Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కన్నీటితో కబేళాలకు...

twitter-iconwatsapp-iconfb-icon

తీవ్రమైన గ్రాసం కొరత... భారమైన పశుపోషణ... పశువులను అమ్మేసుకుంటున్న రైతులు... ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు... అన్నదాతలకు వ్యవసాయంలో పశువులు ఆధారం. పాడి రైతులకు జీవనాధారం. అలాంటి వాటిని బిడ్డల్లా చూసుకుంటుంటారు. ప్రస్తుతం దుర్భిక్షం ఏర్పడింది. పశువులకు ఇంత మేత వేయలేని, వాటి ఆకలి తీర్చలేని దుస్థితి దాపురించింది. ఎక్కడా గడ్డిలేదు. ఎక్కడో ఒకచోట ఉన్నా.. కొందామంటే  ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చేసేదిలేక అన్నదాతలు పశువులను అమ్మేసుకుంటున్నారు. కబేళాలకే వెళ్తాయని తెలిసినా కన్నీటితో నిస్సహాయులై సాగనంపుతున్నారు.


బత్తలపల్లి/మడకశిర, మే17

పశుగ్రాసం కొరత తీవ్రమవడంతో కన్నబిడ్డల్లా పెంచుకున్న పశువులను పోషించుకోవడం రైతులకు భారంగా మారింది. మేతలేక, వాటిని మేపుకునే మార్గంలేక.. కబేళాలకు కన్నీళ్లతో సాగనంపుతున్నారు. జిల్లాలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. దీంతో పాడిపశువులను పోషించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌లో సాగుచేసిన వేరుశనగ, వరి పంటలు వర్షంలో తడిసి, పశుగ్రాసం పనికిరాకుండా పోయింది. దీనికితోడు రబీలో బోరుబావుల కింద కూడా వరి పంట వేయలేదు. ఈ కారణాలతో గ్రాసం కొరత తీవ్రమైంది. ఎక్కడన్నా ఉన్నా.. పశుగ్రాసం రేట్లు భారీగా పెరిగాయి. ట్రాక్టర్‌ గడ్డి రూ.12వేల నుంచి రూ.15వేల వరకు, వేరుశనగ పొట్టు రూ.25వేల నుంచి 30వేల వరకు పలుకుతోంది. దానిని ఇంటికి తెచ్చుకోవాలంటే అదనంగా రూ.5 వేల నుంచి 8వేల వరకు ఖర్చవుతోంది. దీంతో చాలామంది పాడిరైతులు పశుగ్రాసం కొని, పశువులను పోషించలేక అమ్మేసుకుంటున్నారు. శ్రీసత్యసాయి జిల్లావ్యాప్తంగా ఆవులు, ఎద్దులు 2.81 లక్షలు, గేదెలు 95 వేలు, గొర్రెలు 26.29 లక్షలు, మేకలు 4.72 లక్షలు ఉన్నాయి. ప్రస్తుతం వేసవి కావడంతో బీడు భూములు, కొండలు, గుట్టలలో పచ్చిగడ్డి లేక వేరుశనగ కట్టిమీదే ఆధారపడాల్సి వస్తోందని పాడిరైతులు, గొర్రెల కాపరులు వాపోతున్నారు. వేరుశనగ పొట్టు కొనలేని పరిస్థితి నెలకొందనీ, ప్రభుత్వం చొరవ చూపి, మూడు నెలలకు సరిపడా పశుగ్రాసాన్ని ఉచితంగా అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. గ్రాసం రేట్లు అధికంగా పెరిగినప్పటికీ పాల ధరలు మాత్రం అంతంతమాత్రమే ఉన్నాయి. ఆవు పాలు లీటరు రూ.25నుంచి రూ.30 ఉండగా, గేదె పాలు రూ.40 నుంచి రూ.50 మాత్రమే ఉన్నాయి. పశుగ్రాసం కొని పశువులను మేపినప్పటికీ గడ్డికి పెట్టిన డబ్బు కూడా రాదని పాల రైతులు వాపోతున్నారు.


8 వేల మెట్రిక్‌ టన్నులు అవసరం

జిల్లాలో ఇప్పటికే గ్రాసం కొరత ఉన్న ప్రాంతాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాకు 8వేల మెట్రిక్‌ టన్నుల గడ్డి అవసరమవుతోంని అంచనా వేశారు. సగానికిపైగా మండలాల్లోని పలు ప్రాంతాల్లో గ్రాసం కొరత తీవ్రంగా ఉంది. మే, జూనలో మరింత కొరత ఏర్పడనుంది. జిల్ల్లాలో 90వేల గేదెలు, ఆవులు, ఎద్దులు, దూడలు 2.81 లక్షలు, గొర్రెలు 26.29 లక్షలు, మేకలు 4.90 లక్షలు ఉన్నాయి. వాటికి గ్రాసం సమకూర్చలేని దుస్థితిలో రైతులున్నారు. దీంతో చేసేదిలేక పాడి పశువులను సైతం కబేళాలకు అమ్ముకుంటున్నారు. పశువులకు చాలినంత గ్రాసం వేయకపోవడంతో పాల దిగుబడి కూడా తగ్గుతోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే గడ్డి కేంద్రాలను ఏర్పాటుచేయాలనీ, లేనిపక్షంలో సబ్సిడీతోనైనా గడ్డి సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో పశువులను కబేళాలకు అమ్ముకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు.


ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి..

పాడిరైతులు.. పశువులను పోషించుకోవాలంటే గ్రాసం ధరలు చూసి బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంది. పాడిరైతులకు ప్రభు త్వం ఉచితంగా మూడునెలలపాటు గడ్డిని ఇచ్చి, ఆదుకోవాలి. లేదంటే రైతులందరూ తమ పశువులను అమ్ముకోవాల్సిందే.

- రమే్‌షబాబు, పాడిరైతు, బత్తలపల్లి


గడ్డి కొనలేం..

గడ్డి ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కొనలేని పరిస్థితి నెలకొం ది. ఒకవేళ ఎక్కడైనా కొన్నా.. తరలించాలంటే కూలీలు, ట్రాక్టర్‌ బా డుగలు అదనంగా మరో రూ.8 వేల వరకు భరించాలి. ఇంతటి ధర లు ఎన్నడూ చూడలేదు. పశువులను పోషించడం భారంగా ఉంది.

- ఓబులేసు, పాడిరైతు, బత్తలపల్లి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.