వైభవంగా అంకమ్మతల్లి జాతర

ABN , First Publish Date - 2022-05-21T04:52:32+05:30 IST

మండలంలోని ఈదర గ్రామంలో గ్రామ దేవత అష్ట పద్మావల అంకమ్మ 150వ జాతర మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా పేరు గాంచిన అంకమ్మ తల్లి జాతరకు భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచే భక్తులు అమ్మవారికి మొక్కుబడి పొంగళ్ళు పెట్టి నైవేద్యాన్ని సమర్పించారు. గత ఏడాది జాతరకు వచ్చి కోర్కెలు మొక్కుకున్న వారికి అన్ని శుభాలు జరగటంతో ఈ ఏడాది మళ్లీ జాతరకు వచ్చి పొంగళ్లు పెట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈదర, చుట్టు పక్కల గ్రామాల వారు తమ మూగ జీవాలను తీసుకు వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేయించారు.

వైభవంగా అంకమ్మతల్లి జాతర
ప్రత్యేక అలంకరణలో కాట్ల అంకమ్మ (ఇన్‌సెట్లో) విశేష అలంకరణలో అంకమ్మ దేవత

అమ్మవారిని దర్శించుకునేందుకు

పోటెత్తిన భక్తులు 

 ఆకట్టుకున్న విద్యుత్‌ ప్రభలు 

అలరించిన కోలాట ప్రదర్శన

పెద్ద ఎత్తున అన్నదానం  

ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ దర్శి ఇన్‌చార్జి పమిడి , వైసీపీ నాయకుడు మద్దిశెట్టి శ్రీధర్‌

ముండ్లమూరు, మే 20 : మండలంలోని ఈదర గ్రామంలో  గ్రామ దేవత అష్ట పద్మావల అంకమ్మ 150వ జాతర మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా పేరు గాంచిన అంకమ్మ తల్లి జాతరకు భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచే భక్తులు  అమ్మవారికి మొక్కుబడి పొంగళ్ళు పెట్టి నైవేద్యాన్ని సమర్పించారు. గత ఏడాది జాతరకు వచ్చి కోర్కెలు మొక్కుకున్న వారికి అన్ని శుభాలు జరగటంతో ఈ ఏడాది మళ్లీ జాతరకు వచ్చి పొంగళ్లు పెట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈదర, చుట్టు పక్కల గ్రామాల వారు తమ మూగ జీవాలను తీసుకు వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేయించారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో ఆలయం పోటెత్తింది. జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. జాతరకు ఈదరతో పాటు బొప్పూడివారిపాలెం, భీమవరం, పూరిమెట్ల, కొమ్మవరం, అయోధ్య నగర్‌, ముండ్లమూరు, పసుపుగల్లు, పెద ఉల్లగల్లు, మారెళ్ళ, జమ్మల మడకతో పాటు గుంటూరు జిల్లా నూజెండ్ల, వినుకొండ, నరసరావుపేట, అద్దంకి, దర్శి, ఒంగోలు, గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.  టీడీపీ దర్శి ఇన్‌చార్జి పమిడి రమేష్‌, నియోజక వర్గ వైసీపీ నాయకుడు మద్దిశెట్టి శ్రీధర్‌లు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. 

భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం

 అంకమ్మ తల్లి జాతర సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాతరకు వచ్చిన భక్తులె దాదాపు 20వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మజ్జిగ, మంచి నీటి ప్యాకెట్లు కూడా సరఫరా చేశారు. 

ఆకట్టుకున్న విద్యుత్‌ ప్రభలు

  జాతర సందర్భంగా బొప్పూడివారిపాలెం, ఈదర, కొమ్మారం గ్రామాలకు చెందిన టీడీపీ, వైసీపీ వర్గీయులు ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్రభలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బొప్పూడివారిపాలెం టీడీపీ వర్గీయులు ఏర్పాటు చేసిన తడిక ప్రభ చూపరులను ఆకట్టుకుంది. ప్రభలపై పాట కచేరీలు నిర్వహించారు. 

ఆకట్టుకున్న పూరిమెట్ల కోలాటం ప్రదర్శన 

  అంకమ్మ తల్లి జాతర సందర్భంగా మండలంలోని పూరిమెట్ల గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు ఏర్పాటు చేసిన కోలాటం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. 

  భారీ బందోబస్తు

 జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దర్శి డీఎస్పీ వీ. నారాయణ స్వామి రెడ్డి పర్యవేక్షణలో సీఐ ఎం భీమానాయక్‌తో పాటు ముండ్లమూరు, దర్శి, కురిచేడు, తాళ్ళూరు, దొనకొండ ఎస్‌ఐలు ఎస్‌ మల్లిఖార్జునరావు, చంద్రశేఖర్‌, శివనాగరాజు, అంకమ్మ, నరసింహారావుతో పాటు వంద మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.  



Updated Date - 2022-05-21T04:52:32+05:30 IST