టపాసులు కాల్చుతున్న పిల్లలపై కోపంతో మహిళల్ని ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2021-11-06T14:39:33+05:30 IST

పావళి వచ్చిందంటే ముఖ్యంగా పిల్లలకు ఎక్కడ లేని హుషారు వస్తుంది. వీధిలోని పిల్లలంతా ఒక్కచోట చేరి టపాసులు కాలుస్తూ ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతుంటారు.

టపాసులు కాల్చుతున్న పిల్లలపై కోపంతో మహిళల్ని ఏం చేశాడంటే...

లక్నో : దీపావళి వచ్చిందంటే ముఖ్యంగా పిల్లలకు ఎక్కడ లేని హుషారు వస్తుంది. వీధిలోని పిల్లలంతా ఒక్కచోట చేరి టపాసులు కాలుస్తూ ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతుంటారు. అయితే పిల్లలకు టపాసులు కాల్చుతూ సందడి చేస్తుండటాన్ని భరించలేకపోయిన ఓ వ్యక్తి ఏకంగా పిల్లలపైనే యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. పిల్లలు తప్పించుకోవడంతో ఇద్దరు మహిళలపై యాసిడ్ పడి సదరు మహిళలు తీవ్ర స్థాయిలో గాయపడ్డారు. ఉత్తర‌ప్రదేశ్‌ బండా జిల్లా కైలాశ్‌పురిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 




ఎస్పీ అభినందన్ కథనం మేరకు.. బండిపై పండ్లు అమ్ముకునే ఓ వ్యక్తి పిల్లలు టపాసులు కాలుస్తూ అల్లరి చేస్తుండటాన్ని సహించలేకపోయాడు. పిల్లలను అల్లరి చేయవద్దని.. టపాసులు కాల్చడం ఆపేయమని హెచ్చరించాడు. కానీ పిల్లలు వినకపోవడంతో ఒక చిన్నారిపై చేయి చేసుకున్నాడు. దీంతో అది కాస్తా ఒక గ్రూప్ వార్‌లా మారిపోయింది. రెండు గ్రూపులుగా విడిపోయి గొడవకు దిగారు. పట్టలేని ఆగ్రహంతో సదరు పండ్లు అమ్ముకునే వ్యక్తి తన ఇంటిలో నుంచి యాసిడ్ తెచ్చి పిల్లలపైకి విసిరాడు. వారు తప్పించుకోవడంతో అక్కడే కూర్చొని ఉన్న ఇద్దరు మహిళలపై యాసిడ్ పడింది.




యాసిడ్ దాడిలో గాయపడిన ఇద్దరు మహిళల్లో ఒకరికి 70 ఏళ్లు కాగా.. మరొకరికి 18 ఏళ్లు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడు ఆ సమయంలో ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నప్పటికీ తరువాత పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.  

Updated Date - 2021-11-06T14:39:33+05:30 IST