రసవత్తరంగా అన్నాడీఎంకే పాలి‘ట్రిక్స్’!

ABN , First Publish Date - 2022-03-08T14:29:17+05:30 IST

అన్నాడీఎంకేలో రాజకీయాలు ఇపుడు రసవత్తరంగా మారాయి. వరుస ఓటములతో కుదేలైన ఆ పార్టీలో.. ఇప్పుడు వర్గపోరు తారస్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తు న్నాయి. అన్నాడీఎంకే వరుస ఓటములకు

రసవత్తరంగా అన్నాడీఎంకే పాలి‘ట్రిక్స్’!

- అనుచరులతో ఓపీఎస్‌ రహస్య భేటీ

- పోటీగా ఈపీఎస్‌ వర్గం కూడా 

- శశికళ ఎంట్రీపై చర్చ 


అడయార్‌(చెన్నై): అన్నాడీఎంకేలో రాజకీయాలు ఇపుడు రసవత్తరంగా మారాయి. వరుస ఓటములతో కుదేలైన ఆ పార్టీలో.. ఇప్పుడు వర్గపోరు తారస్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకే వరుస ఓటములకు పార్టీ నాయకత్వమే కారణమనే విమర్శలు బాహాటంగా వస్తున్నాయి. అదేసమయంలో పార్టీ బహిష్కృత నేత, జయలలిత స్నేహితురాలు శశికళను తిరిగి పార్టీలో చేర్చుకుని పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం కల్పించాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. మరోవైపు, మాజీ ముఖ్య మంత్రులు, పార్టీ రథసారథులైన ఓపీఎసీ, ఈపీఎస్‌ మధ్య మనస్పర్థలు తారస్థాయికి చేరాయనే ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం ఇటీవల తన సొంత జిల్లా తేనిలోని పెరియకుళం ఫాంహౌస్‌లో తన అనుచరులతో కీలక మంతనాలు జరిపారు. ఇందులో పార్టీలోకి శశికళను తిరిగి తీసుకోవాలంటూ ఒక తీర్మానం కూడా చేశారు. ఇది అన్నాడీఎంకేలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ సమన్వయకర్తగా ఉన్న ఓపీఎస్‌ సమక్షంలోనే ఈ తీర్మానం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఇదిలావుంటే, గత గురువారం తిరుచ్చెందూరులో బస చేసిన శశికళను ఓపీఎస్‌ సోదరుడు రాజా  కలుసుకుని, అన్నాడీఎంకేను ముందుండి నడిపించాలంటూ విఙ్ఞప్తి చేశారు. ఈ భేటీ ఓపీఎస్‌ అనుమతితోనే జరిగినట్టు ప్రతిఒక్కరూ బలంగా నమ్ముతున్నారు. దీంతో నష్టం జరగకుండా నివారణ చర్యలకు శ్రీకారం చుట్టిన ఓపీఎస్‌... పార్టీ ఉపసమన్వయకర్తతో కలిసి పార్టీ నుంచి రాజాను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.  ఇది కార్యకర్తలను మరింత గందరగోళానికి గురిచేసింది. ఇదిలావుంటే, శశికళతో భేటీ తర్వాత రాజా మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీ ఎంకేను ఓపీఎస్‌, ఈపీఎస్‌లు భూస్థాపితం చేశారని ఆరోపించారు. ఇదిలావుంటే, దక్షిణాది జిల్లాలకు చెందిన అనేక మంది పార్టీ నేతలు ఓపీఎస్‌తో వరుసగా సమావేశమవుతున్నారు. తాజాగా జరిగిన ఈ భేటీకి సంబంధించి అధికారపూర్వకంగా ఎక్కడా ప్రకటన చేయలేదు. పైగా, శశికళ, టీటీవీ దినకరన్‌లను తిరిగి పార్టీలో చేర్చుకుంటే ఎదురయ్యే అనుకూల, ప్రతికూల అంశాలను ఓపీఎస్‌కు వారు వివరించినట్టు వినికిడి. అదేవిధంగా ఎడప్పాడి పళనిస్వామి మద్దతు దారులు కూడా ఒక సమావేశాన్ని నిర్వహించినట్టు విశ్వసనీయ సమాచారం. అన్నాడీఎంకేను నడిపిస్తున్న ఇద్దరు కీలక నేతలకు చెందిన అనుచరులు పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తుండంతో దిగువశ్రేణి కార్యకర్తలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. పైగా పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగిన పక్షంలో అన్నాడీఎంకే రాజకీయాలు ఏ స్థాయికి దారితీస్తాయోనన్న భయం ఆ పార్టీ నేతల్లో నెలకొంది. 

Updated Date - 2022-03-08T14:29:17+05:30 IST