Father Cruelty: తెగిపడిన చేతిని పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడో వ్యక్తి.. ఆ చేయి ఎవరిదో.. అసలేం జరిగిందో తెలిసి..!

ABN , First Publish Date - 2022-08-05T18:02:36+05:30 IST

ఓ చేతిలో తెగిపడిన చేతిని పట్టుకుని మరో చేతిలో గొడ్డలితో పోలీస్ స్టేషన్‌లో కాలుపెట్టిన ఆ వ్యక్తిని చూసి పోలీసులే నిర్ఘాంతపోయారు. తెగిపడిన ఆ చేయి తన కుమారుడిదని, తన కొడుకు చేతిని తానే నరికేశానని అతడు చెబుతుంటే పోలీసులకు నోటమాట రాలేదు.

Father Cruelty: తెగిపడిన చేతిని పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడో వ్యక్తి.. ఆ చేయి ఎవరిదో.. అసలేం జరిగిందో తెలిసి..!

ఇంటర్నెట్ డెస్క్: తెగిపడిన చేతిని ఓ చేతిలో పట్టుకుని మరో చేతిలో గొడ్డలితో పోలీస్ స్టేషన్‌లో కాలుపెట్టిన ఆ వ్యక్తిని చూసి పోలీసులే నిర్ఘాంతపోయారు. తెగిపడిన ఆ చేయి తన కుమారుడిదని, తన కొడుకు చేతిని తానే నరికేశానని అతడు చెబుతుంటే పోలీసులకు నోటమాట రాలేదు. కొడుకు చేతిని ఎందుకు నరకాల్సి వచ్చిందో అతడు చెప్పిన కారణం విని విస్తుపోవడం వారి వంతైంది. కన్నబిడ్డపైనే కర్కశత్వం ప్రదర్శించిన నిందితుడిని వారు వెంటనే అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్(Madhyapradesh) దామో జిలాల్లో(Damoh) జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..


బోబాయ్ గ్రామానికి చెందిన మోతీ కచ్చీ(52) అనే వ్యక్తికి ఓ కుమారుడు ఉన్నాడు. అతడి పేరు సంతోష్(28). అయితే..గురువారం మోతీ తన కుమారుడిని బైక్ తాళంచెవులు(keys)  ఇవ్వమని అడిగాడు. బైక్ ఇవ్వడం కుదరదని సంతోష్ తేల్చిచెప్పాడు. ఇది మోతీకి కోపం తెప్పించింది. దీంతో.. అతడు తన సోదరుడు రామ్‌ కిషన్‌తో కలిసి సంతోష్‌తో గొడవపడ్డాడు. ఇద్దరు కలిసి సంతోషన్‌ను బాగా కొట్టారు. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన మోతీ.. సమీపంలోని గొడ్డలిని తీసుకుని సంతోష్ చేయి నరికేశాడు. దీంతో.. అతడు కిందపోయి బాధతో విలవిల్లాడాడు. కళ్ల ముందే కన్నకొడుకు నొప్పితో నరకం అనుభవిస్తున్నా కూడా మోదీ మనసు మారలేదు. ఆ తరువాత.. అతడు తెగిపడిన చేయిని తీసుకుని, గొడ్డలిని భుజం మీద వేసుకుని నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 


రక్తం ఓడుతున్న గొడ్డలి, తెగిపడిన చేతిని చూసి పోలీసుల తొలుత షాకైపోయారు. కన్న కొడుకు చేయినే అతడు నరికేశాడని తెలిసి ఆశ్చర్యపోయారు. మరోవైపు..సంతోష్ భార్య అతడిని పోలీసు వాహనంలో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ సంతోష్‌కు ప్రాథమిక చికిత్స అనంతరం..అతడిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంతోషన్‌ను తెగిపడిన చేయితో సహా వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చి వచ్చి ఉంటే చేయిని మళ్లీ జోడించగలిగి ఉండేవారమని అక్కడి వైద్యులు తెలిపారు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో ఇక చేయిని మళ్లీ అతడికించడం సాధ్యం కాదని చెప్పారు. 


వివాదానికి మూలం ఇదీ.. 

సంతోష్ తన బైక్‌ను లోన్‌పై తీసుకున్నాడు. ప్రస్తుతం నెలనెలా ఈఎమ్‌ఐలు కడుతున్నాడు. ఈ విషయంలో సాయం చేయాలని తండ్రిని పలుమార్లు కోరగా అతడు నిరాకరించాడు. అయితే.. తనకు అవసరమైనప్పుడల్లా తండ్రి బైక్ తీసుకెళ్లడం సంతోష్‌కు కోపం తెప్పించింది. ఈ క్రమంలో మరోసారి బైక్ కావాలని తండ్రి కోరగా సంతోష్ నిరాకరించాడు. దీంతో.. ఇద్దరి మధ్యా  వివాదం తలెత్తి చివరికి ఈ దారుణానికి దారితీసింది. 

Updated Date - 2022-08-05T18:02:36+05:30 IST