రోడ్డెక్కిన అన్నాడీఎంకే కార్యకర్తలు

ABN , First Publish Date - 2022-03-01T15:17:27+05:30 IST

అన్నాడీఎంకే నాయకుడు, మాజీ మంత్రి డి.జయకుమార్‌ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా చెన్నై సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట జరిగిన ఈ

రోడ్డెక్కిన అన్నాడీఎంకే కార్యకర్తలు

- జయకుమార్‌ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన

- ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లిన జిల్లా కేంద్రాలు


చెన్నై: అన్నాడీఎంకే నాయకుడు, మాజీ మంత్రి డి.జయకుమార్‌ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా చెన్నై సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట జరిగిన ఈ ఆందోళనలో వేల సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు జయకుమార్‌ అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెన్నై జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం జరిగిన ఆందోళనకు ఆదిరాజారాం, విరుగైరవి, వెంకటేష్‌బాబు, టి.నగర్‌ సత్యా, వేళచ్చేరి అశోక్‌, రాజేష్‌, కేపీ కందన్‌ సహా ఎనిమిది జిల్లాల నాయకులు నాయకత్వం వహించారు. పార్టీ స్థానిక నాయకులు, వివిధ విభాగాల నాయకులు పెరుంబాక్కం రాజశేఖర్‌, న్యాయవాది ఎ.పళని, టీసీ గోవింద సామి, ముగప్పేర్‌ ఇలంజెళియన్‌, ఇన్బనాధన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నాలో వెయ్యిమందికి పైగా కార్యకర్తలు పాల్గొని డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


తిరువళ్లూరులో... : తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట జరిగిన ఆందోళనకు పార్టీ నాయకులు మాధవరం మూర్తి, బీవీ రమణ, బలరామన్‌, అలెగ్జాండర్‌, మాజీ మంత్రి బెంజ్‌మెన్‌ తదితరులు నాయకత్వం వహించారు. మాజీ ఎంపీలు వేణుగోపాల్‌, హరి, అబ్దుల్‌ రహీమ్‌, పార్టీ వివిధ విభాగాలకు చెందిన రామ్‌కుమార్‌, పుట్లూరు చంద్రశేఖర్‌, వేల్‌మురుగన్‌, కందసామి, నేశన్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా తిరువళ్లూరు ఎస్పీ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాకు చంద్రశేఖర్‌ నాయకత్వం వహించారు. కాంచీపురం తాలూకా కార్యాలయం ఎదుట పార్టీ జిల్లా కార్యదర్శి సోమసుందరం, వాలా జాబాద్‌ గణేశన్‌ నాయకత్వంలో ధర్నా జరిగింది. చెంగల్పట్టు పాతబస్టాండు సమీపంలో జిల్లా  నాయకుడు చిట్లపాక్కం రాజేంద్రన్‌ నాయకత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనల్లో పార్టీ నాయకులు సంపద్‌కుమార్‌, గజా, గుణశేఖరన్‌, రవికుమార్‌, శీనివాసన్‌, సెంథిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


సేలంలో ఈపీఎస్‌...

సేలం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... రాష్ట్రంలో ప్రజలను మోసగించి డీఎంకే అధికారంలోకి వచ్చిందని, ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడి అన్ని చోట్లా గెలిచిందని ఆరోపించారు. చెన్నైలో పోలింగ్‌ సందర్భంగా నకిలీ ఓట్లు వేసిన డీఎంకే కార్యకర్తను మాజీ మంత్రి జయకుమార్‌ పట్టుఉకని పోలీసులకు అప్పగించారని, అయితే నేరస్తుడిని అప్పగించిన జయకుమార్‌ జైలులో ఉండగా, డీఎంకే కార్యకర్త నరేష్‌ ఆస్పత్రిలో సంతోషంగా బిర్యానీ తింటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే కార్యకర్త నరేష్‌పై ఎన్నో కేసులున్నాయని, బెయిలుకు వీలులేని కేసులు కూడా ఉన్నాయని, వాటిని పట్టించుకోకుండా అతడికి పోలీసులు అండగా ఉన్నారని ఎడప్పాడి విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత తాను పర్యటించిన అన్ని ప్రాంతాల్లో ప్రజలు అన్నాడీఎంకేకి ఓటేశామని, ఎందుకు గెలవలేక పోయారంటూ తనను ప్రశ్నిస్తున్నారని, అక్రమ పద్ధతుల్లోనే డీఎంకే కార్పొరేషన్‌, మునిసిపాలిటీ ఎన్నికల్లో గెలిచిందని ఎడప్పాడి విమర్శించారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే జయకుమార్‌ను డీఎంకే ప్రభుత్వం అరెస్టు చేసిందన్నారు.


మాజీ మంత్రి సెమ్మలైకి అస్వస్థత...

సేలం ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి సెమ్మలై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆందోళనలో పాల్గొన్న తరువాత ఎడప్పాడి ప్రసంగిస్తుండగా ఉన్నట్టుండి మూర్చిల్లి పడిపోయారు. కార్యకర్తలు ఆయనకు ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత సెమ్మలైని అంబులెన్స్‌లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.


 11 వరకు కస్టడీ

 మాజీ మంత్రి డి.జయకుమార్‌పై తాజాగా నమోదైన చేపల వలల తయారీ ఫ్యాక్టరీ కబ్జా కేసులో మార్చి 11 వరకు కస్టడీకి పంపుతూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా డీఎంకే కార్యకర్తను నిర్బంధించి, అర్ధనగ్నంగా ఊరేగించిన సంఘటనపై జయకుమార్‌ సహా 40 మంది అన్నాడీఎంకే కార్యకర్తలపై తండయార్‌పేట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో జయకుమార్‌ను అరెస్టు చేసి పూందమల్లి జైలుకు తరలించారు. తనకు ప్రథమశ్రేణి సదు పాయాలు కావాలని కోరటంతో పోలీసులు అతనిని పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఆ కేసులో బెయిలు కోసం తీవ్రంగా ప్రయ త్నిస్తున్న నేపథ్యంలో జయకుమార్‌పై సెంట్రల్‌ క్రైం విభాగం పోలీసులు మహేశ్‌ అనే బంధువుకు చెందిన చేపల వలలు తయారు చేసే ఫ్యాక్టరీని కబ్జా చేసి మోసగించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. సోమవారం ఆయన్ని పోలీసులు ఆలందూర్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరచగా, మార్చి 11 వరకు కస్టడీకి పంపుతూ మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులిచ్చారు. ఇదిలా వుండగా సోమవారం ఓపీఎస్‌, కేపీ మునుస్వామి, వైద్యలింగం, మనోజ్‌పాడ్యన్‌, జేసీడీ ప్రభాకరన్‌, మాధవరం మూర్తి, అంబత్తూర్‌ అలెగ్జాండర్‌ తదితరులు పుళల్‌ సెంట్రల్‌ జైలుకు వెళ్లారు. అయితే అక్కడ నిబంధనల మేరకు ముగ్గురికి మాత్రమే అనుమతి లభించింది. దీంతో ఓపీఎస్‌, మునుస్వామి, వైద్యలింగం మాత్రం లోపలి కెళ్లి జయకుమార్‌ను పరామర్శించారు.

Updated Date - 2022-03-01T15:17:27+05:30 IST