వైసీపీ దౌర్జన్యాలపై తొడగొట్టిన అంజిరెడ్డికి లోకేశ్‌ అభినందనలు

ABN , First Publish Date - 2021-10-20T04:52:13+05:30 IST

పుంగనూరులో గత ఏడాది జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్‌ వేయకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో తొడగొట్టి సవాల్‌ విసిరిన టీడీపీ నేత అంజిరెడ్డి మనోధైర్యాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభినందించారు.

వైసీపీ దౌర్జన్యాలపై తొడగొట్టిన అంజిరెడ్డికి  లోకేశ్‌ అభినందనలు
నారా లోకేశ్‌ను సన్మానిస్తున్న పుంగనూరు అంజిరెడ్డి

 అంజిరెడ్డి మనవరాలి పెళ్లికి రూ.3లక్షల కానుక

పుంగనూరు, అక్టోబరు 19: పుంగనూరులో గత ఏడాది జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్‌ వేయకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో తొడగొట్టి సవాల్‌ విసిరిన టీడీపీ నేత అంజిరెడ్డి మనోధైర్యాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభినందించారు. మంగళవారం హైదరాబాద్‌లో నారా లోకేశ్‌ను అంజిరెడ్డి, ఆయన మనమడు పవన్‌రెడ్డి కలిశారు. పుంగనూరు మండలం మార్లపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు అంజిరెడ్డి సింగరిగుంట ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ప్రహరీ దూకి లోనికి వెళ్లగా వైసీపీ కార్యకర్తలు నామినేషన్‌ పత్రాలు చించేశారు. ఆగ్రహించిన అంజిరెడ్డి వైసీపీ శ్రేణులకు ఎదురుతిరిగాడు. దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటుకోవాలని తొడగొట్టి ఛాలెంజ్‌ చేశాడు. ఈ విషయం అప్పట్లో మీడియాలో విస్తృతంగా వైరలైంది. అప్పటి నుంచి అంజిరెడ్డి టీడీపీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన లోకేశ్‌ను కలిశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నానని చివరి వరకు టీడీపీతోనే జీవిస్తానని తెలియజేశారు. తన మనవరాలు బీటెక్‌ చదివిందని, ఆమెకు త్వరలో వివాహం చేయాలని, బీటెక్‌ చదివిన మనవడు పవన్‌రెడ్డికి ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. ఉద్యోగ విషయం టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డికి చెబుతానని  అక్కడికి వెళ్లి కలవాలని లోకేశ్‌ తెలియజేశారు. మనవరాలి  పెళ్లి ఖర్చులకు  రూ.3లక్షలు అందజేశారని, టీడీపీ అభివృద్ధికి సంబంధించి తన మనవడు పవన్‌రెడ్డికి యువసైన్యంలో పనిచేసే అవకాశం కల్పించాలని కోరగా సానుకూలంగా స్పందించారాని అంజిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-20T04:52:13+05:30 IST