ఆర్‌కేపురంలో నాడు - నేడు’.. ఆసక్తికరంగా అనితారెడ్డి ప్రచారం

ABN , First Publish Date - 2020-11-25T16:35:20+05:30 IST

మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్‌కేపురం డివిజన్‌ నుంచి 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున తీగల అనితా హరినాథ్‌రెడ్డి పోటీ చేశారు.

ఆర్‌కేపురంలో నాడు - నేడు’.. ఆసక్తికరంగా అనితారెడ్డి ప్రచారం

నాడు కార్పొరేటర్‌ అభ్యర్థిగా.. నేడు జడ్పీ చైర్మన్‌ హోదాలో.. 

మరోవైపు మామ తీగల కృష్ణారెడ్డి సైతం... 


సరూర్‌నగర్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్‌కేపురం డివిజన్‌ నుంచి 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున తీగల అనితా హరినాథ్‌రెడ్డి పోటీ చేశారు. అప్పట్లో మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్న తీగల కృష్ణారెడ్డికి ఆమె కోడలు. దీంతో తన కోడలి గెలుపుకోసం కృష్ణారెడ్డి సైతం విస్తృత ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ బీజేపీ అభ్యర్థి రాధా ధీరజ్‌రెడ్డి చేతిలో అనిత ఓటమి పాలయ్యారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనిత మహేశ్వరం టికెట్‌ కోసం ప్రయత్నించారు. అధిష్ఠానం మాత్రం తమ సిటింగ్‌ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికే మళ్లీ అవకాశం కల్పించింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తీగల అనిత మహేశ్వరం జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. జిల్లాలో మెజారిటీ స్థానాలు రావడంతో ఆమె రంగారెడ్డి జడ్పీ పీఠాన్ని అధిష్ఠించారు.


ఇప్పుడు మళ్లీ ఆదే వార్డులో ప్రచారం..

నాడు కార్పొరేటర్‌గా గెలిచేందుకు ప్రచారం నిర్వహించిన అనిత, నేడు అదే డివిజన్‌లో తమ పార్టీ అభ్యర్థి మురుకుంట్ల విజయభారతి అరవింద్‌ శర్మకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తుండడం ఆసక్తికరం. అప్పుడు తనకు ఇవ్వని అవకాశాన్ని, ఈసారి తమ పార్టీ అభ్యర్థికైనా ఇవ్వాలని ఆమె ఓటర్లను కోరుతున్నారు. నాటి అభ్యర్థి నేడు జడ్పీ చైర్మన్‌గా తమ ముందుకు రావడం గురించి స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మరోవైపు అనితారెడ్డి మామ కృష్ణారెడ్డి సైతం ఆర్‌కేపురంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మామాకోడళ్లతో పాటు మంత్రి సబిత కూడా ప్రచారంలోకి దిగడంతో ఆర్‌కేపురంలో టీఆర్‌ఎస్‌ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.

Updated Date - 2020-11-25T16:35:20+05:30 IST