ఏఎన్‌ఎంల కౌన్సెలింగ్‌ వాయిదానే!

ABN , First Publish Date - 2022-08-17T05:55:21+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఏఎన్‌ఎంలను సర్దుబాటు చేసే ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది. ఇప్పటి కే రెండు పర్యాయాలు బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు తేదీలు ఇచ్చినా నర్సుల ఆందోళనతో వాయుదాపడుతూ వచ్చింది.

ఏఎన్‌ఎంల కౌన్సెలింగ్‌ వాయిదానే!
ఒంగోలులోని రిమ్స్‌ వద్ద ఆందోళన చేస్తున్న ఏఎన్‌ఎంలు (ఫైల్‌)

కోర్టును ఆశ్రయించిన ఇతర జిల్లాల నర్సులు

ఈనెల 25న అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశం

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 16: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఏఎన్‌ఎంలను సర్దుబాటు చేసే ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది. ఇప్పటి కే రెండు పర్యాయాలు బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు తేదీలు ఇచ్చినా నర్సుల ఆందోళనతో వాయుదాపడుతూ వచ్చింది. జిల్లాలో 224 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏఎన్‌ఎంల పోస్టులు ఖాళీగా ఉండగా ఆయా పోస్టుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సబ్‌ సెంటర్లలో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలను కౌన్సెలింగ్‌ ద్వారా నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా వైద్యారోగ్యశాఖాధి కారులు చర్యలు తీసుకున్నారు. ముందుగా రెగ్యులర్‌తోపాటు కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఏఎన్‌ఎంలను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ కౌన్సెలింగ్‌ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టడంతో వాయిదా వేసింది. రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలను మాత్రమే చేయాలని వర్క్‌ అడ్జెట్స్‌మెంట్‌ పేరుతో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు సుదూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆందోళనలు చేపట్టారు. నాలుగురోజుల క్రితం జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి రాజ్యలక్ష్మి నేతృత్వంలో కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపట్టగా ఎన్‌జీవో సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించి ఈ కౌన్సెలింగ్‌ను ఆపారు. తదనంతరం మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన బాలినేని వెంటనే డీఎంహెచ్‌వోకు ఫోన్‌ చేసి కౌన్సెలింగ్‌ను వాయిదావేయాలని సూచించడంతో నిలుపుదల చేశారు. అదేవిదంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు ఆందోళనబాట పట్టడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు.


హైకోర్టును ఆశ్రయించిన ఏఎన్‌ఎంలు

సర్దుబాటు విషయంపై పలు జిల్లాలకు చెందిన ఏఎన్‌ఎంలు హైకోర్టును ఆశ్రయించారు. తమను వర్క్‌ ఆడ్జెస్ట్‌మెంట్‌  పేరుతో బదిలీలను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అందువల్ల తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు అందుకు సంబంధించి ఈనెల 25న  అఫిడివిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదాపడింది. 



Updated Date - 2022-08-17T05:55:21+05:30 IST