివెంట శశికళ వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది. దీంతో మళ్లీ పార్టీలో ఏదో జరుగబోతోందంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు ఉత్కంఠకు గురవుతున్నారు. గత మే మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూశాక మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళతో సన్నిహితంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆయన చేసిన ‘ధర్మయుద్ధం’ను విస్మరించి మరీ ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ఓపీఎస్‌ నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీకి ఉపసమన్వయకర్తగా వున్న మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌)కి, ఆయన సహచరులకు ఇది ఏమాత్రం రుచించడం లేదు. ఇటీవల మదురైలో జరిగిన ఓ బహిరంగ సభలో ఓపీఎస్‌ మాట్లాడుతూ.. శశికళను పార్టీలో చేర్చుకునే వ్యవహారంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే ఈపీఎస్‌ తీవ్రంగా స్పందించారు. శశికళను పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని, ఆ మేరకు పార్టీ కార్యవర్గ సమావేశమే ఏకగ్రీవంగా తీర్మానించిందంటూ ఆయన తేల్చి చెప్పారు. ఓపీఎస్‌ చేసిన వ్యాఖ్యల ఎలాంటి ప్రయోజనం లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈపీఎస్‌ సమక్షంలోనే ఓపీఎస్‌ శశికళకు మద్దతుగా పరోక్ష వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తప్పు చేసిన వారు తమ తప్పు సరిదిద్దుకుని వస్తే యేసు ప్రభువులా క్షమించి, సాదరంగా ఆహ్వానించాలని, అదే మన సంప్రదాయమని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయన శశికళ పేరెత్తికపో యినా.. ఆమె వ్యవహారానికి సంబంధించే ఈ వ్యాఖ్యలు చేశారని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఈపీఎస్‌ సమక్షంలోనే ఓపీఎస్‌ ఈ వ్యాఖ్యలు చేసినందున ఆయన శశికళ వ్యవహారంలో అమీతుమీకి సిద్ధమవుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఓపీఎస్‌ వ్యాఖ్యల పట్ల ఈపీఎస్‌ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం.


ఓపీఎస్‌ వాఖ్యలను ఖండించిన జయకుమార్‌

శశికళను పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరమే లేదని అన్నాడీఎంకే సీనియర్‌ మంత్రి డి.జయకుమార్‌ స్పష్టం చేశారు. ఈపీఎస్‌, ఓపీఎస్‌ పాల్గొన్న కార్యక్రమానికి హాజరైన జయకుమార్‌.. అప్పటికి మౌనం దాల్చి, ఆ తరువాత మీడియా సమావేశంలో ఓపీఎస్‌ వ్యాఖ్యలను ఖండించారు. ఓపీఎస్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఎవ్వరినీ క్షమించి, సాదరంగా స్వాగతం పలకాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.


శశికళ చేరికతోనే అన్నాడీఎంకే బలోపేతం: బీజేపీ

జయ మరణానంతరం నుంచి అన్నాడీఎంకేకు అండగా నిలిచిన బీజేపీ కీలకమైన సూచన చేసింది. శశికళ చేరికతోనే అన్నాడీఎంకే బలోపేతమవుతుందని స్పష్టం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ ఆంగ్ల ఛానల్‌తో మాట్లాడుతూ.. శశికళ చేరికతో ఆ పార్టీ మరింత దృఢపడుతుందని వ్యాఖ్యానించారు. మున్ముందు అన్నాడీఎంకేలో శశికళ పాత్ర ఎలా ఉండబోతోందన్న ప్రశ్నపై స్పందిస్తూ.. దీనికి కాలమే సమాధానం చెబుతుందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తాను శశికళకు వ్యతిరేకిని కానని, అదే సమయంలో అన్నాడీఎంకే బలహీనపడడాన్ని కూడా సహించలేనని పేర్కొన్నారు. అందుకే శశికళతో అన్నాడీఎంకే కలిస్తే మళ్లీ పూర్వ వైభవం వస్తుందని సూచించారు. ‘ఇందుకు ఈపీఎస్‌-ఓపీఎస్‌లను ఒప్పిస్తారా?’ అని అడగ్గా.. అది తన పని కాదని పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వాన్ని త్వరలోనే ఇంటికి సాగనంపుతామన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి స్టాలిన్‌ గట్టిగా శ్రమిస్తున్నా, ఆయన సహచర మంత్రుల నుంచి సరైన స్పందన లేదన్నారు. ఎన్‌డీఏ కూటమిలో పీఎంకే కొనసాగుతుందా అని అడగ్గా.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో పీఎంకే తమ కూటమి తరఫునే పోటీ చేస్తుందన్నారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించడమే తమ ముందున్న లక్ష్యమని, ఈ లోపు డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని అన్నామలై జోస్యం చెప్పారు.

Updated Date - 2021-12-21T13:05:25+05:30 IST